చేనేత పరిశ్రమను ఆదుకోవాలి
ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత స్వరాజ్య వేదిక, తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులో వీవర్స్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... ‘చేనేత వస్త్రాలు, ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించేలా అంతా కృషి చేయాలి. మన సంస్కృతి, జాతి, వారసత్వ సంపదైన ఈ రంగాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి... జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలి’ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమల కోసం పాలసీని ప్రకటించి, ముడిసరుకులు సబ్సిడీ ధరల్లో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలన్నారు. చేనేత స్వరాజ్య వేదిక కన్వీనర్ తడక యాదగిరి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోషిక యాదగిరి, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణ, హ్యాండ్‌లూమ్ డే రూపకర్త ఎ.వెంకన్న తదితరులు వాక్‌లో పాల్గొన్నారు.