రాజీనామాలు చేసిన వైఎస్సార్ సీపీ ఎంపీలు (పాత ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదాపై రాజీనామాలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 5వ తేదీ సాయంత్రం లేదా 6వ తేదీ ఉదయం రావాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి లేఖ అందింది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
కాగా తాము సమర్పించిన రాజీనామాలను ఆలస్యం చేయకుండా తక్షణమే ఆమోదించాలంటూ స్పీకర్‌తో గత నెల (మే) 29న ఎంపీలు సమావేశం అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సభాపతి కోరినా ఎంపీలు ససేమిరా అన్నారు. పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి స్పీకర్‌తో భేటీ అయ్యారు.
అయితే ఎంపీల సమావేశం అనంతరం సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉన్న ఉద్వేగపూరిత పరిస్థితుల వల్ల రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోంది. లోక్‌సభ స్పీకర్‌గా వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీలకు సలహా ఇచ్చా. జూన్ 5 లేదా 6వ తేదీలోపు మరోసారి కలవాలని ఎంపీలకు సూచించా. అప్పటికీ నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తా.’ అని తెలిపిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment