రెండున్నరేళ్లు గడుస్తున్నా..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వ వైఖరిని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 'రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఒక్క అడుగు వేయలేదు. ప్రత్యేక హోదాపై ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. చట్టంలో ఉన్న అంశాలను ఎందుకు అమలు చేయడం లేదు' అని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
మరో ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలన్నారు. ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని రేణుక డిమాండ్ చేశారు.