world theatre day
-
నేడు వరల్డ్ థియేటర్ డే
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది.... తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్‌షాప్‌లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో నిరీక్షణ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్. బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్‌లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది. పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ. కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్‌ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ. మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది. తమాషాగా సంతోషంగా... ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు. తోడా ధ్యాన్ సే... సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది. రంగస్థలమే పాఠశాల మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్‌పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే. -
World Theatre Day: నాటకం సర్వజనీయం
ప్రపంచవ్యాప్తంగా నాటక ప్రియులు పెద్ద ఎత్తున సభలూ, సమావేశలు జరుపుకునే రోజు మార్చి 27. ఈ రోజు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం. ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. దాదాపు ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలైంది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటక రూపం మారుతుందే కానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళ ప్రజాదరణ పొంది రంగస్థల ప్రక్రియగా విరాజిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. 1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు అరవికివియో ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతిపాదన చేశారు. సభ్యులందరూ అంగీకరించాక తదుపరి ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్య పూర్తి స్థాయిలో మొదలైంది. రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించింది. ఐక్యరాజ్యసమితి, యునెస్కోలచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాల ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షలు జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని ప్రముఖుల మాటగా వారి మనోగతసారాన్ని ఆ సంవత్సరం సందేశంగా ప్రపంచ రంగస్థలానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే ఫ్రాన్స్ దేశస్తుడు అందించాడు. అప్పటినుంచి ప్రతీ ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. (నేడు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం) – గాదిరాజు రంగరాజు, రంగస్థల నటుడు, చెరుకువాడ మొబైల్ : 87901 22275 -
పక్షులు ఆత్మహత్య చేసుకునే వీలుంది.. కానీ
జీవితమే నాటకీయం అంటే అందునా పురుషుడి ప్రతాపం కొద్దీ స్త్రీ జీవితం మరీ నాటకీయం. ఆమె తన స్వేచ్ఛ కోసం పురుషుడి అహాన్ని సంతృప్తి పరచడం కోసం అవసరమయ్యీ అసహాయతతో జీవన నాటకాన్ని రక్తి కట్టించక తప్పదు. ఆ సందర్భాలన్నీ చూడండి మీరు అని వాటిని స్టేజ్ మీదకు తీసుకు వస్తుంది పూర్వ నరేష్. కేవలం స్త్రీల కథలను గొప్ప నాటకాలుగా మలచడమే కాదు డ్రామాలు ప్రసారం చేసే టీవీ చానెల్స్‌లో వాటితో గొప్ప గుర్తింపును పొందింది కూడా. నేడు ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ఈ స్త్రీ దర్శకురాలి పరిచయం, నాటకాల దర్శనం. పూర్వ నరేష్ గురించి తర్వాత చెప్పుకుందాం. మొదట ఆమె రాసిన, పని చేసిన నాటకాలు ఏమిటో చూద్దాం. ఆమె ఒక నాటకం రాసింది. దాని పేరు ‘పింక్ శారీ రివెల్యూషన్’. ఇది బుందేల్‌ఖండ్‌లో మగవారి పెత్తందారితనాన్ని, స్త్రీల పట్ల వారి హింసను వ్యతిరేకించడానికి ఎదిరించడానికి ఒక మహిళ– సంపత్ పాల్ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘గులాబీ గ్యాంగ్’ను ఆధారం చేసుకుని తయారైన నాటకం. ఈ నాటకం స్త్రీల సమస్యలను, గృహ హింసను చర్చిస్తుంది. అయితే పూర్వనరేష్ అంత వరకే చెప్పి ఆగదు. ఈ నాటకం ఒక దళిత స్త్రీ మీద అత్యాచారాన్ని చూపుతుంది. ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే ఆధిపత్య కులాలు ఎలా తిమ్మిని బమ్మిని చేసి ఆ కేసును మాఫీ చేస్తాయో కూడా చూపుతుంది. స్త్రీలు బాధితులు అయితే బాధిత కులాల స్త్రీలు ఇంకా బాధితులని చెప్పే ఈ శక్తిమంతమైన నాటకం పూర్వ నరేష్ మాత్రమే రాయగలదు. వేయగలదు. ఇంకో నాటకం రాసింది. దాని పేరు ‘ఓకే.. టాటా.. బైబై’. ఈ నాటకం హైవేల మీద పడుపువృత్తి చేసుకునే మహిళలది. వచ్చే పోయే వాహనాలను ఆపి వారిని ఆకర్షించి పొట్టపోసుకునే మహిళలు వారితో గడిపి వెళ్లే పురుషులకు ‘ఓకే.. టాటా .. బైబై’ అని చెబుతారు అసలేమీ జరగనట్టుగా. నిజానికి అసలేమీ జరగలేదా? ఆ స్త్రీలు అక్కడ ఎందుకు ఉన్నారు? వారు మాత్రమే ఎందుకు ఉన్నారు? ఆ నేపథ్యం ఉన్నవారు మాత్రమే ఎందుకున్నారు? వారిని ఎవరు అలా ఉండనిస్తున్నారు? వారు ఇతరుల్లా హైవేల మీద కాకుండా ఇళ్లల్లో ఆఫీసుల్లో ఎందుకు లేరో చర్చిస్తుందీ నాటకం. ఇంకో నాటకం ఉంది. దాని పేరు ‘బందిష్ 20– 20,000 హెర్ట్జ్. ఇది ఇద్దరు సీనియర్ (రిటైర్డ్) గాయనీమణుల పాత్రలతో తయారైన నాటకం. ఒక గాయని శాస్త్రీయ గాయని. మరో గాయని దేశీయ గాయని. వీరు చాలా ఏళ్ల తర్వాత ఒక ఉత్సవంలో కలుస్తారు. ఎలా ఉన్నావ్ అంటే ఎలా ఉన్నావ్ అనుకుంటారు. వీళ్లిద్దరూ గొప్ప సంగీతకారులు. కాని వీరి జీవితంలో ఎన్ని అపశృతులు. వీళ్ల కళను మనస్ఫూర్తిగా ప్రదర్శించడానికి ఎన్ని సెన్సార్ షిప్‌లు. స్త్రీలు ఏ రంగంలో అయినా రాణించడం అంటే పేరు సంపాదించడం అంటే అది ఎంత పెద్ద పేరైనా పరిమితులతోనే సంపాదించారని అర్థం చేసుకోవాలి. పరిమితులే లేకపోతే వారు చూపే ప్రతిభ వేరు. మనిషి చెవి 20 నుంచి 20 వేల హెర్ట్జ్ వరకూ ఉన్న ధ్వని తరంగాలను మాత్రమే వినగలడు. కాని స్త్రీల వ్యధలు 20 హెర్ట్జ్ లోపు 20 వేల హెర్ట్జ్ ఆవల కూడా వినదగినన్ని ఉంటాయని ఈ నాటకం చెబుతుంది. దీనికి ప్రఖ్యాత గాయని శుభా ముగ్దల్ సంగీతం. పూర్వ నరేష్ రాసిన మరో ప్రఖ్యాత నాటకం ‘ఆజ్ రంగ్ హై’. 2010లో రాసిన ఈ నాటకం నేటికీ ఏదో ఒక ఊళ్లో, దేశంలో ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇది దేశ విభజన జరిగిన కొత్తల్లో సాగే కథ. ఒక ముస్లిం మొహల్లాలో ఉండే స్త్రీలు మారిన కాలమాన పరిస్థితుల్లో హిందూ ముస్లిం ఐక్యతను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తారు. దేశ విభజన ప్రజల మీద ఎన్ని కష్టాలు తెచ్చినా ఆ కష్టాలన్నింటి కంటే ఎక్కువ కష్టాలు పడింది స్త్రీలే. కుటుంబాలు, మానాలు, ప్రాణాలు అన్నీ వారే నష్టపోయారు. మత విద్వేషం అంతిమంగా స్త్రీ హింసగానే మారుతుందని హెచ్చరించే నాటకం ఇది. ఈ నాటకాలన్నీ రాసిన ప్రదర్శిస్తున్న పూర్వ నరేష్‌ను కేంద్ర నాటక అకాడెమీ తన యువ పురస్కారంతో 2013లోనే సత్కరించింది. ఇవాళ దేశంలో మహిళా నాటకకర్తల్లో పూర్వ నరేష్ పేరు గౌరవంగా పలికే స్థాయికి ఆమె కృషి కొనసాగుతూ ఉంది. ఎవరు పూర్వ నరేష్? 48 సంవత్సరాల పూర్వ నరేష్‌ది లక్నో. ఆమె తండ్రి నరేష్ సక్సేనా ఇంజనీర్ అయినా కవిగా ప్రసిద్ధుడు. తల్లి విజయా నరేష్ గాయని. ఇంట్లో ఎప్పుడూ నాటకాలు, కవిత్వం, కథలు... ఈ వాతావరణంలో పెరిగిన పూర్వ ఢిల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక పూణె వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి నాటకాలు వేయడం మొదలెట్టింది. ‘అవును... నేను స్త్రీల గురించి ఎక్కువ రాస్తాను. మాట్లాడతాను. వారి గురించి చేయాల్సింది చాలా ఉంది’ అంటుంది పూర్వ. ఆమె ముంబైలో రెండేళ్ల పాటు నటుడు రజత్ కపూర్ నాటక బృందంలో పని చేసి ఆ తర్వాత సొంతగా 2010లో ‘ఆరంభ్’ అనే నాటక సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా విస్తృతంగా స్త్రీ నాటకాన్ని ప్రచారం చేస్తోంది. ‘నేను విదేశాలలో కూడా మహిళా నాటక కర్తలతో ఎక్కువ కలిసి పని చేయడానికి ఇష్టపడతాను’ అంటుంది పూర్వ. ఇటీవల ఒక ఆస్ట్రేలియన్ మహిళా నాటకకర్త కోరిక మేరకు ‘జతింగ’ అనే నాటకం రాసింది పూర్వ. ఇది అస్సాంలోని ఓ ప్రాంతం. ఇక్కడ పక్షులు మిస్టీరియస్‌గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాయి. ఈ స్థలాన్ని స్త్రీల ట్రాఫికంగ్కు ప్రతీకగా తీసుకుని పూర్వ ఆ నాటకం రాసింది. ‘పక్షులకు ఆత్మహత్య చేసుకునే వీలుంది. కాని వ్యభిచార పంజరంలో చిక్కుకున్న స్త్రీకి ఆ స్వేచ్ఛ కూడా లేదు’ అని చర్చిస్తుందిది. పూర్వ నరేష్ బాగా ప్రయాణాలు చేస్తుంది. ‘జీవితం పుస్తకాల్లో ఉండే పేజీల్లో తెలియదు. పాస్‌పోర్ట్‌లో ఉండే పేజీల వల్ల తెలుస్తుంది’ అంటుందామె. అంటే పాస్‌పోర్ట్ లోపల ఎన్ని స్టాంపులు పడితే అంత బాగా కొత్త వ్యక్తుల ద్వారా లోకం తెలుస్తుందని. పూర్వ నరేష్ తన నాటకాలను ‘జీ’, ‘స్టార్’ టెలివిజన్ల ‘డ్రామా చానెల్స్’ ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. స్త్రీల చైతన్యం కోసం నాటకాన్ని సమర్థంగా ఉపయోగిస్తున్న పూర్వకు అభినందనలు తెలపడం మనం నేడు చేయగల సందర్భ శుద్ధి కలిగిన పని అని భావించవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
లైఫ్ ఈజ్ ప్లే
ఆసక్తి లేకపోవడమో, ఆకట్టుకునేలా ఉండకపోవడమో.. మొత్తానికి కొద్దిమందికే పరిమితమైంది థియేటర్. ఈ కళను బతికించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే కాదు.. ప్రభుత్వాలపైనా ఉందంటున్నారు ప్రొఫెసర్ అనంతకృష్ణన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్స్ ఆర్ట్స్ డీన్‌గా పనిచేస్తున్న ఆయన ప్రేక్షకులను థియేటర్స్ వరకూ రప్పించాల్సిన బాధ్యత మాత్రం నాటకకర్తలదేనని చెబుతున్నారు. ‘వరల్డ్ థియేటర్ డే’ సందర్భంగా ఆయనతో సిటీప్లస్ సంభాషణ.. ..:: ఓ మధు ఎన్ని రకాల మీడియాలు వచ్చినా థియేటర్కుండే ప్రాముఖ్యత ఉంటుంది. ఇది లైవ్ ఆర్ట్. లైవ్ పర్ఫార్మెన్స్, లైవ్ ఆడియెన్స్ ఉంటారు. 1940, 50లలో వర్ధిల్లిన ఈ ఆర్ట్ ఫామ్స్ నేడు తెరమరుగవుతున్నాయి. ఈ దురవస్థ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతియావత్తు ఉన్న సమస్య. వీటిపై ఫోకస్ చాలా తక్కువ. ఈ లైవ్ ఆర్ట్‌ని ఇప్పుడున్న సిస్టమ్స్ సపోర్ట్ చెయ్యట్లేదు. ఒకప్పుడు జాతీయ స్థాయి నాటక అవార్డులు అందుకున్న వారంతా తెలుగువారే. ఇప్పడు ఒక ఆర్టిస్ట్ ఆ రంగాన్ని నమ్ముకుని జీవితం వెళ్లదీసుకునే అవకాశాల్లేవు. ఈ కళ సంరక్షణకు ఏ పథకమూ లేదు. అయితే మంచి నాటకాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. మతానికి, ప్రాంతానికి, గుళ్లకు అనుబంధంగా ఉన్న కొన్ని సంప్రదాయక కళలు, చిందు భాగవతం లాంటి జానపద కళారూపాలకు నేటికీ ప్రేక్షకాదరణ ఉంది. కల్చరల్ పాలసీ కావాలి.. మహారాష్ట్రలో లైవ్ ఆర్ట్‌కి నేటికీ మంచి ఆదరణ ఉంది. జాడిపట్టిలో 10 కి.మీ పరిధిలో ఉన్న వేర్వేరు థియేటర్స్‌లో రోజుకి 40 వేల మంది నాటకాలు చూడ్డానికి వెళ్తుంటారు. చెన్నైలోని తెలుగు పరిషత్‌లు, థియేటర్లకు నేటికీ ఆదరణ ఉంది. విదేశాలలో ఆర్ట్ అండ్ కల్చర్‌కి ప్రాముఖ్యతనిస్తారు. అక్కడి కల్చరల్ పాలసీలు అలా పటిష్టంగా ఉంటాయి. అలాంటి కల్చరల్ పాలసీలు మన దగ్గరా రావాలి. ఇక సినిమా కోసం రూ.100 ఖర్చు పెట్టే వాళ్లు.. నాటకానికి రూ.50 పెట్టాలన్నా ఆలోచిస్తారు. అదే లండన్‌లోనైతే డ్రామా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతాయి. దీనికి థియేటర్ వాళ్లూ కొంత బాధ్యత వహించాలి. పెట్టిన డబ్బుకు మినిమం వినోదం అందించటం బాధ్యతగా భావించాలి. డిజిటల్ థియేటర్.. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను, జీవనశైలుల్ని అడాప్ట్ చేసుకుంటున్న మోడరన్ ఆర్ట్‌కి ఎప్పటికైనా మనుగడ ఉంటుంది. ఒకప్పటి దీపాల నుంచి లైటింగ్‌కి, సినోగ్రఫీ, సౌండ్ సిస్టమ్స్ ఇంకా చాలా మార్పులొచ్చాయి. డిజిటల్ మీడియా.. థియేటర్ మీదా ప్రభావం చూపుతోంది. డిజిటల్ థియేటర్ ఇన్ డిజిటల్ ఏజ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టాం. లైవ్ ఆర్ట్‌లో మిస్ అయ్యే అవకాశం ఉన్న వాటిని డిజిటల్లో చూపించే ఆస్కారం ఎక్కువ. లైవ్ ఆర్టిస్ట్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద కనిపించదు. దానిని డిజిటల్ ద్వారా లైవ్ ప్రొజెక్ట్ చెయ్యవచ్చు. ఉపాధి.. ప్రస్తుతం చాలా స్కూల్స్, కాలేజెస్ థియేటర్ని తమ కరిక్యులంలో భాగంగా చేసుకున్నాయి. అలాంటి స్కూల్స్, కాలేజీల్లో ఇక్కడ చదివిన విద్యార్థులు 25 నుంచి 30 వేల జీతంతో జాబ్స్ సంపాదించుకున్నారు. నాటకం వినోదం మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ ఉపకరిస్తుంది. ప్రస్తుతం అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల మనిషి ఏకాకి అవుతున్నాడు. డ్రామా గ్రూప్ యాక్టివిటీ కావటం వల్ల అందరితో కలిసే చాన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్, కాన్సన్ట్రేషన్ పెరుగుతాయి. కమ్యూనికేషన్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి.