చేనేతకు ఎన్నికల చిక్కుముడి
- స్తంభించిన వ్యాపారం
- మందగించిన పనులు
- సంక్షోభంలో చేనేత రంగం
సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమకు వరుస ఎన్నికలు కొత్తకష్టాలను తెచ్చిపెట్టాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న అమ్మకాలు ఎన్నికల పుణ్యమా అని దాదాపు నిలిచిపోయాయి. ఫలితంగా మదనపల్లె డివిజన్‌లో సుమారు రూ. 30 కోట్ల లావాదేవీలు ఆగిపోయాయి.
మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్: మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో దాదాపు 30 వేల వరకు చేనేత మగ్గాలు ఉన్నాయి.దీనిపై దాదాపు 50 వేల మంది వరకు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముడిసరుకుల ధరలు పెరగడంతో చేనేత పరిశ్రమ కుదేలైంది. ఇదిలా ఉండగా మదనపల్లె పరిసరాల్లో ఉండే వ్యాపారులు పట్టుచీరలను బెంగళూరు, ధర్మవరం, చెన్నై నగరాలకు వెళ్లి అమ్మకాలు చేస్తుంటారు. మార్చి నుంచి మే నెల వరకు మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా జరిగాయి.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో చీరలు తీసుకెళ్లి అమ్మకాలు చేసి డబ్బులు తీసుకురావడం కష్టంగా మారింది. దీనికి తోడు కొనుగోళ్లు మందగించాయి. నీరుగట్టువారిపల్లె(సిల్క్ టౌన్)లో దుకాణాల్లో స్టాకు నిలిచిపోయింది. ఇక్కడ రోజుకు సగటున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. అమ్మకాలు లేకపోవడంతో వ్యాపారులు డీలాపడిపోయారు. దీనికి తోడు చేనేత కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి వలసవచ్చినవారు అధికంగా ఉన్నారు.
ఎన్నికలు ప్రారంభం కావడంతో వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారం, ఇతర పనుల నిమిత్తం పోటీ చేసే నాయకుల మద్దతు కోసం వెళ్లారు.దీంతో కార్మికులు లేకపోవడంతో మగ్గాల పనులు ఆగిపోయాయి. దాదాపు 80 శాతం మంది కార్మికులు ఎన్నికల కోసం తమ గ్రామాలకు వెళ్లిపోయారు. మగ్గాల పనులు ఆగిపోవడంతో వ్యాపారాలు లేక దుకాణాలు వెలవెలబోయాయి.
ముడిసరుకుల ధరలు తగ్గించాలి
ఎన్నికల కారణంగా చేనేత రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేతను ఆదుకునేందుకు ముడిసరుకుల ధరలు తగ్గిం చాలి. ధరలు తగ్గితే వ్యాపారులకు కొంత ఊరట కలుగుతుంది. మళ్లీ చేనేతరంగం కుదుట పడేలా చర్యలు తీసుకోవాలి.
- సుధాకర్, చేనేత జనసమాఖ్య సంఘం అధ్యక్షులు, నీరుగట్టువారిపల్లె