పునరుత్పాదక ఇంధన రంగంలో కొలువుల జోరు
అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ దూకుడు
భారీ సామర్థ్య విస్తరణతో దండిగా అవకాశాలు
2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలనేది భారత్ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులకు తెరతీయడంతో.. గ్రీన్ జాబ్స్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది.
పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కంపెనీలు ఇప్పుడు నిపుణులకు రారామ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు జతవుతుండటంతో భారీగా సిబ్బంది కొరత నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, జెన్సాల్ గ్రూప్ తదితర సంస్థలు నియామకాల జోరు పెంచిన వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, వాతావరణ విశ్లేషణ, సోలార్ సెల్–మాడ్యూల్ తయారీ, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీగా అవకాశాలున్నాయనేది పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, హెచ్‌ఆర్ ఏజెన్సీల మాట! సౌర, పవన విద్యుత్‌తో పాటు జల, అణు విద్యుత్ ఇతరత్రా హైబ్రీడ్ ప్రాజెక్టులు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి.
అదానీ.. 50 గిగావాట్లు
బహుముఖ రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సౌర, పవన, హైబ్రీడ్ ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రధాన కార్యకలాపాలు, మెయింటెనెన్స్‌లో నిపుణుల నియమాకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2030 నాటికి 50 గిగావాట్ల (జీడబ్యూ) రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సైంటిస్టులు, ఎలక్ట్రికల్–సివిల్ ఇంజినీర్లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సరఫరా వ్యవస్థల స్పెషలిస్టులతో పాటు పరికరాల ప్రొక్యూర్‌మెంట్‌లో అనుభవం గల వారికి కూడా కంపెనీ పెద్దపీట వేస్తోంది.
హైరింగ్‌లో టాటా ‘పవర్’
ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ; సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్–మెయింటెనెన్స్, ఇంజినీరింగ్–టెక్నాలజీ తదితర ఉద్యోగాల భర్తీలో తలమునకమైంది. భారీ ప్రాజెక్టులకు తోడు, రూఫ్‌టాప్ సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,500 పైగా సిబ్బంది ఉన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు ఫాస్ట్‌ట్రాక్‌లో నడుస్తున్నాయి.
ఈ మేరకు అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాం. గుజరాత్‌లో 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటిద్వారా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ భారీ విస్తరణ, వృద్ధికి అనుగుణంగా హైరింగ్ జోరు పెంచుతున్నాం’ అని టాటా పవర్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ హిమల్ తివారీ పేర్కొన్నారు. ఇక జెన్సాల్ గ్రూప్ బ్యాటరీలు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్–ల్యాండ్ డెవలప్‌మెంట్, పర్యావరణం, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో నిపుణుల వేటలో ఉంది. 2024–2032 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన మార్కెట్ వార్షికంగా 8.7 శాతం వృద్ధి (సీఏజీఆర్) చెందుతుందని అంచనా.
→ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనేది భారత్ లక్ష్యం.
→ ప్రస్తుతం భారత్‌లో గ్రీన్ ఎనర్జీ (భారీ జలవిద్యుత్, అణు విద్యుత్‌తో సహా) ఉత్పత్తి సామర్థ్యం 208 గిగావాట్లు. మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది దాదాపు 46%. గత
9 ఏళ్లలో 400 శాతం ఎగబాకడం విశేషం.
→ సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత 9 ఏళ్లలో 30 రెట్లు ఎగసి 89.4 గిగావాట్లకు చేరింది.
→ పవన విద్యుత్ సామర్థ్యం 2014 నుంచి ఇప్పటిదాకా రెట్టింపునకు పైగా ఎగసి 47.19 గిగావాట్లకు చేరుకుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment