న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి చేనేత రంగాన్ని మినహాయించి చేనేతకారుల జీవనోపాధిని రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక విజ్ఞప్తి చేశారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. జీఎస్టీలో చేనేత రంగంపై పన్ను విధించడం వల్ల ఈ రంగంపై ఆధారపడిన 4.5 కోట్ల మంది సామాన్యులు, అలాగే పరోక్షంగా ఆధారపడ్డ ఆరు కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎలాంటి పన్ను లేని కాటన్, నూలుపై ఐదు శాతం, సింథటిక్ ఫైబర్ నూలుపై 18 శాతం జీఎస్టీలో పన్ను విధించారన్నారు.
దీని వల్ల చేనేత రంగం పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వివరించారు. చాలా మంది చేనేతకారులు జీవనోపాధి కోసం ఇప్పటికే ఇతర రంగాలను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇది దేశ జీడీపీపై పెనుప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందువల్ల జీఎస్టీ విధింపు వల్ల చేనేత రంగంపై పడుతున్న భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాన్ని పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు.