స్వయంశక్తి
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు
పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్‌గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి.
ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్‌కు సాంచాలు (పవర్‌లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.
కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్‌ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.
వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది.
మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.
నూలు పోగులే ఆశాదీపాలై...
సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్‌టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం.
మన్ కీ బాత్‌లో మా ఆయన గురించి
కొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్‌ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.
– వెల్ది రేఖ
– వూరడి మల్లికార్జున్
సాక్షి, సిరిసిల్ల
ఫోటోలు: వంకాయల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment