వరుసగా ఏడో క్వార్టర్లోనూ తగ్గిన ఐటీ బిగ్–5 సిబ్బంది సంఖ్య
తగ్గుదల జోరుకు అడ్డుకట్టపడటం ఊరట
టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రాకు క్యూ1లో ప్లస్
ట్రెండ్ రివర్స్ అవుతుందంటున్న విశ్లేషకులు
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు.
టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్‌గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.
‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్‌ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు.
హైరింగ్‌పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్...
దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్‌కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది.
మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది.
టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు.
2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్‌గా తగ్గుదల.
15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742.
5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం.
ఫ్రెషర్లకు చాన్స్..
ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్‌సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్‌పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్‌ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్‌ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment