ఉద్యోగుల అనూహ్య నిర్ణయం... కంఫర్ట్ లేకపోతే రాజీనామాలకైన సిద్దం..!
న్యూఢిల్లీ: దేశీయంగా గణనీయ సంఖ్యలో ఉద్యోగినులు.. సరళతర పని విధానాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే, దీని వల్ల జీతాల్లో కోతలు పడుతుండటం, పక్షపాత ధోరణులు ఎదుర్కొనాల్సి వస్తుండటం, ప్రమోషన్లు లభించకపోవడం వంటి పరిణామాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉద్యోగాలకు రాజీనామా చేసే వారితో పాటు, చేయాలనుకుంటున్న (ఫ్లెక్సిడస్) వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కార్యాలయాల్లో ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకునేందుకు నిర్వహించిన సర్వేలో 2,266 మంది పాల్గొన్నారు. దీని ప్రకారం .. సరళతర (ఫ్లెక్సిబుల్) పని విధానాలు, కెరియర్ మధ్యలో విరామాల విషయంలో కంపెనీల సెంటిమెంటు అంత సానుకూలంగా ఉండటం లేదు. దీంతో తమకు మరింత అనువైన విధానాలు కావాలని అడిగేందుకు గానీ కెరియర్లో కొంత కాలం విరామం తీసుకున్న మహిళలు తిరిగి ఉద్యోగ విధుల్లో చేరేందుకు గానీ అంతగా ముందుకు రావడం లేదు. సరళతర పని విధానాల సమస్యల వల్ల ప్రతి పది మంది ఉద్యోగినుల్లో ఏడుగురు రాజీనామాల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో భారత్లో ఫ్లెక్సిడస్ పరిస్థితులు నెలకొన్నాయని లింక్డ్ఇన్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ తెలిపారు. ప్రతిభావంతులైన ఉద్యోగినులను వదులుకోకూడదనుకుంటే కంపెనీలు .. ఫ్లెక్సిబుల్ విధానాలను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
కరోనా వైరస్పరమైన ప్రభావాల నేపథ్యంలో తమకు సరళతర ఉద్యోగ విధానాలే అనువైనవిగా ఉంటాయని ప్రతి పది మందిలో ఎనిమిది మంది (83 శాతం మంది) వర్కింగ్ ఉమెన్ గుర్తించారు. అలాంటి వెసులుబాటు లేని ఉద్యోగాలను తిరస్కరిస్తున్న వారి సంఖ్య 72 శాతంగా ఉంది.
అనువైన విధానాలను ఆఫర్ చేయకపోవడం వల్ల ఇప్పటికే 70 శాతం మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు..లేదా చేసే యోచనలో ఉన్నారు.
ఫ్లెక్సిబుల్ పని విధానాల వల్ల తమకు అటు ఉద్యోగం, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు వీలుంటుందని, కెరియర్లో పురోగతి సాధించేందుకు తోడ్పాటు ఉంటుందని ప్రతి అయిదుగురు మహిళల్లో దాదాపు ఇద్దరు అభిప్రాయపడ్డారు. తమ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగేందుకు మరింతగా అవకాశం ఉంటుందని ముగ్గురిలో ఒక్కరు పేర్కొన్నారు.
అయితే, కంపెనీలో పక్షపాత ధోరణి తీవ్రంగా ఉంటుండటంతో .. సరళతర పని విధానాలు ఎంచుకునే ఉద్యోగినులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. సర్వే ప్రకారం .. 10 మంది వర్కింగ్ ఉమెన్లో 9 మంది జీతాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫ్లెక్సిబుల్ విధానం కోసం అయిదుగురు అడిగితే ఇద్దరి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తమ అభ్యర్ధనలను ఆమోదింప చేసుకోవడంలో ప్రతి నలుగురిలో ఒక్కరు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చింది. దీనితో తమను పక్కన పెట్టేస్తారని, ప్రమోషన్లలో పట్టించుకోరని, ఓవర్టైమ్ పనిచేయాల్సి వస్తుందని, జీతాలు తగ్గించుకోవాల్సి వస్తుందని, పైస్థాయి అధికారులు తక్కువ చేసి చూస్తారనే భయాలతో మహిళా ఉద్యోగులు... సరళతర పని విధానాలను అడిగేందుకు జంకుతున్నారు.