handloom industry
-
దేవుడికో నూలుపోగు
‘నా వల్ల ఎక్కడ అవుతుంది’ అనుకుంటే పరిష్కారం, విజయం ఎప్పుడూ కనిపించవు. ‘నా వల్ల ఎందుకు కాదు’ అనే ఆత్మవిశ్వాసం ఏ కొంచెం ఉన్నా పరిష్కారాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. ఆలయాల్లో దేవతా మూర్తుల పూజలకు అవసరమైన నూలు పోగులతో తయారైన మాలలు హైదరాబాద్, విజయవాడలాంటి పెద్ద పట్టణాల్లో కూడా దొరకడం లేదనే మాట విన్న రేఖ ఆ లోటును భర్తీ చేసేలా పవిత్ర మాలల తయారీకి పూనుకుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది.నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పూజారులు ఒకరోజు సిరిసిల్లకు వచ్చారు. తమిళనాడులో తయారైన ఒక పవిత్ర మాలను శాంపిల్‌గా తీసుకొచ్చి ‘ఇలాంటి మాలలు మాకు కావాలి. తయారు చేసి ఇవ్వగలరా’ అంటూ నేత కార్మిక కుటుంబానికి చెందిన వెల్ది రేఖ, హరిప్రసాద్ దంపతులను అడిగారు ఆ మాలలను పరిశీలించి, తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారు రేఖ, హరిప్రసాద్ దంపతులు. నాలుగు వైపులా మేకులు కొట్టి వాటికి నూలు పోగులను చుడుతూ, వేలాది పోగులతో ఒక రూపం వచ్చాక దాన్ని అందమైన దండగా తీర్చిదిద్దాలి. ఈ పని చేయడానికి చాలా సమయం పడుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. పవిత్ర మాలలు హైదరాబాద్, విజయవాడలో ఎక్కడా దొరకడం లేదని, పూజాసామాగ్రి అమ్మే దుకాణాల్లో ఈ పవిత్ర మాలల కొరత ఉందని పూజారులు చెప్పారు. హరిప్రసాద్‌కు సాంచాలు (పవర్‌లూమ్స్) ఉన్నాయి. వాటిపై వినూత్నమైన వస్త్రాలను తయారు చేస్తాడు. అయితే పవిత్ర మాలలను తయారు చేసే బాధ్యతను భార్య రేఖకు అప్పగించాడు. ‘నేను చేయలేనేమో’ అని రేఖ అనుకొని ఉంటే మంచి అవకాశం చేజారి పోయి ఉండేది.కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్తగా ప్రయత్నించడం అంటే... మొదటి నుంచి ఆసక్తి ఉన్న రేఖ ‘నేను తయారు చేయగలను’ అంటూ పనిలోకి దిగింది. నాలుగు వైపులా మేకులు కొట్టడం, దాని చుట్టూరా నూలు పోగులను ఒక్కొక్కటి చుట్టడం కష్టమైన పని కావడంతో తమ దగ్గర ఉండే నూలు బింగిరిలను, సైకిల్ హబ్‌ను, నాలుగు పట్టీలను వెల్డింగ్ చేయించి, చిన్న మోటారు సాయంతో నేరుగా నూలు పోగులు ఆ నాలుగు పట్టీలకు చుట్టుకునే విధంగా ప్రత్యేక మిషన్ ను తయారు చేయించారు రేఖ, హరిప్రసాద్.వినూత్న ఆలోచనతో మిషన్ రూపుదిద్దుకోవడంతో పని సులభమైంది. ధర్మవరం నుంచి హార్ట్ సిల్క్, పట్టు పోగుల నూలు దిగుమతి చేసుకుని ఆ మిషన్ పై దండలను తయారు చేయడం మొదలు పెట్టింది రేఖ. క్రమంగా వీటికి డిమాండ్ పెరగడం మొదలైంది. మాలల తయారీ ద్వారా ఇతర మహిళలకు కూడా ఉపాధి చూపుతోంది రేఖ. ఇప్పుడు రేఖ, ఆమె బృందం తయారు చేస్తున్న పవిత్ర మాలలు సిరిసిల్లకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నిజామాబాద్... మొదలైన పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘మరింత కష్టపడితే వ్యాపారాన్ని పెద్దస్థాయికి తీసుకువెళ్లవచ్చు అనిపిస్తుంది’ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది రేఖ. ఎన్నో పెద్ద విజయాలు చిన్న విజయాలతోనే మొదలయ్యాయి. రేఖ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మరిన్ని విజయం సాధించాలని ఆశిద్దాం.నూలు పోగులే ఆశాదీపాలై...సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగం ప్రభుత్వ ఆర్డర్లు లేక, రాక సంక్షోభంలో ఉంది. ‘టెక్స్టైల్ పార్క్’లాంటి ఆధునిక మగ్గాల సముదాయం మూతపడి వేలాదిమంది కార్మికులు ఉపాధి కోసం దిక్కులు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రేఖ సాధించిన విజయం ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ‘కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తే... కొత్త దారి కనిపిస్తుంది’ అనే భరోసాను ఇస్తోంది. ఎక్కడెక్కడి నుంచో పవిత్ర మాలల కోసం సిరిసిల్లకు వస్తున్నారు. ఇక్కడ తయారైన మాలలు ఎక్కడెక్కడికో ఎగుమతి అవుతున్నాయి. ఇది చిన్న విజయమే కావచ్చు. సంక్షోభ సమయంలో స్వయంశక్తిని గుర్తుకు తెచ్చి ఉత్సాహాన్ని ఇచ్చే విజయం. మన్ కీ బాత్‌లో మా ఆయన గురించికొత్తగా ఆలోచించడం, కష్టపడి పనిచేసే విషయంలో నా భర్త హరిప్రసాద్ నాకు స్ఫూర్తి. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీర, ఉంగరంలో దూరిపోయే పట్టు చీరలను ఆవిష్కరించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. జీ 20 లోగోను మగ్గంపై వస్త్రంపై నేసి ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. చేనేత వస్త్రంపై జీ 20 లోగోను చూసిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో హరిప్రసాద్‌ను అభినందించారు. వస్త్రాలపై చిత్రాలను ఆవిష్కరించే నైపుణ్యాన్ని అభినందిస్తూ నన్ను, మా ఆయనను అప్పటి గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ కు ఆహ్వానించి సన్మానించారు.– వెల్ది రేఖ– వూరడి మల్లికార్జున్సాక్షి, సిరిసిల్లఫోటోలు: వంకాయల శ్రీకాంత్ -
‘పదేళ్ల తర్వాత.. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభమా?’
హైదరాబాద్, సాక్షి: చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టిందని.. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోవట్లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తాజాగా ఓ ఘాటు లేఖ రాశారాయాన. ‘‘నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకింత కక్ష?. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా?. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా??. పదేళ్ల తర్వాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అని లేఖలో కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమను నమ్ముకున్నవాళ్ల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు ఈ ప్రభుత్వం ఆర్డర్లు ఆపేసిందని ఆరోపించారు కేటీఆర్. చేనేత మిత్రా వంటి పథకాల్ని కాంగ్రెస్ సర్కార్ పక్కనపెట్టిందని ప్రస్తావించారాయన. ‘‘గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వేంటనే ఇవ్వాలి. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి, అవసరం అయితే మరింత సాయం చేయాలి. కేవలం గత ప్రభుత్వంపై దుగ్దతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు.. .. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని లేఖలో కేటీఆర్ హెచ్చరించారు. -
వైఎస్సార్ నేతన్న నేస్తంతో చేనేతల జీవితాల్లో వెలుగులు
మంగళగిరి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందని పలువురు చేనేత ప్రముఖులు ప్రశంసించారు. నగరంలోని జాతీయ రహదారి వెంట గల ఆర్ఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సదస్సు–2023 నిర్వహించారు. ముఖ్య అతిథి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం జగన్మోహన్రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని, నేతన్నలంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు.వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అంజన్ కర్నాటి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ సహాయ సహకారాలు అందిస్తోందని, కార్మికులకు అవసరమైన మగ్గాలు, రాట్నాలతో పాటు పేద కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, పంచుమర్తి అనురాధ, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు అంజన్ కర్నాటి(అమెరికా), డాక్టర్ హరనాథ్ పోలిచర్ల(డెట్రాయిట్), రమేష్ మునుకుంట్ల(కెనడా), రాజ్ అడ్డగట్ల (చికాగో), సారథి కార్యంపూడి(డల్లాస్), మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి నరహరి, పద్మశాలీయ కార్పొరేషన్ చైర్పర్సన్ జింకా విజయలక్ష్మి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, కుర్ణిశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ బుట్టా శారద, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర చేనేత సంస్థలను పునరుద్ధరించాలి సదస్సులో ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గాలకు చట్ట సభల్లో తగినన్ని సీట్లు కేటాయించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. చీరాల, రాజమహేంద్రవరం రూరల్, ఎమ్మిగనూరు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, గాజువాక, పిఠాపురం అసెంబ్లీ స్థానాలతో పాటు, హిందూపురం, కర్నూలు, రాజమండ్రి పార్లమెంట్ స్థానాలను చేనేతలకు కేటాయించాలని తీర్మానించారు. చేనేత ఉత్పత్తులు చిలపల నూలుపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, నేషనల్ హ్యాండ్లూమ్ బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ చేనేత సంస్థలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాల బకాయిలు వెంటనే చెల్లించాలని తీర్మానించారు. -
121 కలర్స్, 121 డిజైన్ల ఇక్కత్
భూదాన్పోచంపల్లిః అగ్గిపెట్టెలో పట్టె చీరెను నేసి ఔరా అని పోచంపల్లి చేనేత కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతికెక్కారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచికి తగ్గట్టు చేనేత కళాకారులు ఇక్కత్ డిజైన్లను సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. తాజాగా పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య అనే చేనేత కళాకారుడు 121 రంగులు, 121 డిజైన్ల చీరెను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. ఇక్కత్ చీరెలో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా తాపత్రయం పడ్డాడు. నిరంతరం పరిశ్రమించి తన పదేళ్ల కలను సాకారం చేసుకొన్నాడు. 121 రంగులు, 121 డిజైన్ల చీరెను ఆవిష్కరణ.. కాగా భోగ బాలయ్య తనకు వచ్చిన ఆలోచనను చీరెపై ఆవిష్కరించాడు. 121 రంగులు, 121 రకాల డిజైన్లతో అద్బుతంగా చీరెను తయారు చేశాడు. అంతేకాక 11 రంగులతో ట్రెడిషనల్ టెంపుల్ ఆకృతి చీరెఅంచు దీని ప్రత్యేకత. అయితే 22 చిటికిలు, 1 చిటికికి 22 కొయ్యల, 6 కొలుకులతో చీరె తయారీకి ఉపయోగించాడు. కోయంబత్తూర్ నుంచి ప్రత్యేకంగా 2/20 నెంబర్ మస్టర్డ్ నూలును తెప్పించాడు. అలాగే నిలువు, పేక విధానంలో నిలువు 11, పేక (అడ్డం)లో 11 రంగులుగా విడదీసి రంగులద్దాడు. రంగులలో ముఖ్యంగా ఆకుపచ్చ, చిలుకపచ్చ, బంగారు వర్ణం, నీలి, గోధుమ, గ్రే, ఆరెంజ్, ఆనంద, లెమన్ ఎల్లో, వాయిలెట్, గులాబి ఉన్నాయి. ఇంత అద్భుతమైన చీరె నేయడానికి దీనివెనుక రెండేళ్ల శ్రమ దాగి ఉంది. అయితే ఈ చీరె పూర్తిగా వాస్ట్ కలర్స్, వాషబుల్, ఎకో ఫ్రెండ్లీ కావడం విశేషం. మంత్రి కేటీఆర్‌చే సన్మానం 121 రంగుల మల్టి కలర్స్, మల్టి మోటివ్స్ ఇక్కత్ చీరెను తయారు చేసిన భోగ బాలయ్య ప్రతిభను గుర్తించి ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించారు. జాతీయ అవార్డు కోసం ఎంట్రీ పంపించాడు. అదేవిధంగా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బాలయ్య రూపొందించిన మల్టికలర్స్ చీరెను చూసి అభినందించారు. చేనేత పరిశ్రమ గుర్తుండి పోవాలి: భోగ బాలయ్య చేనేతలో నూతన ఆవిష్కరణలు, కళల ద్వారా చేనేత పరిశ్రమ పదికాలాల పాటు మనుగడలో ఉంటుంది. అదేసమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా ఆరాటపడుతున్నాను. ఇందుకోసం గత రెండేళ్లుగా విభిన్న ఆలోచనలు, సృజనాత్మకంగా ఆలోచించి 121 డిజైన్లు, 121 రంగుల చీరెను తయారు చేశాను. -
ఆన్లైన్లో ‘బందరు’ చీరలు
సాక్షి, మచిలీపట్నం: కరోనా దెబ్బకు కుదేలైన చేనేత పరిశ్రమ మళ్లీ కోలుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పరిశ్రమ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. కృష్ణా జిల్లాలో 58 చేనేత సహకార పరపతి సంఘాలున్నాయి. వాటిలో 37 చేనేత సంఘాల పరిధిలో 7,047 మంది సుమారు 5వేల మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.45 కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తులు తయారవుతున్నాయి. రాష్ట్రంలో 9 గజాల చీరల తయారీలో కృష్ణా జిల్లా చేనేత కార్మికులు ప్రసిద్ధి. రూ.700 నుంచి రూ.2 వేల వరకు విలువైన ఈ కాటన్ చీరలకు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారయ్యే వస్త్ర ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఇందులో 30 శాతం స్థానిక మార్కెట్లో విక్రయిస్తుండగా, 10 శాతం తూర్పు గోదావరి జిల్లా బండారులంక మార్కెట్‌కి తరలిస్తారు. జిల్లాలో ఒక్క పెడన మార్కెట్లోనే ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కరోనాతో కుదేలు... కరోనా దెబ్బకు చేనేత పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. లాక్డౌన్ సమయానికి రూ.6 కోట్ల వస్త్ర నిల్వలు పేరుకు పోగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మరో రూ.19.50 కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యాయి. వీటిని ఏ విధంగా అమ్ముకోవాలో తెలియక సొసైటీలు గగ్గోలుపెట్టాయి. ఊపిరిలూదిన ఆప్కో ప్రభుత్వాదేశాలతో సొసైటీల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వల్లో రూ.కోటిన్నర విలువైన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసింది. దసరా, దీపావళి పండుగలతో సుమారు రూ.6 కోట్లకు పైగా అమ్మకాలు జరగ్గా రూ.4 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతయ్యాయి. ఆన్లైన్లో అమ్మకాలకు శ్రీకారం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఈ–మార్కెటింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గోకాప్ వంటి ఆన్లైన్ కంపెనీలతో ఆప్కో ఒప్పందం చేసుకుంది. మేజర్ సొసైటీలన్నీ ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. ‘బందరు చీరలు’ పేరిట ఉత్పత్తులను ఆన్లైన్లో పెడుతున్నాయి. అమ్మకాలు ఊపందుకున్నాయి మా సొసైటీలో అక్టోబర్ నాటికి రూ.78 లక్షల విలువైన వస్త్రాలున్నాయి. వాటిలో రూ.10 లక్షల వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయగా, దసరా, దీపావళి సీజన్లలో రూ.30 లక్షల విలువచేసే చీరల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ మళ్లీ ఊపందుకుంటోంది. – కేఎన్ శ్రీనివాసరావు, మేనేజర్ ది పోలవరం వీవర్స్ సొసైటీ, పోలవరం చెన్నై సిల్క్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమ గాడిలో పడుతోంది. మాకు చెన్నై సిల్క్స్ నుంచి దాదాపు రూ.34 లక్షల విలువైన చీరలకు ఆర్డర్స్ వచ్చాయి. – శ్రీనివాసరావు, అరుణశ్రీ వీవర్స్ సొసైటీ, కప్పలదొడ్డి పరిశ్రమ మళ్లీ కోలుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలి తాలనిస్తున్నాయి. ఇప్పటికే రూ.1.45 కోట్ల విలువైన వస్త్రాలను రెండు విడతల్లో ఆప్కో కొనుగోలు చేసింది. ఆన్లైన్లో ఆర్డర్స్ మొదల య్యాయి. – ఎస్.రఘునందన, ఏడీ, చేనేత జౌళి శాఖ -
చేనేత సంఘాలకు అవినీతి మరక!
సాక్షి, రామన్నపేట(నల్గొండ) : చేతివృత్తులలో ప్రధానమైనది చేనేత. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పి స్తోంది చేనేత పరిశ్రమే. అటువంటి చేనేత పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకార వ్యవస్థను రూపొందించింది. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు ఎనలేని కృషి చేయారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆ చేతివృత్తి పరిశ్రమ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన చేనేత సహకార సంఘాలు చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో మొత్తం 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల్లో కలిపి 3600మంది వాటాదారులు ఉన్నారు. సహకారేతర రంగంలో మరో 3600మంది చేనేత కార్మికులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 5600 జియోట్యాగ్ వేయబడిన మగ్గాలు ఉన్నాయి. జియోట్యాగ్ వేయబడిన మగ్గాల ద్వారా 16,800మంది అనుబంధ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో చేనేత సహకార వ్యవస్థ క్రమేపి నిర్వీర్యమై పోతుంది. చేనేత సహకార సంఘాల నిర్వహణపై అవినీతి ఆరోపణలు రావడం, ఆరోపణలు వచ్చిన సంఘాల పాలక వర్గాల బాధ్యతలను నిలిపి వేసి విచారణల పేరుతో స్పెషలాఫీసర్లను నియమించడంతో ఆ సంఘాలు పూర్తిగా కుదేలు అవుతున్నారు. ఆర్డర్ ఫారాల ద్వారా పని కల్పించవలసిన సంఘాలకు అవినీతి మరక అంటుకోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సగం సంఘాలపై ఆరోపణలు జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలు ఉండగా వాటిలో సగం సంఘాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఐదు చేనేత సంఘాలు సెక్షన్ 51 విచారణను ఎదుర్కొంటుండగా మ రో నాలుగు సంఘాలలో పిటిషన్ ఎంక్వయిరీ నడుస్తోంది. పోచంపల్లి, సిరిపురం, ఇంద్రపాలనగరం, నేలపట్ల, వెలువర్తి సంఘాలపై సెక్షన్ 51 ఎంక్వయిరీ నడుస్తోంది. ఆలేరు, పుట్టపాక, రామన్నపేట సిల్క్, చౌటుప్పల్ సంఘాలపై పిటిషన్ ఎంక్వయిరీ కొనసాగుతోంది. మరో నా లుగు సంఘాలలో సాధారణ విచారణ జరుగుతోంది. సెక్షన్ 51 ఎంక్వయిరీ నడుస్తున్న సంఘాల పాలకవర్గాల స్థానంలో చేనేత జౌళిశాఖకు చెందిన డవలప్మెంట్ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. విచారణను ఎదుర్కొంటున్న సంఘాలలోని వాటా దారులకు సరైన ఉపాధి దొరకడం లేదు. తాము నేసిన వస్త్రాలను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. పైగా ఆ సంఘాల్లోని వస్త్రాలను కొనుగోలు చేయడానికి టెస్కో ప్రోక్యూర్మెంట్ అధికారులు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలకు కారణాలు.. సాధారణంగా పాలకవర్గాలు బ్యాంకులు ఇచ్చే క్యాష్క్రెడిట్ను డ్రా చేసి సొంతంగా వాడుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం ద్వారా, వాటాదారుడికి ఆర్డర్ ఫారంపై అతడికి తెలియకుండానే వస్త్రాలు అమ్మినట్లు రికార్డ్‌చేసి వచ్చే లాభంను వాడుకోవడం, ప్రభుత్వ సబ్సిడీలను దుర్వినియోగపరచడం వంటి సందర్భాల్లో ఆరోపణలు వస్తుంటాయి. అటువంటి ఆరోపణలు తీవ్రంగా వచ్చినప్పుడు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 లోని 51 సెక్షన్ ప్రకారం విచారణ జరుపుతారు. 51 సెక్షన్ ప్రకారం విచారణ.. సంఘాల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో, సంఘం నిర్వహణపై 2/3వంతు సభ్యులు విచారణ కోరినప్పుడు లేదా సంఘం నిర్వహణపై రిజిస్ట్రార్ అసంతృప్తిగా ఉన్న సందర్భంలో తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని 51వ సెక్షన్ ప్రకారం విచారణ జరపాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు విచారణ అధికారిగా వ్యవహరిస్తారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్న సందర్భంలో కమిషర్చే నియమించబడిన అధికారిచే విచారణ కొనసాగుతుంది. విచారణ నివేదికను సర్వసభ్య సమావేశాల్లో చర్చించి బాధ్యులపై చర్యలకు తీర్మానం చేస్తారు. చేనేత పరిశ్రమలో ఉమ్మడి జిల్లా ప్రసిద్ధి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి, పుట్టపాక పట్టు చీరలు, సిరిపురం బెడ్షీట్లు, మోత్కూరు, గుండాలలో ఉత్పత్తి అయ్యే దోవతులు, టవళ్లు, కొయ్యలగూడెం, వెల్లంకి, బోగారం, ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే డ్రెస్ మెటీరియల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. విచారణ కొనసాగుతోంది అవినీతి ఆరోపణలు వచ్చిన సంఘాల పనితీరుపై విచారణ కొనసాగుతోంది. ఐదు సంఘాలపై సెక్షన్ 51 ఎంక్వయిరీ జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక సంఘం విచారణ పూర్తయింది. నాలుగు సంఘాలపై ఇంకా పిటిషన్ ఎంక్వయిరీ నడుస్తోంది. విచారణ నడుస్తున్న సంఘాలలోని సభ్యులకు పని కల్పించడానికి ప్రత్యేక అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం త్రిఫ్డ్స్కీం, నూలు సబ్సిడీ పథకాలు అమలు అవుతున్నాయి. – వెంకటేశ్వర్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు, యాదాద్రిభువనగిరి -
అదే గిఫ్ట్ కావాలి..
చేనేత కళాత్మక సంపద.. సాంస్కృతిక జీవితానికి ప్రతీక.. విభిన్న సంస్కృతుల సమాహారం. శతాబ్దాల చేనేత ప్రస్థానంలో ఉత్థాన పతనాలు ఉన్నప్పటికీ.. ఈ వస్త్రరాజం వన్నె మాత్రం తగ్గలేదు. వస్త్ర ప్రపంచంలో ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న సంప్రదాయ చేనేత.. ఇప్పుడు సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. ఆధునికతను అందిపుచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు.. సాధారణ ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు చేనేత దుస్తులు ధరించడం హుందాగా భావిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు చేనేతకు జై కొడుతున్నారు. పవర్‌లూమ్స్ వస్త్రాల వెల్లువతో ఆదరణ తగ్గి ఉపాధి కోల్పోయిన చేనేత కళాకారులను మగ్గాలు తిరిగి అక్కున చేర్చుకుంటున్నాయి. కార్మికుల నిరంతర శ్రమ, అద్భుతమైన డిజైన్లు రూపొందించే కళాకారుల ప్రతిభ చేనేతకు పట్టం కడుతున్నాయి. ఆధునిక డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల ఆదరణ చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాయి. అదే గిఫ్ట్ కావాలి చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చేనేత కార్మికుల కష్టాన్ని నేను దగ్గరగా చూశాను. వాళ్లకు నా వంతు సాయం చేయాలనే దృక్పథంతో బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను. సినిమాల్లో మినహాయించి ప్రతిసారీ చేనేత దుస్తులే ధరిస్తున్నాను. చేనేత దుస్తులే ధరించాలని ఇతర హీరోయిన్లకూ సూచిస్తున్నాను. నాకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే చేనేతకు సంబంధించిన వాటినే ఇవ్వమని ముఖంపైనే చెప్పేస్తున్నాను. – సమంత అక్కినేని, తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ ఎన్ని వ్యయప్రయాసలైనా భరించి ఎక్కడెక్కడో దాగిన ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్... వగైరాలను సిటీ డిజైనర్లు పోటాపోటీగా వెలుగులోకి తెస్తూ సంప్రదాయ వస్త్ర శైలులు, కళలకు ‘చే’యూతను అందిస్తుండడంతో పోచంపల్లి, మల్కా, దగ్గర్నుంచి నిన్నా మొన్నటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడని గిరిజన ప్రాంతపు ట్రైబల్ ఫ్యాషన్ సైతం ఇంటర్నేషనల్ వెన్యూలను లక్ష్యంగా మార్చుకుంటున్నాయి. సనత్‌నగర్: చేనేత కళ నలుదిశలా వ్యాపించేందుకు నగరంలోని ‘దస్తకార్ ఆంధ్రా’ ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. 2001లో నగరానికి చెందిన కొంతమంది కలిసి ‘దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ ట్రస్ట్’ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఎంతో మంది చేనేత కళాకారుల బతుకులకు భరోసా అందించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ట్రస్టీ శ్యామసుందరి ఏమంటున్నారంటే.. చేనేత మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో ఉంటాయి చేనేత దుస్తులు. ఒకప్పుడు చీరలు, పంచెలు తయారీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం సిటీ ప్రజల అభిరుచులకు అనుగుణంగా డ్రెస్‌లు, కుర్తాస్, దుప్పట్టా ఇలా.. అనేక రకాల ఉత్పత్తుల తయారీకి ట్రస్ట్ బీజం వేసింది. ప్రత్యేకంగా మార్కెటింగ్ కోసం 2008లో ‘దారం’ పేరిట షోరూంను ప్రారంభించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం ఆరు జిల్లాల్లోని చేనేత కళాకారులకు దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ ట్రస్ట్ తోడ్పాటునందిస్తోంది. 11 సహకార సంఘాలు..500 మంది చేనేతలకు ఉపాధి.. తెలుగు రాష్ట్రాల్లోని 11 సహకార సంఘాల్లోని 500 మంది చేనేత కళాకారులకు ట్రస్ట్ ద్వారా ఆర్డర్స్ అందుతున్నాయి. దారం షోరూంతో పాటు ఎగ్జిబిషన్ల ద్వారా వాటిని మార్కెటింగ్ చేస్తున్నారు. డిజైన్లు దగ్గర నుంచి రంగుల అద్దడం వరకు ట్రస్ట్ నిర్ణయం మేరకే చేస్తుంటారు. కేవలం దస్తకార్ సహకారం అందించే చేనేతలే కాకుండా ఎంతోమంది ఈ డిజైన్ల ఆధారంగా సొంతంగా తయారుచేసుకుని ఇతర మార్కెటింగ్ సంస్థలకు అందించి ఉపాధి పొందుతున్నారు. చేతితో నేసిన వస్త్రాలనే దస్తకార్ ఆంధ్రా మార్కెటింగ్ ట్రస్ట్ విక్రయిస్తుంది. నగరంలో వర్క్‌షాప్‌లు నగరంలో ఉండే నేటి తరానికి అసలు క్లాత్ ఎలా వస్తుంది, నేతన్నలు ఎంత కష్టపడితే తాము వేసుకున్న దుస్తులు బయటకు వస్తున్నాయి, ఎంత సమయం పడుతుంది, ఎంత ఓపిగ్గా దుస్తులు తయారు చేస్తున్నారో తెలియదు. ఈ క్రమంలో దారం షోరూంలో ప్రతియేటా తరచూ వర్క్‌షాప్‌ల ద్వారా నూలు వడకడం దగ్గర నుంచి క్లాత్ ఎలా తయారు చేస్తారో ప్రాక్టికల్‌గా చూపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ కాస్త వెనుకబాటే.. చేనేత వస్త్రాల వాడకంలో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ కాస్త వెనుకబాటులోనే ఉంది. మొదటి స్థానంలో పుణె, ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై నగరాలు ఉండగా తదుపరి స్థానంలో హైదరాబాద్ ఉంది. ట్రస్ట్ తరఫున ఆయా నగరాల్లో ఏడాదికి ఆరు వరకు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాం. పుణె నగరంలోనే ఎగ్జిబిషన్లకు ఎక్కువ ఆదరణ ఉంది. అవగాహన అవసరం.. నగరవాసుల అభిరుచులకు తగ్గట్లుగానే ఎన్నో డిజైన్లు, రంగుల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైనా రూ.300కే చేనేత వస్త్రాలు ఇస్తున్నామంటే శుద్ధ అబద్ధం. అది చేనేత కాదని నమ్మండి. ప్రభుత్వాలు సహకార సంఘాలకు రుణ సదుపాయాలు, మార్కెటింగ్ వంటి సౌకర్యాలను అందించాలి. అప్పుడే చేనేత కళాకారుల వలసలు తగ్గుతాయి. స్థిరమైన ఆదాయ మార్గాలు.. ‘డిమాండ్ ఉంటే సరే. లేనప్పుడు ఎలా? అందుకే చేనేత కళాకారులకు స్థిరమైన ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నా’ అన్నారు డాక్టర్ మమతా అల్లూరి. ఆరోగ్యంపై నగరవాసుల్లో పెరిగిన అవగాహన కూడా చేనేతలపై దృష్టి మళ్లేలా చేసిందంటున్నారామె. రసాయనాలు వినియోగంతో తయారయ్యే డైస్ వల్ల తప్పనిసరిగా ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుంది’అని వైద్య వృత్తి నుంచి డిజైనర్‌గా మారిన మమత అంటున్నారు. ప్రచారానికి సై.. ప్రస్తుతం హ్యాండ్లూమ్స్లో భాగమైన సిల్క్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు నగరానికి చెందిన శైలజారెడ్డి. కొంత కాలంగా చేనేత హస్తకళా ప్రదర్శనల ఏర్పాటుకు సహకరిస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు. సిటీలో పెద్ద సంఖ్యలో చేనేత వస్త్రాల ప్రదర్శనలు ఏర్పాటవుతుండడంపై స్పందిస్తూ... ‘నగర యువతలో చేనేత, పట్టు వస్త్రాలపై అవగాహన బాగా పెరిగింది. పాశ్చాత్య ప్రభావం కూడా బాగా ఉంది. పోటీని తట్టుకుని మనదైన హస్తకళలు విశ్వవ్యాప్తం అయేలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంది’అని ఆమె అభిప్రాయపడ్డారు. చేనేత కళాకారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వేర్ ద శారీ.. సేవ్ ద వీవర్ ‘దేశవ్యాప్తంగా 86 పల్లెల్లోని దాదాపు 500 మందికి పైగా చేనేత కళాకారులు నాకు రెగ్యులర్‌గా వర్క్ చేస్తుంటారు’’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ శ్రవణ్ కుమార్. ఏటేటా వేర్ ద శారీ సేవ్ ద వీవర్ పేరుతో ఆయన ప్రత్యేక ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చీరలను నేసిన నేతన్నలను కూడా వినియోగదారులకు పరిచయం చేస్తుంటారు శ్రవణ్. గొల్లభామతో గెలిపించి చేనేతలకు ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దే కళాకారుల ఆదాయం లేదు. దీని కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల ఫలాలు పూర్తిగా వారికి చేరడం లేదు. ఈ పరిస్థితులను మార్చాలి ఏదేమైనా సిద్దిపేట చేనేత కళాకారులకు ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం, మెరుగైన జీవనం కల్పించడానికి నా వంతు కృషి చేసినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు సునంద. సిద్ధిపేట కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన ఒకనాటి గొల్లభామ చీరల సందడి మళ్లీ ట్రెండీగా మారడానికి దోహదపడిన ఈ టెక్స్టైల్ నిపుణురాలు.. ప్రస్తుతం కర్ణాటకలో వీవర్స్‌తో పనిచేస్తున్నారు. ‘ఇక్కడ కూడా చేనేత కళాకారుల ఆదాయం రెట్టింపు చేయడమే ధ్యేయంగా, కనుమరుగవుతున్న హస్తకళలను వెలుగులోకి తీసుకువస్తున్నాం’ అని చెప్పారామె. నేత‘అన్న’మాట..వెలుగుల బాట మనవైన గ్రామీణ చేనేతలనే మన డిజైన్లకు వినియోగిద్దాం అని అన్నయ్య చెప్పాడు అంటూ గుర్తు చేసుకున్నారు మణికొండ నివాసి డిజైనర్ సిరి. దాదాపు 13 ఏళ్ల క్రితం తన అన్నయ్యతో కలిసి హ్యాండ్లూమ్స్కు పెద్దపీట వేస్తూ డిజైన్ల ఆవిష్కరణ సాగించారు. ‘అనంతపురంలోని ధర్మవరంతో పాటు తెలంగాణలోని ఇకత్ తదితర చేనేత ఫ్యాబ్రిక్స్‌ను విరివిగా వినియోగించాం. వీటితో వెస్ట్రన్ శైలి అవుట్ ఫిట్స్ కూడా రూపొందించాం’ అని చెబుతున్న సిరి... తన సోదరుని హఠాన్మరణం తర్వాత తన లేబుల్‌ని అన్నయ్య పేరుతో కలిపి హేమంత్సిరిగా మార్చారు. ‘నేడు హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న షోలో పాల్గొంటున్నాను’ అన్నారామె. -
జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: చేనేత పరిశ్రమను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మాజీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జాతీయ చేనేత బోర్డు సభ్యుడు కేఎన్ మూర్తి ఆ«ధ్వర్యంలో చేనేత రంగంపై జీఎస్టీ ప్రభావం అనే అంశంపై శనివారం ఇక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు, చేతి వృత్తి కార్మికులు పన్ను భారంతో ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎంపీ గుండు సుధారాణి పేర్కొన్నారు. చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కేటీఆర్‌ను కలిసి పన్ను మినహాయింపుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరతామని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ అమలు ఎత్తివేయాలంటూ చేనేత నాయకులు, కార్మికులు అనేక పోరాటాలు చేస్తున్నారని, తాను కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశానని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. దీనిపై తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల ఎంపీలందరూ ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేఎన్ మూర్తి మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేనేత రంగంపై జీఎస్టీ మినహాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేతపై పన్ను మినహాయింపు పోరాటంలో భాగంగా, ఈ నెల 3న తెలుగు రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని, ప్రధాని మోదీని, జీఎస్టీ సబ్ కమిటీని కలవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ కేంద్రం నుంచి సరైన సమాధానం రాకుంటే తెలుగు రాష్ట్రాల కలెక్టరేట్లలో వినతి పత్రాలివ్వడం ఆయా జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. జీఎస్టీ మినహాయింపు కోసం దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతో కలిసి కామన్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేత రంగంపై పన్ను మినహాయింపుపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనము వెనుకబడి ఉన్నామని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. తాను ఈ సమస్యపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోశిక యాదగిరి, పద్మశాలి యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
మగ్గాలపై..ఆఖరితరం!
సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్: చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికు లు మరో పని చేతకాక.. వయసు మీద పడినా.. కళ్లు కనిపించకున్నా.. ఒళ్లు సహకరించకున్నా.. కాళ్లు, చేతులు ఆడిస్తూ.. జానెడు పొట్టకోసం బట్ట నేస్తు న్నారు. ఎంత పనిచేసినా.. తక్కువ కూలీ వస్తుంది. మీటరు వస్త్రం నేస్తే రూ.17. దీంతో రోజంతా పని చేసినా.. రూ.100 రావడం కష్టం. మరో పని చేత కాని చేనేతను నమ్ముకున్న ఆఖరి తరం ఈ పనిలోనే కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికు లంతా 60ఏళ్ల పైబడిన వారే కావడం విశేషం. సిరిసిల్ల జిల్లాలో 175 మంది కార్మికులున్నారు. ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్టనేస్తున్న ఇతని పేరు మామిడాల చంద్రయ్య(92). సిరిసిల్ల విద్యానగర్‌లో ఉండే చంద్రయ్య చిన్ననాటి నుంచే చేనేత మగ్గంపై బట్టనేస్తున్నాడు. ఒకప్పుడు చేనేత వస్త్రాలు తయారుచేస్తూ బాగానే బతికాడు. ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చేతగాని పానం.. ఎముకలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడియ్యాలంటే రెక్కల్లో సత్తువ లేదు. దీంతో ఆయన పని మానేశారు. ఇప్పుడు చేనేత మగ్గాలపై బట్ట నేస్తున్న కార్మికులు పని మానేస్తే.. ఇక కొత్తగా చేనేత మగ్గాలను నడిపే వారు ఉండరు. చేనేత మగ్గాలకు ముసలితనం వచ్చింది. నేటి యువ ‘తరం’ చేనేత మగ్గాలను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. మగ్గం మరణశయ్యపై నిలిచింది. 1990లో సిరిసిల్లలో చేనేత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్యం కలిగిన శిక్షకులతో యువ కార్మికులకు ఆరునెలల శిక్షణ ఇచ్చేవారు. రూ.1200 ఉపకార వేతనం ఇస్తూ ప్రోత్సహించారు. చేనేత రంగంలో ఉపాధి అవకాశాలు లేక శిక్షణ పొందేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో సిరిసిల్లలోని శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్‌కు తరలించారు. అక్కడా ఇదే పరిస్థితి. తిరిగి 2015లో సిరిసిల్ల శివారులోని టెక్స్టైల్ పార్క్‌లోకి శిక్షణ కేంద్రాన్ని తరలించారు. మగ్గాల పరికరాలను ఓ అద్దె ఇంట్లో మూలన పడేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కేంద్రం మూలనపడింది. 17 చేనేత మగ్గాలు పనికి రాకుండా పోయాయి. -
‘చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించండి’
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి చేనేత రంగాన్ని మినహాయించి చేనేతకారుల జీవనోపాధిని రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. జీఎస్టీలో చేనేత రంగంపై పన్ను విధించడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన 4.5 కోట్ల మంది సామాన్యులు, అలాగే పరోక్షంగా ఆధారపడ్డ ఆరు కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎలాంటి పన్ను లేని కాటన్, నూలుపై ఐదు శాతం, సింథటిక్ ఫైబర్ నూలుపై 18 శాతం జీఎస్టీలో పన్ను విధించారన్నారు. దీని వల్ల చేనేత రంగం పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు. చాలా మంది చేనేతకారులు జీవనోపాధి కోసం ఇప్పటికే ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇది దేశ జీడీపీపై పెనుప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందువల్ల జీఎస్టీ విధింపు వల్ల చేనేత రంగంపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాన్ని పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు. -
జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి
- వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి - కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ సాక్షి, విజయవాడ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నుంచి చేనేత రంగాన్ని మినహాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోరారు. ఆ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి శుక్రవారం లేఖ రాశారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్రం ఈ వస్త్రాలకు జీఎస్టీ నుంచి మినహా యింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌లో వ్యవసాయం రంగం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడ్డారని గుర్తుచేశారు. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా నాలుగున్నర కోట్లు, పరోక్షంగా ఆరు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే... ఆ ప్రభావం కార్మికులందరిపైనా పడుతుంద న్నారు. జీఎస్టీ వల్ల వస్త్ర దుకా ణాలను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారుల్లో ఆందోళన నెల కొందన్నారు. కేవలం మూడు, నాలుగు శాతం లాభాలతో అమ్ముకునే వ్యాపా రులపై జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను పడుతోందన్నారు. పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న చేనేత రంగం జీఎస్టీ పన్నులతో పూర్తిగా కనుమరుగు అవు తుందన్నారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే ఉత్పత్తులు మరింత పెరిగే వీలుందని, కార్మికులకు ఊరట కలుగుతుందని జగన్ తన లేఖలో నివేదిం చారు. వైఎస్ జగన్ రాసిన లేఖను వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు విజయవాడలో మీడియాకు విడుదల చేశారు. -
చేనేత పరిశ్రమను ఆదుకోవాలి
ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత స్వరాజ్య వేదిక, తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో వీవర్స్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... ‘చేనేత వస్త్రాలు, ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించేలా అంతా కృషి చేయాలి. మన సంస్కృతి, జాతి, వారసత్వ సంపదైన ఈ రంగాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి... జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలి’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమల కోసం పాలసీని ప్రకటించి, ముడిసరుకులు సబ్సిడీ ధరల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలన్నారు. చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోషిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణ, హ్యాండ్లూమ్ డే రూపకర్త ఎ.వెంకన్న తదితరులు వాక్‌లో పాల్గొన్నారు. -
ఉపాధి కరువై నేతన్నల ఆత్మహత్యలు
చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా సన్నని దారంతో, చక్కని నేతతో చీరను నేయగల నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులు ఉపాధి కరువై బలవన్మరణాలకు బలవుతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తంచేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ పరిధి అక్కివారిపాలెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే రెండో అతిపెద్ద స్వయం ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ దయనీయంగా మారిందన్నారు. ఏటా పెరిగిపోతున్న అప్పులభారం, ఆకలి, పస్తులు, అనారోగ్యం, ఆకలి చావులు, ఆత్మహత్యల నిత్య కృత్యం అయ్యాయని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చేనేత వృత్తి పెనుసంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, మెగాక్లస్టర్, మినీ క్లస్టర్లంటూ కార్మికులను ప్రభుత్వాలు మాయచేశాయని తెలిపారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలుచేయాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ. 2వేల వంతున పింఛన్ అందించాలని, చేనేత మహిళలకు ప్రసూతి అలవెన్స్ నెలకు వెయ్యి రూపాయల వంతున 9 నెలల పాటు అందించాలని నాగార్జున డిమాండ్‌చేశారు. చంద్రబాబునాయుడు చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల సొసైటీలు దెబ్బతినే పరిస్థితి దాపురించిందని చెప్పారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో పరిశ్రమను ఎలా దెబ్బతీశారో.. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొందని విమర్శించారు. -
'ఆప్కో అవకతవకలపై విచారణ'
హైదరాబాద్ : ఆప్కోలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అందుకు కారణమైన వారిపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ చేనేత ఉత్పత్తులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత ఉత్పత్తులకు సరైన సదుపాయాలు కల్పిస్తామని చేనేత కార్మికులకు మంత్రి హామీ ఇచ్చారు. -
హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ ఎవర్గ్రీన్..
వైవిధ్యం చేనేత పరిశ్రమ అనగానే మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అనే మాట గుర్తుకు వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తూ ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లో దూసుకుపోతున్నారు చేనేత వీవర్స్. హ్యాండ్లూమ్స్ ఆల్వేస్ ఎవర్గ్రీన్ అంటూ కొత్తకొత్త డిజైన్స్‌ని మార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ‘చేనేత కలర్ వీవ్స్’లో. సౌత్ ఇండియాలో స్వయంగా చేనేత కార్మికులు నిర్వహించేసంస్థ ఇదొక్కటే. నల్లగొండ జిల్లా చౌటుప్పల్, నారాయణపురం, సిరిపురం, చిట్యాలతదితర 17 గ్రామాలకు చెందిన 120 మంది చేనేత కార్మికులు సెర్ప్ సహకారంతో ‘చేనేత కలర్ వీవ్స్’ను ప్రారంభించారు. ‘ఎంతోమంది రాజకీయు నాయకులు, సినిమావాళ్లు మేం తయారుచేసిన వాటిని ఇష్టంగా తీసుకుంటున్నార’ని మహిళా చేనేత కార్మికులు చెబుతున్నారు. విజయారెడ్డి -
చేనేతకు ఎన్నికల చిక్కుముడి
స్తంభించిన వ్యాపారం మందగించిన పనులు సంక్షోభంలో చేనేత రంగం సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమకు వరుస ఎన్నికలు కొత్తకష్టాలను తెచ్చిపెట్టాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలు ఎన్నికల పుణ్యమా అని దాదాపు నిలిచిపోయాయి. ఫలితంగా మదనపల్లె డివిజన్లో సుమారు రూ. 30 కోట్ల లావాదేవీలు ఆగిపోయాయి. మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్: మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో దాదాపు 30 వేల వరకు చేనేత మగ్గాలు ఉన్నాయి.దీనిపై దాదాపు 50 వేల మంది వరకు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముడిసరుకుల ధరలు పెరగడంతో చేనేత పరిశ్రమ కుదేలైంది. ఇదిలా ఉండగా మదనపల్లె పరిసరాల్లో ఉండే వ్యాపారులు పట్టుచీరలను బెంగళూరు, ధర్మవరం, చెన్నై నగరాలకు వెళ్లి అమ్మకాలు చేస్తుంటారు. మార్చి నుంచి మే నెల వరకు మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరిగాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో చీరలు తీసుకెళ్లి అమ్మకాలు చేసి డబ్బులు తీసుకురావడం కష్టంగా మారింది. దీనికి తోడు కొనుగోళ్లు మందగించాయి. నీరుగట్టువారిపల్లె(సిల్క్ టౌన్)లో దుకాణాల్లో స్టాకు నిలిచిపోయింది. ఇక్కడ రోజుకు సగటున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు డీలాపడిపోయారు. దీనికి తోడు చేనేత కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చినవారు అధికంగా ఉన్నారు. ఎన్నికలు ప్రారంభం కావడంతో వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారం, ఇతర పనుల నిమిత్తం పోటీ చేసే నాయకుల మద్దతు కోసం వెళ్లారు.దీంతో కార్మికులు లేకపోవడంతో మగ్గాల పనులు ఆగిపోయాయి. దాదాపు 80 శాతం మంది కార్మికులు ఎన్నికల కోసం తమ గ్రామాలకు వెళ్లిపోయారు. మగ్గాల పనులు ఆగిపోవడంతో వ్యాపారాలు లేక దుకాణాలు వెలవెలబోయాయి. ముడిసరుకుల ధరలు తగ్గించాలి ఎన్నికల కారణంగా చేనేత రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేతను ఆదుకునేందుకు ముడిసరుకుల ధరలు తగ్గిం చాలి. ధరలు తగ్గితే వ్యాపారులకు కొంత ఊరట కలుగుతుంది. మళ్లీ చేనేతరంగం కుదుట పడేలా చర్యలు తీసుకోవాలి. - సుధాకర్, చేనేత జనసమాఖ్య సంఘం అధ్యక్షులు, నీరుగట్టువారిపల్లె -
మగ్గం విలాపం
చీరాల, న్యూస్‌లైన్ : చాలీచాలని మజూరీలతో అవస్థ పడుతూ రంగురంగుల చీరలు నేస్తున్న నేతన్నల కోసం చేనేత ప్రత్యేక పరపతి బ్యాంక్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏడాది క్రితం ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. కుటుంబమంతా కలిసి పని చేస్తే పూట గడవని దుస్థితి వారిది. అప్పులు.. అనారోగ్యం.. ఆత్మహత్యలే ఆస్తులుగా మారాయి. వ్యవసాయం తర్వాత అతి పెద్ద వృత్తయిన చేనేత రంగానికి చేయూతనిస్తామని కొన్నేళ్లుగా చెబుతున్న ప్రభుత్వాలు చివరకు ‘చెయ్యి’స్తున్నాయి. ప్రభుత్వ పథకాలు కార్మికులకు చేరడం గగనంగా మారింది. ఆకలి..అనారోగ్యం.. వంటి సమస్యలతో ఎముకల గూడులాంటి శరీరాలతో చేనేత కార్మికులు జీవ చ్ఛవాలుగా మారారు. వారం రోజులు కురిసిన భారీ వర్షాలకు నేతన్నల మగ్గం మూగబోయింది. వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేతన్నల పరిస్థితి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన రాకతోనైనా చేనేతల కష్టాలు తీరుతాయో లేక ఎప్పటిలాగే ‘చెయ్యి’ ఇచ్చి వెళ్తారో వేచి చూడాలి. అరకొరగా క్రెడిట్ కార్డు రుణాలు చేనేతలకు క్రెడిట్ కార్డు స్కీం కింద రుణాలు అరకొరగా మంజూరు చేశారు. అధికార పార్టీ మెప్పు ఉన్న వారికి తప్ప మిగిలిన వారికి రుణాలు అందించలేదు. జిల్లాలో 33184 చేనేత మగ్గాలున్నాయి. 24 వేల కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలో 68 చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయి. చేనేత రుణాల కోసం 8,500 వేల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 1920 మందికి మాత్రమే రుణాలందాయి. ఒక్కొక్కరికి రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించి చేతులు దులుపేసుకున్నారు. రుణాల కోసం నేతన్నలు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అందని సబ్సిడీ జిల్లాలో సహకారేతర రంగంలో ఉన్న 80 వేల మంది చేనేత కార్మికులకు కూడా రంగు, రసాయనాలు, చిలపనూలు కొనుగోలుపై పది శాతం సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం 2008 మార్చిలో జీవో నంబర్-77 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క చేనేత కార్మికునికి కూడా సబ్సిడీపై చిలపనూలు, రంగు, రసాయనాలు అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పేరుకు మాత్రం సబ్సిడీ పథకాలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేస్తుందే తప్ప వాటి అమలుపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది. ప్రకటనలకే పరిమితం చేనేత రంగం అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక చేనేత పరపతి బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడుసార్లు ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. నూలు పాసు పుస్తకాలు ఇస్తామని కూడా చెప్పి వాటి గురించి పట్టించుకోవడం లేదు. క్రెడిట్‌కార్డు రుణాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు. రాష్ట్రంలో నాలుగు లక్షల మగ్గాలుంటే కేవలం నలభై వేల మందికి మాత్రమే క్రెడిట్ కార్డు రుణాలు అందించారంటే చేనేతలపై కిరణ్ సర్కార్ సవతి ప్రేమ చూపుతోందని అర్థమవుతోంది. నూలును ఎన్‌హెచ్‌డీసీ (నేషనల్ హ్యాండ్లూమ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్) ద్వారా అందిస్తామని చెప్పి హామీ కూడా నెరవేరలేదు. ఒక్క చీరాల నియోజకవర్గానికే నెలకు సగటున వెయ్యి నూలు బేళ్లు అవసరమవుతుండగా ప్రభుత్వం కేవలం రెండు వందల బేళ్లను మాత్రమే పంపడంతో అధిక ధరలకు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేతన్నల ఇబ్బందులను గుర్తించడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచన వేసేందుకు విపత్తు నివారణ నష్టపరిహార కమిటీ వేస్తామని చెప్పిన సీఎం మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేతన్నలను కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప వారి అభ్యున్నతికి పాటుడింది లేదు.