నూలుపై 40 శాతం సబ్సిడీ | 40% Subsidy On Yarn | Sakshi
Sakshi News home page

నూలుపై 40 శాతం సబ్సిడీ

Published Wed, Aug 8 2018 2:00 PM | Last Updated on Sat, Aug 11 2018 2:08 PM

40% Subsidy On Yarn - Sakshi

కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

జనగామ: చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ నూలు పథకంలో 20 శాతం సబ్సిడీని 40 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని శాసన మండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నేత కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తాలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి బోడకుంటి వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం నూలు సబ్సిడీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు సహకార సంఘం సభ్యులతోపాటు సహకారేతర కార్మికులకు కూడా వర్తిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఐడీసీ ద్వారా అందిస్తున్న పది శాతం సబ్సిడీకి ఇది అదనమని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న సబ్సిడీ  జియో ట్యాగింగ్‌ చేసిన మగ్గాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 657 మంది లబ్ధిదారులకు రూ.24,94,720 నిధులను మంజూరు చేసేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సిఫారసు చేశారని చెప్పారు.

సబ్సిడీ నిధులను విడతల వారీగా లబ్ధిదారులకు డీబీటీ ద్వారా అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక భద్రతను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు భద్రతా పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 18 ఏళ్ల వయస్సు పైబడి, చేనేత వృత్తిపై 50 శాతం వచ్చే నేత కార్మికులు, అనుబంధ రంగాలైన డిజైనింగ్, డ్రైయింగ్, వార్పింగ్, సైజింగ్‌ కార్మికులు దీని పరిధిలోకి వస్తారని చెప్పారు. చేనేత కార్మికులు తమ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడంతోపాటు 8« శాతాన్ని ఆర్డీ–1 ఖాతాలో వేస్తే.. ఇందులో 16 శాతం ఆర్డీ ఖాతాలో ప్రభుత్వ వాటా కలుపుతుందన్నారు. ఈ పథకంలో ఇప్పటి వరకు 1,443 మంది చేరినట్లు స్పష్టం చేశారు.

రూ.2.30 కోట్ల రుణమాఫీ:కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

చేనేత కార్మికులకు ప్రభుత్వం రూ.2.30 కోట్ల రుణాలను మాఫీ చేసిందని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ.. వృత్తి కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని సూచించారు. మగ్గంపై పట్టు వస్త్రాల తయారీ కోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుతోపాటు ప్రభుత్వం నుంచి రుణ సదుపాయాన్ని కల్పించేందుకు లీడ్‌ బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడుతానని చెప్పారు. చేనేత కార్మికుల భద్రతను ప్రభుత్వం బాధ్యతగా చూస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో నేత కార్మికులను సెక్టార్ల వారీగా విభజించి, అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు దక్కేలా చూస్తామన్నారు. 

కడు పేదరికంతో ఉన్న వారికి మాత్రమే అంత్యోదయ కార్డులను ఇవ్వనున్నుట్ల తెలిపారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు సాగర్‌ మాట్లాడతూ ప్రభుత్వం అందిస్తున్న 16 శాతం వాటా ద్వారా 877 మందికి రూ.11.79 లక్షలు, 40 శాతం వాటాలో 276 మందికి రూ.24.76 లక్షలు అందించామని వివరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డీఆర్డీఓ మేకల జయచంద్రారెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ ఈశ్వరయ్య, సొసైటీ చైర్మన్‌ వేముల బాలరాజు, గుర్రం నాగరాజు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement