చీరాల, న్యూస్‌లైన్ : చాలీచాలని మజూరీలతో అవస్థ పడుతూ రంగురంగుల చీరలు నేస్తున్న నేతన్నల కోసం చేనేత ప్రత్యేక పరపతి బ్యాంక్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏడాది క్రితం ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. కుటుంబమంతా కలిసి పని చేస్తే పూట గడవని దుస్థితి వారిది. అప్పులు.. అనారోగ్యం.. ఆత్మహత్యలే ఆస్తులుగా మారాయి. వ్యవసాయం తర్వాత అతి పెద్ద వృత్తయిన చేనేత రంగానికి చేయూతనిస్తామని కొన్నేళ్లుగా చెబుతున్న ప్రభుత్వాలు చివరకు ‘చెయ్యి’స్తున్నాయి. ప్రభుత్వ పథకాలు కార్మికులకు చేరడం గగనంగా మారింది. ఆకలి..అనారోగ్యం.. వంటి సమస్యలతో ఎముకల గూడులాంటి శరీరాలతో చేనేత కార్మికులు జీవ చ్ఛవాలుగా మారారు. వారం రోజులు కురిసిన భారీ వర్షాలకు నేతన్నల మగ్గం మూగబోయింది. వర్షాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసిన నేతన్నల పరిస్థితి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆయన రాకతోనైనా చేనేతల కష్టాలు తీరుతాయో లేక ఎప్పటిలాగే ‘చెయ్యి’ ఇచ్చి వెళ్తారో వేచి చూడాలి.
అరకొరగా క్రెడిట్ కార్డు రుణాలు
చేనేతలకు క్రెడిట్ కార్డు స్కీం కింద రుణాలు అరకొరగా మంజూరు చేశారు. అధికార పార్టీ మెప్పు ఉన్న వారికి తప్ప మిగిలిన వారికి రుణాలు అందించలేదు. జిల్లాలో 33184 చేనేత మగ్గాలున్నాయి. 24 వేల కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. జిల్లాలో 68 చేనేత సహకార సంఘాలు పని చేస్తున్నాయి. చేనేత రుణాల కోసం 8,500 వేల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 1920 మందికి మాత్రమే రుణాలందాయి. ఒక్కొక్కరికి రూ. 30 నుంచి రూ. 50 వేల వరకు బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించి చేతులు దులుపేసుకున్నారు. రుణాల కోసం నేతన్నలు బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
అందని సబ్సిడీ
జిల్లాలో సహకారేతర రంగంలో ఉన్న 80 వేల మంది చేనేత కార్మికులకు కూడా రంగు, రసాయనాలు, చిలపనూలు కొనుగోలుపై పది శాతం సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం 2008 మార్చిలో జీవో నంబర్-77 జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఒక్క చేనేత
కార్మికునికి కూడా సబ్సిడీపై చిలపనూలు, రంగు, రసాయనాలు అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పేరుకు మాత్రం సబ్సిడీ పథకాలు అందిస్తున్నట్లు ప్రకటనలు చేస్తుందే తప్ప వాటి అమలుపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోంది.
ప్రకటనలకే పరిమితం
చేనేత రంగం అభివృద్ధి చెందేందుకు ప్రత్యేక చేనేత పరపతి బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడుసార్లు ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోలేదు. నూలు పాసు పుస్తకాలు ఇస్తామని కూడా చెప్పి వాటి గురించి పట్టించుకోవడం లేదు. క్రెడిట్‌కార్డు రుణాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు. రాష్ట్రంలో నాలుగు లక్షల మగ్గాలుంటే కేవలం నలభై వేల మందికి మాత్రమే క్రెడిట్ కార్డు రుణాలు అందించారంటే చేనేతలపై కిరణ్ సర్కార్ సవతి ప్రేమ చూపుతోందని అర్థమవుతోంది.
నూలును ఎన్‌హెచ్‌డీసీ (నేషనల్ హ్యాండ్లూమ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా అందిస్తామని చెప్పి హామీ కూడా నెరవేరలేదు. ఒక్క చీరాల నియోజకవర్గానికే నెలకు సగటున వెయ్యి నూలు బేళ్లు అవసరమవుతుండగా ప్రభుత్వం కేవలం రెండు వందల బేళ్లను మాత్రమే పంపడంతో అధిక ధరలకు బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నేతన్నల ఇబ్బందులను గుర్తించడంతో పాటు జరిగిన నష్టాన్ని అంచన వేసేందుకు విపత్తు నివారణ నష్టపరిహార కమిటీ వేస్తామని చెప్పిన సీఎం మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. నేతన్నలను కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నారే తప్ప వారి అభ్యున్నతికి పాటుడింది లేదు.
మగ్గం విలాపం
Published Mon, Oct 28 2013 6:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement