
ప్రపంచ రంగస్థల దినోత్సవం
రాజుల కాలం నుంచి విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటకరంగం...
మరింతమందికి ఈ రంగాన్ని చేరువ చేయడానికి కృషి చేస్తున్నవారు ఎందరో. ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చదువుకు సాధనంగా, సామాజిక మార్పు కోసం ప్రభావంతంగా పనిచేసే నాటకం ప్రాముఖ్యత, మన సంస్కృతిలో ఎంతగా మమేకం అయ్యిందో తెలియజేస్తున్నారు కళాకారులు సురభి లలిత, ఆర్.రేఖ, ఇరిగి త్రివేణి.
నైపుణ్యాలకు మెరుగు
ఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకరంగంలోకి వచ్చాను. 28 ఏళ్లుగా నాటకరంగంలో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. నెలలో 4 నుంచి 8 వరకు ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ నెల 29న హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు స్వేచ్ఛ నాటక ప్రదర్శన ఉంది. ఒక నాటకం చూడటానికి 500 నుంచి 800 మంది హాజరవుతుంటారు. లైవ్ ఫెర్‌ఫార్మెన్స్ కాబట్టి ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికివస్తుంది.
ఒక్కొక్క నాటిక 50 నుంచి వందసార్లు కూడా ప్రదర్శిస్తుంటాం. ఎంత ఇబ్బంది ఉన్నా, రాత్రిళ్లు నిద్ర లేకపోయినా సరే ఒకసారి మేకప్ వేసుకొని, వేదిక ఎక్కగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ‘గడి’ అనే నాటికకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కిందటేడాది వేసిన స్వేచ్ఛ, నిశి.. నాటికలలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నాటక ప్రదర్శనలు లేనప్పుడు సినిమా ఆడిషన్స్‌కి వెళుతుంటాను. ఆ విధంగా ‘బలగం’ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కొన్ని వెబ్‌సీరీస్‌లలోనూ నటిస్తున్నాను.
– సురభి లలిత, హైదరాబాద్
ఎన్నో అవకాశాలకు దారి చూపింది
మా నాన్న వారసత్వంగా నాటక, హరికథా కళాకారిణిగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఆ ఇష్టంతోనే ఎం.ఎ. థియేటర్ ఆర్ట్స్ చేశాను. సీతారాముల కళ్యాణంలో సీత పాత్ర, చరణ్‌దాసు నాటకంలో రాణి పాత్రలతో నాటకరంగానికి పరిచయం అయ్యాను. డా.బిఆర్ అంబేడ్కర్ రాజ గృహప్రవేశం నాటకంలో రమాబాయి పాత్రకు మంచి పేరు వచ్చింది. జాతీయ బహుమతి పొందిన రేడియో తెలుగు నాటకాలు– ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. గాయనిగా వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటాను. సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ పనిచేస్తున్నాను. ఇవన్నీ నాటకం నాకు ఇచ్చిన వరాలుగా చెప్పవచ్చు. గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా చేస్తున్నాను.
– ఆర్.రేఖ, హైదరాబాద్
వెక్కిరించినవారే మెచ్చుకున్నారు
మాది గ్రామీణ నేపథ్యం. తెలుగు యూనివర్శిటీలో జానపదం, అక్కడే థియేటర్ ఆర్ట్‌లో పీజీ చేశాను. వర్క్‌షాప్స్ చేస్తూ, నాలుగేళ్లుగా నాటకాలు వేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, వి ఆర్ ఇండియన్స్.. ఇలా నాటకాల జాబితా ఎక్కువ. ఇప్పుడు చాలా థియేటర్ గ్రూప్స్ వస్తున్నాయి. సినిమాల వాళ్లు కూడా థియేటర్‌లో నటిస్తున్నవారికిప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇప్పటికి పది రాష్ట్రాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాను. మన వారసత్వం, సంప్రదాయాలు మన ముందు తరాలకు పరిచయం చేయాలని టీచింగ్ వైపుకు వచ్చాను. డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్.. టీచర్‌గా కిందటి నెలలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు ఈ నాటకాలు, డ్యాన్సులు ఏంటి.. పెళ్లి చేసుకోకుండా అనేవారు. ఇప్పుడు ‘సాధించావు’ అంటుంటారు.
– ఇరిగి త్రివేణి, దేవరకొండ, నల్లగొండ
– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment