2025లో వృత్తి నిపుణుల ఉద్యోగ వేట
మెజారిటీ అభిప్రాయం ఇదే
లింక్డెన్ ఇండియా అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్డెన్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్‌ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్‌ఆర్ నిపుణులు రోజులో 3–5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు.
49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్‌ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగ మార్కెట్ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది.
మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్‌లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్‌లో మంచి వృద్ధిని చూడొచ్చు’’అని లింక్డెన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ ఎక్స్‌పర్ట్ నిరజిత బెనర్జీ అన్నారు. గతేడాది నవంబర్ 27 నుంచి, డిసెంబర్ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్‌తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది.
ఈ ఉద్యోగాల్లో వృద్ధి ఎక్కువ..
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రోబోటిక్స్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్ ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్ తెలిపింది. భారత్‌లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది.
నవంబర్‌లో పెరిగిన ఉపాధి
ఈపీఎఫ్‌ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ)లో సభ్యత్వం నవంబర్‌లో 4.88 శాతం (2023 నవంబర్‌తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్‌ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్‌తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం. నవంబర్‌లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్‌తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment