భూదాన్‌పోచంపల్లిః అగ్గిపెట్టెలో పట్టె చీరెను నేసి ఔరా అని పోచంపల్లి చేనేత కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతికెక్కారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచికి తగ్గట్టు చేనేత కళాకారులు ఇక్కత్ డిజైన్‌లను సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. తాజాగా పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య అనే చేనేత కళాకారుడు 121 రంగులు, 121 డిజైన్‌ల చీరెను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. ఇక్కత్ చీరెలో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా తాపత్రయం పడ్డాడు. నిరంతరం పరిశ్రమించి తన పదేళ్ల కలను సాకారం చేసుకొన్నాడు.
121 రంగులు, 121 డిజైన్‌ల చీరెను ఆవిష్కరణ..
కాగా భోగ బాలయ్య తనకు వచ్చిన ఆలోచనను చీరెపై ఆవిష్కరించాడు. 121 రంగులు, 121 రకాల డిజైన్‌లతో అద్బుతంగా చీరెను తయారు చేశాడు. అంతేకాక 11 రంగులతో ట్రెడిషనల్ టెంపుల్ ఆకృతి చీరెఅంచు దీని ప్రత్యేకత. అయితే 22 చిటికిలు, 1 చిటికికి 22 కొయ్యల, 6 కొలుకులతో చీరె తయారీకి ఉపయోగించాడు. కోయంబత్తూర్ నుంచి ప్రత్యేకంగా 2/20 నెంబర్ మస్టర్డ్ నూలును తెప్పించాడు.
అలాగే నిలువు, పేక విధానంలో నిలువు 11, పేక (అడ్డం)లో 11 రంగులుగా విడదీసి రంగులద్దాడు. రంగులలో ముఖ్యంగా ఆకుపచ్చ, చిలుకపచ్చ, బంగారు వర్ణం, నీలి, గోధుమ, గ్రే, ఆరెంజ్, ఆనంద, లెమన్ ఎల్లో, వాయిలెట్, గులాబి ఉన్నాయి. ఇంత అద్భుతమైన చీరె నేయడానికి దీనివెనుక రెండేళ్ల శ్రమ దాగి ఉంది. అయితే ఈ చీరె పూర్తిగా వాస్ట్ కలర్స్, వాషబుల్, ఎకో ఫ్రెండ్లీ కావడం విశేషం.
మంత్రి కేటీఆర్‌చే సన్మానం
121 రంగుల మల్టి కలర్స్, మల్టి మోటివ్స్ ఇక్కత్ చీరెను తయారు చేసిన భోగ బాలయ్య ప్రతిభను గుర్తించి ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించారు. జాతీయ అవార్డు కోసం ఎంట్రీ పంపించాడు. అదేవిధంగా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బాలయ్య రూపొందించిన మల్టికలర్స్ చీరెను చూసి అభినందించారు.
చేనేత పరిశ్రమ గుర్తుండి పోవాలి: భోగ బాలయ్య
చేనేతలో నూతన ఆవిష్కరణలు, కళల ద్వారా చేనేత పరిశ్రమ పదికాలాల పాటు మనుగడలో ఉంటుంది. అదేసమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా ఆరాటపడుతున్నాను. ఇందుకోసం గత రెండేళ్లుగా విభిన్న ఆలోచనలు, సృజనాత్మకంగా ఆలోచించి 121 డిజైన్లు, 121 రంగుల చీరెను తయారు చేశాను.
Comments
Please login to add a commentAdd a comment