ప్రసూతి చట్టంతో భారీగా ఉద్యోగాలు గోవింద | India Maternity Law May Cost 18 Lakh Women Their Jobs | Sakshi
Sakshi News home page

ప్రసూతి చట్టంతో భారీగా ఉద్యోగాలు గోవింద

Published Wed, Jun 27 2018 10:42 AM | Last Updated on Wed, Jun 27 2018 10:42 AM

India Maternity Law May Cost 18 Lakh Women Their Jobs - Sakshi

ప్రసూతి చట్టంతో భారీగా ఉద్యోగాలు గోవింద

న్యూఢిల్లీ : దేశంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి ప్రయోజనాలను పెంచుతూ.. వారిని కెరీర్‌ పరంగా మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది కొత్త ప్రసూతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల ఇప్పటికే ఆడవాళ్లకు అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగవకాశాలు మరింత సన్నగిల్లినట్టు తెలిసింది. కొత్త ప్రసూతి చట్టం వల్ల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని, చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు మహిళలను నియమించుకోవడం తగ్గించాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తన అధ్యయనంలో వెల్లడించింది. 

మార్చి 2019 వరకు 10 రంగాలలో 11 లక్షల నుంచి 18 లక్షల మంది మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు ఈ అధ్యయనం అంచనావేసింది.  ఒకవేళ అన్ని రంగాలను తీసుకుంటే, ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య కోటి నుంచి 1.2 కోట్ల వరకు ఉంటుందని సర్వే వెల్లడించింది. ఇది భారత్‌కు బ్యాడ్‌న్యూస్‌ అని పేర్కొంది.  అంతేకాక వర్క్‌ఫోర్స్‌లో మహిళల షేర్‌ 24 శాతానికి పడిపోయిందని కూడా తెలిపింది. ఒకవేళ మహిళా ఉద్యోగుల స్థాయి దేశంలో ఎక్కువగా ఉంటే, దేశ జీడీపీకి 700 బిలియన్‌ డాలర్లకు పైగా అదనపు సంపద చేకూరుతుందని మెక్నిన్సే అండ్‌ కో అంచనావేసింది. 

ఏవియేషన్‌, ఐటీ, ఐటీ సంబంధిత సర్వీసులు, రియల్‌ ఎస్టేట్‌, విద్యా, ఈ-కామర్స్‌, తయారీ, బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసులు, రిటైల్‌, టూరిజం రంగాలలో 300 ఎంప్లాయిర్స్‌పై ఈ సర్వేను టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ నిర్వహించింది. ఆర్థికంగా మంచిగా ఉన్న కుటుంబాల్లో మహిళలు, బాగా చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేయడం లేదని, ఒకవేళ భర్త వేతనం తగ్గిపోతే, అప్పుడు ఉద్యోగం వైపు మొగ్గు చూపుతున్నారని వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. 2004 నుంచి 2 కోట్ల మంది మహిళలు తమ ఉద్యోగాలను వదులుకున్నట్టు తెలిపింది. 

వర్క్‌ఫోర్స్‌ల్లో మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రసూతి చట్టాన్ని సవరించింది. 12 వారాలుగా ఉన్న ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచింది. కానీ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో పనిచేస్తూ ఉంటాయని, ఒకవేళ ఈ కంపెనీల్లో ఐదుగురు మహిళా ఉద్యోగులుంటే, వారి కనుక ప్రసూతి చట్టం కింద 28 వారాల పాటు సెలవు తీసుకుంటే, ఇక సంస్థ నడపడం కష్టతరమవుతుందని తెలిసింది. దీంతో ఈ కంపెనీలు మహిళలను నియమించుకోవడానికి నిరాసక్తి చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. 

భారత్‌ లాంటి దేశంలో ఇప్పటికే గర్భవతి అవడాన్ని కెరీర్‌ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. తల్లులైనందున పదోన్నతులు కోల్పోయిన వారు ఉన్నారు. కొత్తగా తల్లులవుతున్న వారు పనిచేసే చోట వివక్షతను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కంపెనీలు మహిళా ఉద్యోగుల ఇంటర్వ్యూల సందర్భాల్లోనే పెళ్లి, పిల్లలకు సంబంధించిన ప్రణాళికలను తెలసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరిన కొన్నేళ్లవరకు పెళ్లి చేసుకోకూడదని, పెళ్లి చేసుకున్నా పిల్లలు కనకూడదనే షరతులు విధిస్తున్న కంపెనీలు కూడా లేకపోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement