ఆన్‌లైన్‌లో ‘బందరు’ చీరలు | Handloom Industry Recovering Again After Corona Effect With AP Govt Support | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ‘బందరు’ చీరలు

Published Sat, Nov 21 2020 4:51 AM | Last Updated on Sat, Nov 21 2020 4:51 AM

Handloom Industry Recovering Again After Corona Effect With AP Govt Support - Sakshi

కప్పలదొడ్డిలోని అరుణశ్రీ సొసైటీలో వస్త్ర నిల్వలు

సాక్షి, మచిలీపట్నం: కరోనా దెబ్బకు కుదేలైన చేనేత పరిశ్రమ మళ్లీ కోలుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడంతో పరిశ్రమ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. కృష్ణా జిల్లాలో 58 చేనేత సహకార పరపతి సంఘాలున్నాయి. వాటిలో 37 చేనేత సంఘాల పరిధిలో 7,047 మంది సుమారు 5వేల మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.45 కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తులు తయారవుతున్నాయి.  రాష్ట్రంలో 9 గజాల చీరల తయారీలో కృష్ణా జిల్లా చేనేత కార్మికులు ప్రసిద్ధి. రూ.700 నుంచి రూ.2 వేల వరకు విలువైన ఈ కాటన్‌ చీరలకు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడ తయారయ్యే వస్త్ర ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఇందులో 30 శాతం స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తుండగా, 10 శాతం తూర్పు గోదావరి జిల్లా బండారులంక మార్కెట్‌కి తరలిస్తారు. జిల్లాలో ఒక్క పెడన మార్కెట్‌లోనే ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ్యాపారం జరుగుతోంది.

కరోనాతో కుదేలు...
కరోనా దెబ్బకు చేనేత పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. లాక్‌డౌన్‌ సమయానికి రూ.6 కోట్ల వస్త్ర నిల్వలు పేరుకు పోగా ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు మరో రూ.19.50 కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యాయి. వీటిని ఏ విధంగా అమ్ముకోవాలో తెలియక సొసైటీలు గగ్గోలుపెట్టాయి.

ఊపిరిలూదిన ఆప్కో 
ప్రభుత్వాదేశాలతో సొసైటీల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వల్లో రూ.కోటిన్నర విలువైన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసింది. దసరా, దీపావళి పండుగలతో సుమారు రూ.6 కోట్లకు పైగా అమ్మకాలు జరగ్గా రూ.4 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతయ్యాయి.

ఆన్‌లైన్‌లో అమ్మకాలకు శ్రీకారం
చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఈ–మార్కెటింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గోకాప్‌ వంటి ఆన్‌లైన్‌ కంపెనీలతో ఆప్కో ఒప్పందం చేసుకుంది. మేజర్‌ సొసైటీలన్నీ ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. ‘బందరు చీరలు’ పేరిట ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో పెడుతున్నాయి.

అమ్మకాలు ఊపందుకున్నాయి
మా సొసైటీలో అక్టోబర్‌ నాటికి రూ.78 లక్షల విలువైన వస్త్రాలున్నాయి. వాటిలో రూ.10 లక్షల వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయగా, దసరా, దీపావళి సీజన్‌లలో రూ.30 లక్షల విలువచేసే చీరల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్‌ మళ్లీ ఊపందుకుంటోంది.
– కేఎన్‌ శ్రీనివాసరావు, మేనేజర్‌ ది పోలవరం వీవర్స్‌ సొసైటీ, పోలవరం

చెన్నై సిల్క్స్‌ నుంచి ఆర్డర్స్‌ వచ్చాయి
ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమ గాడిలో పడుతోంది. మాకు చెన్నై సిల్క్స్‌ నుంచి దాదాపు రూ.34 లక్షల విలువైన చీరలకు ఆర్డర్స్‌ వచ్చాయి.
– శ్రీనివాసరావు, అరుణశ్రీ వీవర్స్‌ సొసైటీ, కప్పలదొడ్డి

పరిశ్రమ మళ్లీ కోలుకుంటోంది
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలి తాలనిస్తున్నాయి. ఇప్పటికే రూ.1.45 కోట్ల విలువైన వస్త్రాలను రెండు విడతల్లో ఆప్కో కొనుగోలు చేసింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ మొదల య్యాయి.
– ఎస్‌.రఘునందన, ఏడీ, చేనేత జౌళి శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement