
ఎవర్ గ్రీన్ గ్లామర్ స్టార్‌గా వెలుగొందుతున్న బాలీవుడ్ నటి రేఖ..మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్‌తో అభిమానుల మనసు దోచుకుంది. ఏడు పదుల వయస్సులో ఇప్పటికీ వన్నె తరగని వర్ఛస్సుతో ఆమె చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. అయితే ఈ డ్యాన్స్ ఆమె తాజా సినిమాలోది కాదు.. ఒక నైట్ పార్టీలో కావడం విశేషం.
ఈ అపురూప నృత్య సన్నివేశం చోటు చేసుకుంది బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ పుట్టిన రోజు నాడు కావడం విశేషం. తన కుటుంబ సభ్యులతో పాటు ఇండస్ట్రీలోని సన్నిహితులతో షబానా 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనేక మంది బాలీవుడ్ స్టార్లు హాజరైన ఈ పుట్టినరోజు వేడుకల్లో రేఖ, హృతిక్ రోషన్, స్నేహితురాలు సబా ఆజాద్, సోను నిగమ్, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్ తదితరులు ప్రముఖంగా కనిపించారు. బాలీవుడ్‌లో ఇలాంటి పార్టీలు జరగడం సహజమే అయినా ఈ పార్టీలోని వీడియోలు వైరల్ కావడానికి మరో సీనియర్ నటి రేఖ డ్యాన్స్ దోహదం చేసింది. ’పరిణీత’లోని ’కైసీ పహేలి జిందగని’ పాట కోసం రేఖ చేసిన నృత్యం నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
రేఖ తన ట్రేడ్‌మార్క్ గ్రేస్ ఎనర్జీతో ఈ నృత్యానికి కేంద్ర బిందువుగా మారిన వెంటనే, ఆ పార్టీకి హాజరైన వారంతా అక్కడే గుమికూడడం గమనార్హం. అంతేకాదు రేఖ అడుగులు కదుపుతుంటే అందరూ చప్పట్లు కొట్టి, ఉత్సాహపరుస్తూ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఈ నృత్యం ద్వారా ఆమె బాలీవుడ్ ఫరెవర్ దివాగా తాను ఎందుకు ఎప్పటికీ కొనసాగుతుందో మరోసారి అందరికీ గుర్తు చేశారు. ’డ్యాన్సింగ్ క్వీన్’ గా పిలువబడే మాధురీ దీక్షిత్, రంగీలా లో డ్యాన్స్‌లతో షాకిచ్చిన ఊర్మిలా మాతోండ్కర్, డర్టీ పిక్చర్‌తో స్మితను గుర్తు చేసిన విద్యాబాలన్ వంటి రేఖ తదుపరి తరం హీరోయిన్స్ సైతం రేఖతో చేతులు కలిపి నృత్యం చేయడానికి ఒకరితో ఒకరు పోటీపడడం కనిపించింది.
తమదైన శైలిలో వారు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరి చూపూ రేఖ మీదే ఉండిపోవడం గమనార్హం. ఈ సందర్భంగా తీసిన ఈ పార్టీలోని వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారి అభిమానులకు ఆనందోత్సాహాలను పంచాయి. వైరల్ క్లిప్‌లలో, రేఖ, ఊర్మిళ, మాధురి, విద్య, షబానా అజ్మీ కలిసి నృత్యం చేసే అరుదైన సందర్భం అందరినీ ఆకట్టుకుంది. రేఖ మొదట మాధురి, ఊర్మిళ, విద్య...ఇలా ఒకరి తర్వాత ఒకరితో కలిసి డ్యాన్స్ చేయడం కనిపించింది.
తరువాత, ఆమె తన తరం నటి షబానాను తనతో డ్యాన్స్ చేయడానికి ఆహ్వానించింది. ఈ పార్టీలో బర్త్ డే గాళ్ షబానా అజ్మీ సైతం తన భర్త జావేద్ అఖ్తర్‌తో కలిసి ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి చేసిన నృత్యం ఆహ్లాదకరంగా ఆకట్టుకుంది. అలాగే షబానా అజ్మీ తన భర్త జావేద్ అఖ్తర్‌తో కలిసి కోనీ ఫ్రాన్సిస్ ప్రసిద్ధ పాట ’ప్రెట్టీ లిటిల్ బేబీ’కి నృత్యం చేశారు. ఈ పాటలు, నృత్యాల తాలూకు వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి