
కెరియర్ పురోగతిలో అవరోధాలు
టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక
ముంబై: కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నాలజీ ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వారు ఎక్కువగా ఎంట్రీ స్థాయికే పరిమితమవుతున్నారే తప్ప కెరియర్‌లో పెద్దగా ముందుకెళ్లలేకపోతున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే వేతనాల్లోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రిమోట్ వర్క్ అవకాశాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే (డీఈఐ) విధానాలు గత నాలుగేళ్లలో మహిళా టెకీల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. 2020లో కాంట్రాక్టు టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య 9.51 శాతంగా ఉండగా, 2024లో ఇది 27.98 శాతానికి పెరిగింది.
ఐటీ సర్వీసుల రంగంలో మహిళా సిబ్బంది వాటా 7.8 శాతం నుంచి 21.2 శాతానికి పెరిగింది. అయితే, ఇది చెప్పుకోతగ్గ స్థాయిలో కెరియర్ పురోగతికి దారితీయడం లేదు. మధ్య స్థాయి ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం 4.13 శాతం నుంచి 8.93 శాతానికి మాత్రమే పెరగడం ఇందుకు నిదర్శనం. ఎంట్రీ స్థాయిని దాటి పురోగమించేందుకు మహిళలకు గణనీయంగా అవరోధాలు ఉండటాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. 2020–2024 మధ్య టీమ్‌లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బందిలోని 13,000 మంది అసోసియేట్స్ గణాంకాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది.
వేతనాల్లోనూ వ్యత్యాసాలు..
వేతనాల విషయానికొస్తే పురుషులు, మహిళల మధ్య ఎంట్రీ స్థాయి కొలవుల్లో 6 శాతం, మధ్య స్థాయి ఉద్యోగాల్లో 19 శాతం వరకు వ్యత్యాసం ఉంటోంది. అయితే, సీనియర్ స్థాయిలో మాత్రం 13 శాతంగా ఉంటోంది. ‘కాంట్రాక్ట్ టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం హర్షణీయమే అయినప్పటికీ, లింగ సమానత సాధించాలంటే నియామకాల పరిధికి మించి బహుముఖ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లీడర్‌షిప్ స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం అంతగా లేకపోవడం, పురుషులతో పోలిస్తే వేతనాల మధ్య వ్యత్యాసాలు అలాగే కొనసాగుతుండటమనేది వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులను చేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. మహిళలు ఉద్యోగాల్లో చేరడమే కాకుండా, కెరియర్‌లో పురోగమించేందుకు, సారథ్య బాధ్యతల్లో రాణించేందుకు అవసరమైన పరిస్థితులను కలి్పంచే దిశగా కంపెనీలు కృషి చేయాలి‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు.