bhudanpochampalli
-
121 కలర్స్, 121 డిజైన్ల ఇక్కత్
భూదాన్పోచంపల్లిః అగ్గిపెట్టెలో పట్టె చీరెను నేసి ఔరా అని పోచంపల్లి చేనేత కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతికెక్కారు. మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచికి తగ్గట్టు చేనేత కళాకారులు ఇక్కత్ డిజైన్లను సృష్టిస్తూ నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు. తాజాగా పోచంపల్లికి చెందిన భోగ బాలయ్య అనే చేనేత కళాకారుడు 121 రంగులు, 121 డిజైన్ల చీరెను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. ఇక్కత్ చీరెలో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా తాపత్రయం పడ్డాడు. నిరంతరం పరిశ్రమించి తన పదేళ్ల కలను సాకారం చేసుకొన్నాడు. 121 రంగులు, 121 డిజైన్ల చీరెను ఆవిష్కరణ.. కాగా భోగ బాలయ్య తనకు వచ్చిన ఆలోచనను చీరెపై ఆవిష్కరించాడు. 121 రంగులు, 121 రకాల డిజైన్లతో అద్బుతంగా చీరెను తయారు చేశాడు. అంతేకాక 11 రంగులతో ట్రెడిషనల్ టెంపుల్ ఆకృతి చీరెఅంచు దీని ప్రత్యేకత. అయితే 22 చిటికిలు, 1 చిటికికి 22 కొయ్యల, 6 కొలుకులతో చీరె తయారీకి ఉపయోగించాడు. కోయంబత్తూర్ నుంచి ప్రత్యేకంగా 2/20 నెంబర్ మస్టర్డ్ నూలును తెప్పించాడు. అలాగే నిలువు, పేక విధానంలో నిలువు 11, పేక (అడ్డం)లో 11 రంగులుగా విడదీసి రంగులద్దాడు. రంగులలో ముఖ్యంగా ఆకుపచ్చ, చిలుకపచ్చ, బంగారు వర్ణం, నీలి, గోధుమ, గ్రే, ఆరెంజ్, ఆనంద, లెమన్ ఎల్లో, వాయిలెట్, గులాబి ఉన్నాయి. ఇంత అద్భుతమైన చీరె నేయడానికి దీనివెనుక రెండేళ్ల శ్రమ దాగి ఉంది. అయితే ఈ చీరె పూర్తిగా వాస్ట్ కలర్స్, వాషబుల్, ఎకో ఫ్రెండ్లీ కావడం విశేషం. మంత్రి కేటీఆర్‌చే సన్మానం 121 రంగుల మల్టి కలర్స్, మల్టి మోటివ్స్ ఇక్కత్ చీరెను తయారు చేసిన భోగ బాలయ్య ప్రతిభను గుర్తించి ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం రోజున హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించారు. జాతీయ అవార్డు కోసం ఎంట్రీ పంపించాడు. అదేవిధంగా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బాలయ్య రూపొందించిన మల్టికలర్స్ చీరెను చూసి అభినందించారు. చేనేత పరిశ్రమ గుర్తుండి పోవాలి: భోగ బాలయ్య చేనేతలో నూతన ఆవిష్కరణలు, కళల ద్వారా చేనేత పరిశ్రమ పదికాలాల పాటు మనుగడలో ఉంటుంది. అదేసమయంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా ఆరాటపడుతున్నాను. ఇందుకోసం గత రెండేళ్లుగా విభిన్న ఆలోచనలు, సృజనాత్మకంగా ఆలోచించి 121 డిజైన్లు, 121 రంగుల చీరెను తయారు చేశాను. -
టై అండ్ డై విధానం బాగుంది
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి టై అండ్ డై వస్త్ర తయారీ విధానం బాగుందని ఒడిశా రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికులు అన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒడిశా రాష్ట్రంలోని బజఘడ్, సోన్పూర్, సబల్‌పూర్ జిల్లాలకు చెందిన 14 మంది చేనేత కార్మికులు బుధవారం పోచంపల్లిని సందర్శించారు. చేనేత గృహాలు, సహకార సంఘం, హ్యాండ్లూమ్ పార్క్‌ను సందర్శించి ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు, రంగుల అద్దకం, చిటికి విధానం, డిజైన్లను పరిశీలించారు. అలాగే మార్కెటింగ్, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటును అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎన్‌హెచ్‌డీసీ ప్రతినిధి నీల మాధవపాత్ర, సూపర్వైజర్ ప్రధాన్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత వాసుదేవ్, సూరపల్లి శ్రీనివాస్ ఉన్నారు. -
పోచంపల్లి బ్యాంక్‌కు 4 జాతీయ అవార్డులు
భూదాన్‌పోచంపల్లి : 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను పోచంపల్లి అర్బన్ బ్యాంకుకు నాలుగు జాతీయ స్థాయి అవార్డులు వచ్చినట్లు ఆ బ్యాంకు ౖచెర్మన్ చిట్టిపోలు శ్రీనివాస్, సీఈఓ సీత శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు ప్రతి ఏటా బ్యాంకింగ్ ప్రాంటియర్స్ ముంబయి ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డులు కేటాయిస్తుందన్నారు. ఇందులో భాగంగా పోచంపల్లి బ్యాంక్‌కు బెస్ట్ ఎన్పీఏ మేనేజ్మెంట్, బెస్ట్ కార్డ్ ఇన్సిషియేట్, బెస్ట్ వెహికల్ లోన్ అచీవ్మెంట్, బెస్ట్ ఏటీఎం అక్వైరర్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 18న ఢిల్లీలో జరిగిన జాతీయ కోఆపరేటివ్ బ్యాంకుల సమ్మేళనం–16లో అవార్డులు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇలా వరుసగా ఐదో సారి జాతీయస్థాయి ఉత్తమ అవార్డులు పొందామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో కొత్తరకం టెక్నాలజీ సేవలు, యాప్ ద్వారా మోబైల్ సేవలు, నగదు డిపాజిట్ యంత్రాల స్థాపన, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. సమావేశంలో బ్యాంకు వైఎస్ చైర్మన్ సూరపల్లి రమేశ్, డైరక్టర్లు విజయ్‌కుమార్, కర్నాటి పాండు, పెండెం రఘు, కర్నాటి బాలసుబ్రమణ్యం, గుండు మధు, చిక్క విష్ణు, నోముల రఘు, రాపోలు వేణు, అందె బస్వయ్య, సీనియర్ మేనేజర్ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
భూదాన్‌పోచంపల్లి : పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్ఐ జగన్మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ఏర్పుల మల్లయ్య ఏడాది క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి మండలంలోని కనుముకుల గ్రామానికి చెందిన పాక వెంకటేశ్ అనే రైతు వద్ద పాలేరుగా పనిచేస్తున్నాడు. మల్లయ్య కుమారుడైన ఏర్పుల మహేశ్(22) ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. దాంతో తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన ఇతను సోమవారం సాయంత్రం మద్యంలో క్రిమిసంహారక మందును కలుపుకొని తాగాడు. అనంతరం దగ్గరలో భీమనపల్లి గ్రామంలో ఉంటున్న తన అక్క శ్రీలత ఇంటికి వచ్చి కింద పడిపోయాడు. ఇతని వద్ద నుంచి పురుగు మందు తాగిన వాసన వస్తుండడంతో కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
దేశ్ముఖిలో సినిమా షూటింగ్
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని దేశ్ముఖి సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. హీరో నవీన్‌చంద్ర, హీరోయిన్ స్మృతి (పటాస్ ఫేం)లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే హీరోయిన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఐస్‌క్రీమ్ తింటున్న సన్నివేశాలతో పాటు హాస్య నటులు ధన్‌రాజ్, అవినాష్‌లపై పలు సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ యువతకు సందేశంతో కామెడీ ఓరియెంటెడ్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదని తెలిపారు. కెమెరామెన్‌గా బాల్‌రెడ్డి, సంగీతం శ్రీవసంత్, నిర్మాత కేకే. రాధామోహన్ వహిస్తున్నారని తెలిపారు. -
గుండెపోటులో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని రాంలింగంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పోచంపల్లికి చెందిన సంగెం మురళి(47) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. రాఖీ పండుగ కోసం బుధవారం తుంగతుర్తి మండలం తిరుమలగిరి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడే ఇతడికి గుండెపోటు వచ్చింది. ఇతను ఎమ్మార్పీ కార్యాలయంలో సీఆర్పీగా, పీఆర్టీయూ సంఘంలో వివిధ హోదాలో సేవలందించారు. ప్రస్తుతం పీఆర్టీయూ మండల కార్యదర్శిగా ఉన్నాడు. 2013లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు. నిరుపేద చేనేత కుటుంబం నుంచి వచ్చిన మురళి ఒకవైపు మగ్గం నేసుకుంటూనే, ఉన్నత చదువులు చదివి 1998 డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించారు. రాజపేట, వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఏడేళ్లుగా రాంలింగంపల్లి పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పలువురి సంతాపం... ఉపాధ్యాయుడు సంగెం మురళి మృతి పట్ల ఎంఈఓ రాజేందర్‌రెడ్డి, ఇంద్రియాల సర్పంచ్ బండి కృష్ణ, ఎంపీటీసీ సంతోశ్‌కుమార్, పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, జె.సుదర్శనం, జిల్లా ఉపాధ్యక్షుడు కె.అనిల్‌కుమార్, రాష్ట్ర నాయకుడు వై.రవీందర్, సయ్యద్ అమర్, టీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇ.రఘునందన్, సుతారపు వెంకటనారాయణ, రాచకొండ మధుసూదన్, పోతగల్ల దానయ్య, నోముల మాధవరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. -
బస్సుల కోసం ధర్నా
భూదాన్‌పోచంపల్లి : పాఠశాల సమయానికి బస్సులు నడపాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మెహర్‌నగర్‌కు చెందిన విద్యార్థులు జలాల్పురం స్టేజీ వద్ద ధర్నా నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. గ్రామానికి వచ్చే ఒక బస్సు సైతం సమయానికి రాకపోవడంతో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో రెవెల్లి శ్రీను, కోట రమేశ్, చెక్క శ్రీనివాస్, కోట చంద్రశేఖర్, విద్యార్థులు భాను, అరుణ్‌ప్రసాద్, చంద్రశేఖర్, వంశీ, రాధిక, హరిత, మౌనిక, స్వీటీ, దివ్య, వైష్టవి, శరత్, నానీ, కృష్ణప్రసాద్, మధు, ప్రశాంత్ పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు రెండు గేదెల మృతి
రేవనపల్లి(భూదాన్‌పోచంపల్లి) పిడుగుపాటుకు రెండు గెదెలు మృతిచెందాయి. ఈ ఘటన మండలంలోని రేవనపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు మైల నర్సింహ రోజుమాదిరిగా శుక్రవారం సాయంత్రం గ్రామసమీపంలోని వ్యవసాయ బావి వద్ద గేదెలను కట్టేసి ఇంటికి వచ్చాడు.రాత్రి వర్షంతో పాటు పిడుగు పడింది. శనివారం ఉదయం బావి వద్దకు వచ్చి చూడగా చెట్టుకు కట్టేసి ఉన్న రెండు ముర్రాజాతి గేదెలు మృతిచెంది ఉన్నాయి. వీటి విలువ రూ. 1.30 లక్షలు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. సమాచారం అందుకొన్న ఆర్ఐ నిర్మల, మండల పశువైద్యాధికారి రాంచంద్రారెడ్డి, వీఆర్వో సుదర్శన్‌రావు, సర్పంచ్ గోదాసు శశిరేఖజంగయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలను అడిగి తెలుసుకొని పంచానామా నిర్వహించారు.