
సాక్షి, న్యూఢిల్లీ : విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు మంగళవారం ఉదయం పార్లమెంట్ గేట్-1 వద్ద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్, విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకు ముందు ఢిల్లీలోని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా, రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి కాలింగ్ అటెన్షన్ నోటీసులు ఇచ్చారు.