సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై తాము ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు చర్చకు రాకపోవడాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిరసించారు. లోక్‌సభ స్పీకర్, ఎన్డీఏ సర్కారులు ఏపీ ప్రజల గొంతునొక్కేప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం సభ వాయిదా అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
నాలుగురోజులూ ఒకే డ్రామా: వైవీ
‘‘అవిశ్వాస తీర్మానికి 100 మందికి పైగా ఎంపీల మద్దతు ఉంది. ఐదే ఐదు నిమిషాల్లో స్పీకర్‌గారు కౌంటింగ్ చేసి, చర్చను ప్రారంభించొచ్చు. కానీ అది చెయ్యరు. అవిశ్వాసంపై సభలో నాలుగు సార్లూ ఒకే డ్రామా నడిచింది. ఈ విషయంలో టీఆర్‌ఎస్, ఏఐడీఎంకే ఎంపీల ఆందోళలనను తప్పుపట్టలేం. ఎందుకంటే సభ ఆర్డర్‌లో లేనప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక బిల్లులను ఆమోదించుకుంది. అవిశ్వాసంపై మాత్రం ద్వంద్వవిధానాన్ని అవలంభిస్తోంది. చర్చ జరిగేదాకా వైఎస్సార్‌సీపీ నోటీసులు ఇస్తూనేఉంటుంది’’ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
స్పీకర్‌ను పట్టించుకోరే!: మేకపాటి
‘‘రెండో విడత బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే టీఆర్‌ఎస్ ఆందోళనలను చేస్తోంది. ఈ మధ్యే ఏఐడీఎంకే కూడా వారికి తోడైంది. సభ ఆర్డర్‌లో ఉంటేనే చర్చ చేపడతానని, సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ గారు చెబుతున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేదాకా మేం పోరాడుతూనేఉంటాం’’ అని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు
అవిశ్వాసం పెట్టే నైతికత టీడీపీకి ఉందా: విజయసాయి
‘‘సాంకేతికంగానేతప్ప ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపెట్టే నైతిక హక్కు టీడీపీకి ఉందా? గడిచిన నాలుగేళ్లూ కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో టీడీపీ మంత్రులు కూడా భాగస్వాములే కదా, హోదా కాదు.. ప్యాకేజీనే ఇస్తామన్నప్పుడూ ఆ మంత్రులు సంతకాలు చేశారుకదా, ఇప్పటికిప్పుడు బయటికొచ్చి అదే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నారంటే.. ఇప్పటివరకు తీసుకున్నవన్నీ దుర్మార్గపు నిర్ణయాలేనని చెప్పకనే చెబుతున్నారా’ అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment