అదే గిఫ్ట్‌ కావాలి.. | National Handloom Day Special Story | Sakshi
Sakshi News home page

చేనేత సోయగం

Published Wed, Aug 7 2019 1:24 PM | Last Updated on Sat, Aug 10 2019 9:43 AM

National Handloom Day Special Story - Sakshi

చేనేత దుస్తుల్లో సమంత అక్కినేని

చేనేత కళాత్మక సంపద.. సాంస్కృతిక జీవితానికి ప్రతీక.. విభిన్న సంస్కృతుల సమాహారం. శతాబ్దాల చేనేత ప్రస్థానంలో ఉత్థాన పతనాలు ఉన్నప్పటికీ.. ఈ వస్త్రరాజం వన్నె మాత్రం తగ్గలేదు. వస్త్ర ప్రపంచంలో ఎప్పటికప్పుడు తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్న సంప్రదాయ చేనేత.. ఇప్పుడు సరికొత్త సొబగులు అద్దుకుంటోంది. ఆధునికతను అందిపుచ్చుకుంటోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు.. సాధారణ ఉద్యోగుల నుంచి సాఫ్ట్‌వేర్‌ నిపుణుల వరకు చేనేత దుస్తులు ధరించడం హుందాగా భావిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు చేనేతకు జై కొడుతున్నారు. పవర్‌లూమ్స్‌ వస్త్రాల వెల్లువతో ఆదరణ తగ్గి ఉపాధి కోల్పోయిన చేనేత కళాకారులను మగ్గాలు తిరిగి అక్కున చేర్చుకుంటున్నాయి. కార్మికుల నిరంతర శ్రమ, అద్భుతమైన డిజైన్లు రూపొందించే కళాకారుల ప్రతిభ చేనేతకు పట్టం కడుతున్నాయి. ఆధునిక డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల ఆదరణ చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాయి.

అదే గిఫ్ట్‌ కావాలి
చేనేత రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చేనేత కార్మికుల కష్టాన్ని నేను దగ్గరగా చూశాను. వాళ్లకు నా వంతు సాయం చేయాలనే దృక్పథంతో బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాను. సినిమాల్లో మినహాయించి ప్రతిసారీ చేనేత దుస్తులే ధరిస్తున్నాను. చేనేత దుస్తులే ధరించాలని ఇతర హీరోయిన్లకూ సూచిస్తున్నాను. నాకు ఎవరైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే చేనేతకు సంబంధించిన వాటినే ఇవ్వమని ముఖంపైనే చెప్పేస్తున్నాను.  – సమంత అక్కినేని, తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌  

ఎన్ని వ్యయప్రయాసలైనా భరించి ఎక్కడెక్కడో దాగిన ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్‌... వగైరాలను సిటీ డిజైనర్లు పోటాపోటీగా వెలుగులోకి తెస్తూ  సంప్రదాయ వస్త్ర శైలులు, కళలకు  ‘చే’యూతను అందిస్తుండడంతో పోచంపల్లి, మల్కా,  దగ్గర్నుంచి నిన్నా మొన్నటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడని గిరిజన ప్రాంతపు ట్రైబల్‌ ఫ్యాషన్‌ సైతం ఇంటర్నేషనల్‌ వెన్యూలను లక్ష్యంగా మార్చుకుంటున్నాయి.  

సనత్‌నగర్‌: చేనేత కళ నలుదిశలా వ్యాపించేందుకు నగరంలోని ‘దస్తకార్‌ ఆంధ్రా’  ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. 2001లో నగరానికి చెందిన కొంతమంది కలిసి ‘దస్తకార్‌ ఆంధ్రా మార్కెటింగ్‌ ట్రస్ట్‌’ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు. ఎంతో మంది చేనేత కళాకారుల బతుకులకు భరోసా అందించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ట్రస్టీ శ్యామసుందరి ఏమంటున్నారంటే..  చేనేత మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో ఉంటాయి చేనేత దుస్తులు. ఒకప్పుడు చీరలు, పంచెలు తయారీకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం సిటీ ప్రజల అభిరుచులకు అనుగుణంగా డ్రెస్‌లు, కుర్తాస్, దుప్పట్టా ఇలా.. అనేక రకాల ఉత్పత్తుల తయారీకి ట్రస్ట్‌ బీజం వేసింది. ప్రత్యేకంగా మార్కెటింగ్‌ కోసం 2008లో ‘దారం’ పేరిట షోరూంను ప్రారంభించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని మొత్తం ఆరు జిల్లాల్లోని చేనేత కళాకారులకు దస్తకార్‌ ఆంధ్రా మార్కెటింగ్‌ ట్రస్ట్‌ తోడ్పాటునందిస్తోంది.

11 సహకార సంఘాలు..500 మంది చేనేతలకు ఉపాధి..
తెలుగు రాష్ట్రాల్లోని 11 సహకార సంఘాల్లోని 500 మంది చేనేత కళాకారులకు ట్రస్ట్‌ ద్వారా ఆర్డర్స్‌ అందుతున్నాయి. దారం షోరూంతో పాటు ఎగ్జిబిషన్ల ద్వారా వాటిని మార్కెటింగ్‌ చేస్తున్నారు. డిజైన్లు దగ్గర నుంచి రంగుల అద్దడం వరకు ట్రస్ట్‌ నిర్ణయం మేరకే చేస్తుంటారు. కేవలం దస్తకార్‌ సహకారం అందించే చేనేతలే కాకుండా ఎంతోమంది ఈ డిజైన్ల ఆధారంగా సొంతంగా తయారుచేసుకుని ఇతర మార్కెటింగ్‌ సంస్థలకు అందించి ఉపాధి పొందుతున్నారు. చేతితో నేసిన వస్త్రాలనే దస్తకార్‌ ఆంధ్రా మార్కెటింగ్‌ ట్రస్ట్‌ విక్రయిస్తుంది.

నగరంలో వర్క్‌షాప్‌లు
నగరంలో ఉండే నేటి తరానికి అసలు  క్లాత్‌ ఎలా వస్తుంది, నేతన్నలు ఎంత కష్టపడితే తాము వేసుకున్న దుస్తులు బయటకు వస్తున్నాయి, ఎంత సమయం పడుతుంది, ఎంత ఓపిగ్గా దుస్తులు తయారు చేస్తున్నారో తెలియదు. ఈ క్రమంలో దారం షోరూంలో ప్రతియేటా తరచూ వర్క్‌షాప్‌ల ద్వారా నూలు వడకడం దగ్గర నుంచి క్లాత్‌ ఎలా తయారు చేస్తారో ప్రాక్టికల్‌గా చూపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాం.   

హైదరాబాద్‌ కాస్త వెనుకబాటే..
చేనేత వస్త్రాల వాడకంలో దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ కాస్త వెనుకబాటులోనే ఉంది. మొదటి స్థానంలో పుణె, ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై నగరాలు ఉండగా తదుపరి స్థానంలో హైదరాబాద్‌ ఉంది. ట్రస్ట్‌ తరఫున ఆయా నగరాల్లో ఏడాదికి ఆరు వరకు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాం. పుణె నగరంలోనే ఎగ్జిబిషన్లకు ఎక్కువ ఆదరణ ఉంది. 

అవగాహన అవసరం..  
నగరవాసుల అభిరుచులకు తగ్గట్లుగానే ఎన్నో డిజైన్లు, రంగుల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరైనా రూ.300కే చేనేత వస్త్రాలు ఇస్తున్నామంటే శుద్ధ అబద్ధం. అది చేనేత కాదని నమ్మండి. ప్రభుత్వాలు సహకార సంఘాలకు రుణ సదుపాయాలు, మార్కెటింగ్‌ వంటి సౌకర్యాలను అందించాలి. అప్పుడే చేనేత కళాకారుల వలసలు తగ్గుతాయి.  

స్థిరమైన ఆదాయ మార్గాలు..
 ‘డిమాండ్‌ ఉంటే సరే. లేనప్పుడు ఎలా? అందుకే చేనేత కళాకారులకు స్థిరమైన ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసేందుకు నేను ప్రయత్నిస్తున్నా’ అన్నారు డాక్టర్‌
మమతా అల్లూరి. ఆరోగ్యంపై నగరవాసుల్లో పెరిగిన అవగాహన కూడా చేనేతలపై దృష్టి మళ్లేలా చేసిందంటున్నారామె. రసాయనాలు వినియోగంతో తయారయ్యే డైస్‌ వల్ల తప్పనిసరిగా ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతుంది’అని వైద్య వృత్తి నుంచి డిజైనర్‌గా మారిన మమత అంటున్నారు.  

ప్రచారానికి సై..
ప్రస్తుతం హ్యాండ్లూమ్స్‌లో భాగమైన సిల్క్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు  నగరానికి చెందిన శైలజారెడ్డి. కొంత కాలంగా చేనేత హస్తకళా ప్రదర్శనల ఏర్పాటుకు సహకరిస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు.  సిటీలో పెద్ద సంఖ్యలో చేనేత వస్త్రాల ప్రదర్శనలు ఏర్పాటవుతుండడంపై స్పందిస్తూ... ‘నగర యువతలో చేనేత, పట్టు  వస్త్రాలపై అవగాహన బాగా పెరిగింది. పాశ్చాత్య ప్రభావం కూడా బాగా ఉంది. పోటీని తట్టుకుని మనదైన హస్తకళలు విశ్వవ్యాప్తం అయేలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంది’అని ఆమె అభిప్రాయపడ్డారు. చేనేత కళాకారుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామన్నారు.    

వేర్‌ ద శారీ.. సేవ్‌ ద వీవర్‌ 
‘దేశవ్యాప్తంగా 86 పల్లెల్లోని దాదాపు 500 మందికి పైగా చేనేత కళాకారులు నాకు రెగ్యులర్‌గా వర్క్‌ చేస్తుంటారు’’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్‌ శ్రవణ్‌ కుమార్‌. ఏటేటా వేర్‌ ద శారీ సేవ్‌ ద వీవర్‌ పేరుతో ఆయన ప్రత్యేక ఫ్యాషన్‌ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చీరలను నేసిన నేతన్నలను కూడా వినియోగదారులకు పరిచయం చేస్తుంటారు శ్రవణ్‌.

గొల్లభామతో గెలిపించి
చేనేతలకు ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా వాటిని తీర్చిదిద్దే కళాకారుల ఆదాయం లేదు. దీని కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల ఫలాలు పూర్తిగా వారికి చేరడం లేదు. ఈ పరిస్థితులను మార్చాలి ఏదేమైనా సిద్దిపేట చేనేత కళాకారులకు ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యం, మెరుగైన జీవనం  కల్పించడానికి నా వంతు కృషి చేసినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు సునంద. సిద్ధిపేట కేంద్రంగా ఓ వెలుగు వెలిగిన ఒకనాటి గొల్లభామ చీరల సందడి మళ్లీ ట్రెండీగా మారడానికి  దోహదపడిన ఈ టెక్స్‌టైల్‌ నిపుణురాలు.. ప్రస్తుతం కర్ణాటకలో వీవర్స్‌తో పనిచేస్తున్నారు. ‘ఇక్కడ కూడా చేనేత కళాకారుల ఆదాయం రెట్టింపు చేయడమే ధ్యేయంగా, కనుమరుగవుతున్న హస్తకళలను వెలుగులోకి తీసుకువస్తున్నాం’ అని చెప్పారామె.  

నేత‘అన్న’మాట..వెలుగుల బాట
మనవైన గ్రామీణ చేనేతలనే మన డిజైన్లకు వినియోగిద్దాం అని అన్నయ్య చెప్పాడు అంటూ గుర్తు చేసుకున్నారు మణికొండ నివాసి డిజైనర్‌ సిరి. దాదాపు 13 ఏళ్ల క్రితం  తన అన్నయ్యతో కలిసి హ్యాండ్‌లూమ్స్‌కు పెద్దపీట వేస్తూ డిజైన్ల ఆవిష్కరణ సాగించారు. ‘అనంతపురంలోని ధర్మవరంతో పాటు తెలంగాణలోని ఇకత్‌ తదితర చేనేత ఫ్యాబ్రిక్స్‌ను విరివిగా వినియోగించాం. వీటితో వెస్ట్రన్‌ శైలి అవుట్‌ ఫిట్స్‌ కూడా రూపొందించాం’ అని చెబుతున్న సిరి... తన సోదరుని హఠాన్మరణం తర్వాత తన లేబుల్‌ని అన్నయ్య పేరుతో కలిపి హేమంత్‌సిరిగా మార్చారు. ‘నేడు హ్యాండ్లూమ్స్‌ డే సందర్భంగా నిర్వహిస్తున్న షోలో పాల్గొంటున్నాను’ అన్నారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement