మార్మోగిన ‘హోదా’ | YSR Congress continues protest in Lok Sabha for special status to Andhra | Sakshi
Sakshi News home page

మార్మోగిన ‘హోదా’

Published Fri, Aug 5 2016 2:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

మార్మోగిన ‘హోదా’ - Sakshi

మార్మోగిన ‘హోదా’

వైఎస్సార్ సీపీ ఎంపీల నినాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్
* కేంద్రం జవాబివ్వాలి.. హోదా హామీని వెంటనే అమలుచేయాలి
* లోక్‌సభలో నాలుగో రోజు కొనసాగిన వైఎస్సార్ సీపీ ఎంపీల నిరసన
* సప్లిమెంటరీ డిమాండ్లపై చర్చలో మళ్లీ పట్టుబట్టిన వైవీ సుబ్బారెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయమై కేంద్రం సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటులో పట్టుపట్టింది. గురువారం ఉదయం 10.30కు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్ రెడ్డి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.

తక్షణం కేంద్రం స్పందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అంతకుముందే ప్రత్యేక హోదాపై చర్చకు వీలు సభా కార్యక్రమాలను వాయిదావేయాలని కోరుతూ వాయిదా తీర్మానానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బుట్టా రేణుక నోటీసు ఇచ్చారు. అయితే స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని, జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని సభాపతి సుమిత్రామహాజన్ పలుమార్లు పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానపు నోటీసులను తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు.

ఈ అంశంపై జీరో అవర్‌లో మాట్లాడాలని సూచించడంతో... సానుకూలంగా స్పందించి న ఎంపీలు తమ స్థానాల్లో వెళ్లి నిల్చున్నారు. ఈ సందర్భంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వగా ఆయన ప్రత్యేకహోదా అంశంపై ప్రశ్నించారు. ‘‘మేం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయాలన్న అంశంపై వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చాం. గడిచిన రెండేళ్లుగా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా జాప్యం చేస్తోంది. రాష్ట్రం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంది. మాకు పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు.

2014లో ఆంధ్రప్రదేశ్‌ను విడదీసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చింది. 26 నెలలు గడిచిన కేంద్రం ఈ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎప్పుడు ప్రకటిస్తుందో ఒక స్పష్టమైన  జవాబు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణం ప్రత్యేక హోదా వర్తింపజేయాలి. ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలి.

దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. మేం ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు. దీనిపై ఆర్థిక మంత్రి నిన్ననే సమాధానం ఇచ్చారని, ప్రతి రోజూ సమాధానం ఉండదని స్పీకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సమాధానం ఇవ్వనందున తాము వాకౌట్ చేస్తున్నామని సుబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
 
ప్రజలు సంతృప్తిచెందే మార్గం కనుక్కుంటాం: జైట్లీ

ఆంధ్రప్రదేశ్ సమస్యపై పరిష్కార మార్గం కనుక్కునే దిశగా చర్చ నడుస్తోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి ప్రకటించారు. గురువారం లోక్‌సభలో సప్లిమెంటరీ డిమాండ్లపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రసంగంలో ప్రత్యేక హోదాపై మరోసారి పట్టుపట్టారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని గట్టిగా కోరారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు.

‘‘సమస్యకు పరిష్కార మార్గం వెతకడంలో క్రియాశీలకమైన చర్చ నడుస్తోంది. నేను మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడాను. దీనిపై చర్చించేందుకు ఆయన ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతృప్తిచెందేలా ఒక పరిష్కార మార్గం కనుక్కుంటామన్న నమ్మకం ఉంది..’’ అని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారో చెప్పాలంటూ సుబ్బారెడ్డి పదేపదే కోరినా ఆర్థిక మంత్రి స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement