సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరొ స్తుందని కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువును పెంచితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. పంట ల నష్టంపై నివేదికలూ కేంద్రానికి ఇవ్వడం లేద న్నారు.
మంగళవారం అసెంబ్లీ మీడియా హాలులో విలేకరులతో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుబంధు ను గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో ఎకరా పత్తి పంట నష్టపోతే ఫసల్ బీమాతో రూ.37 వేలు రైతుకు వస్తాయని, దీన్ని ఎందుకు ప్రజలకు చెప్పడంలేదని నిలదీశారు.
మైనారిటీ శాఖలో అడ్డదారిలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ వెనుక ఎంఐఎం హస్తం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ఆ భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించలేదని, దానిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయలేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment