చిన్న అగ్గిపెట్టెలో పట్టేలా సన్నని దారంతో, చక్కని నేతతో చీరను నేయగల నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులు ఉపాధి కరువై బలవన్మరణాలకు బలవుతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తంచేశారు.
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పంచాయతీ పరిధి అక్కివారిపాలెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే రెండో అతిపెద్ద స్వయం ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ దయనీయంగా మారిందన్నారు. ఏటా పెరిగిపోతున్న అప్పులభారం, ఆకలి, పస్తులు, అనారోగ్యం, ఆకలి చావులు, ఆత్మహత్యల నిత్య కృత్యం అయ్యాయని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చేనేత వృత్తి పెనుసంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ, మెగాక్లస్టర్, మినీ క్లస్టర్లంటూ కార్మికులను ప్రభుత్వాలు మాయచేశాయని తెలిపారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలుచేయాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ. 2వేల వంతున పింఛన్ అందించాలని, చేనేత మహిళలకు ప్రసూతి అలవెన్స్ నెలకు వెయ్యి రూపాయల వంతున 9 నెలల పాటు అందించాలని నాగార్జున డిమాండ్‌చేశారు.
చంద్రబాబునాయుడు చేనేత పరిశ్రమను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల సొసైటీలు దెబ్బతినే పరిస్థితి దాపురించిందని చెప్పారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో పరిశ్రమను ఎలా దెబ్బతీశారో.. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొందని విమర్శించారు.