పక్షులు ఆత్మహత్య చేసుకునే వీలుంది.. కానీ | Sakshi Special Story About World Theatre Day | Sakshi
Sakshi News home page

పక్షులు ఆత్మహత్య చేసుకునే వీలుంది.. కానీ

Published Sat, Mar 27 2021 4:44 AM | Last Updated on Sat, Mar 27 2021 9:41 AM

Sakshi Special Story About World Theatre Day

జీవితమే నాటకీయం అంటే అందునా పురుషుడి ప్రతాపం కొద్దీ స్త్రీ జీవితం మరీ నాటకీయం. ఆమె తన స్వేచ్ఛ కోసం పురుషుడి అహాన్ని సంతృప్తి పరచడం కోసం అవసరమయ్యీ అసహాయతతో జీవన నాటకాన్ని రక్తి కట్టించక తప్పదు. ఆ సందర్భాలన్నీ చూడండి మీరు అని వాటిని స్టేజ్‌ మీదకు తీసుకు వస్తుంది పూర్వ నరేష్‌. కేవలం స్త్రీల కథలను గొప్ప నాటకాలుగా మలచడమే కాదు డ్రామాలు ప్రసారం చేసే టీవీ చానెల్స్‌లో వాటితో గొప్ప గుర్తింపును పొందింది కూడా. నేడు ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ఈ స్త్రీ దర్శకురాలి పరిచయం, నాటకాల దర్శనం.

పూర్వ నరేష్‌ గురించి తర్వాత చెప్పుకుందాం. మొదట ఆమె రాసిన, పని చేసిన నాటకాలు ఏమిటో చూద్దాం. ఆమె ఒక నాటకం రాసింది. దాని పేరు ‘పింక్‌ శారీ రివెల్యూషన్‌’. ఇది బుందేల్‌ఖండ్‌లో మగవారి పెత్తందారితనాన్ని, స్త్రీల పట్ల వారి హింసను వ్యతిరేకించడానికి ఎదిరించడానికి ఒక మహిళ– సంపత్‌ పాల్‌ ఆధ్వర్యంలో ఏర్పడిన ‘గులాబీ గ్యాంగ్‌’ను ఆధారం చేసుకుని తయారైన నాటకం. ఈ నాటకం స్త్రీల సమస్యలను, గృహ హింసను చర్చిస్తుంది. అయితే పూర్వనరేష్‌ అంత వరకే చెప్పి ఆగదు. ఈ నాటకం ఒక దళిత స్త్రీ మీద అత్యాచారాన్ని చూపుతుంది. ఒక దళిత స్త్రీ మీద అత్యాచారం జరిగితే ఆధిపత్య కులాలు ఎలా తిమ్మిని బమ్మిని చేసి ఆ కేసును మాఫీ చేస్తాయో కూడా చూపుతుంది. స్త్రీలు బాధితులు అయితే బాధిత కులాల స్త్రీలు ఇంకా బాధితులని చెప్పే ఈ శక్తిమంతమైన నాటకం పూర్వ నరేష్‌ మాత్రమే రాయగలదు. వేయగలదు.

ఇంకో నాటకం రాసింది. దాని పేరు ‘ఓకే.. టాటా.. బైబై’. ఈ నాటకం హైవేల మీద పడుపువృత్తి చేసుకునే మహిళలది. వచ్చే పోయే వాహనాలను ఆపి వారిని ఆకర్షించి పొట్టపోసుకునే మహిళలు వారితో గడిపి వెళ్లే పురుషులకు ‘ఓకే.. టాటా .. బైబై’ అని చెబుతారు అసలేమీ జరగనట్టుగా. నిజానికి అసలేమీ జరగలేదా? ఆ స్త్రీలు అక్కడ ఎందుకు ఉన్నారు? వారు మాత్రమే ఎందుకు ఉన్నారు? ఆ నేపథ్యం ఉన్నవారు మాత్రమే ఎందుకున్నారు? వారిని ఎవరు అలా ఉండనిస్తున్నారు? వారు ఇతరుల్లా హైవేల మీద కాకుండా ఇళ్లల్లో ఆఫీసుల్లో ఎందుకు లేరో చర్చిస్తుందీ నాటకం.

ఇంకో నాటకం ఉంది. దాని పేరు ‘బందిష్‌ 20– 20,000 హెర్‌ట్జ్‌. ఇది ఇద్దరు సీనియర్‌ (రిటైర్డ్‌) గాయనీమణుల పాత్రలతో తయారైన నాటకం. ఒక గాయని శాస్త్రీయ గాయని. మరో గాయని దేశీయ గాయని. వీరు చాలా ఏళ్ల తర్వాత ఒక ఉత్సవంలో కలుస్తారు. ఎలా ఉన్నావ్‌ అంటే ఎలా ఉన్నావ్‌ అనుకుంటారు. వీళ్లిద్దరూ గొప్ప సంగీతకారులు. కాని వీరి జీవితంలో ఎన్ని అపశృతులు. వీళ్ల కళను మనస్ఫూర్తిగా ప్రదర్శించడానికి ఎన్ని సెన్సార్‌ షిప్‌లు. స్త్రీలు ఏ రంగంలో అయినా రాణించడం అంటే పేరు సంపాదించడం అంటే అది ఎంత పెద్ద పేరైనా పరిమితులతోనే సంపాదించారని అర్థం చేసుకోవాలి. పరిమితులే లేకపోతే వారు చూపే ప్రతిభ వేరు. మనిషి చెవి 20 నుంచి 20 వేల హెర్ట్‌జ్‌ వరకూ ఉన్న ధ్వని తరంగాలను మాత్రమే వినగలడు. కాని స్త్రీల వ్యధలు 20 హెర్‌ట్జ్‌ లోపు 20 వేల హెర్‌ట్జ్‌ ఆవల కూడా వినదగినన్ని ఉంటాయని ఈ నాటకం చెబుతుంది. దీనికి ప్రఖ్యాత గాయని శుభా ముగ్దల్‌ సంగీతం.

పూర్వ నరేష్‌ రాసిన మరో ప్రఖ్యాత నాటకం ‘ఆజ్‌ రంగ్‌ హై’. 2010లో రాసిన ఈ నాటకం నేటికీ ఏదో ఒక ఊళ్లో, దేశంలో ప్రదర్శింపబడుతూనే ఉంది. ఇది దేశ విభజన జరిగిన కొత్తల్లో సాగే కథ. ఒక ముస్లిం మొహల్లాలో ఉండే స్త్రీలు మారిన కాలమాన పరిస్థితుల్లో హిందూ ముస్లిం ఐక్యతను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తారు. దేశ విభజన ప్రజల మీద ఎన్ని కష్టాలు తెచ్చినా ఆ కష్టాలన్నింటి కంటే ఎక్కువ కష్టాలు పడింది స్త్రీలే. కుటుంబాలు, మానాలు, ప్రాణాలు అన్నీ వారే నష్టపోయారు. మత విద్వేషం అంతిమంగా స్త్రీ హింసగానే మారుతుందని హెచ్చరించే నాటకం ఇది.
ఈ నాటకాలన్నీ రాసిన ప్రదర్శిస్తున్న పూర్వ నరేష్‌ను కేంద్ర నాటక అకాడెమీ తన యువ పురస్కారంతో 2013లోనే సత్కరించింది. ఇవాళ దేశంలో మహిళా నాటకకర్తల్లో పూర్వ నరేష్‌ పేరు గౌరవంగా పలికే స్థాయికి ఆమె కృషి కొనసాగుతూ ఉంది.

ఎవరు పూర్వ నరేష్‌?
48 సంవత్సరాల పూర్వ నరేష్‌ది లక్నో. ఆమె తండ్రి నరేష్‌ సక్సేనా ఇంజనీర్‌ అయినా కవిగా ప్రసిద్ధుడు. తల్లి విజయా నరేష్‌ గాయని. ఇంట్లో ఎప్పుడూ నాటకాలు, కవిత్వం, కథలు... ఈ వాతావరణంలో పెరిగిన పూర్వ ఢిల్లీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాక పూణె వెళ్లి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంది. ఆ తర్వాత బయటకు వచ్చి నాటకాలు వేయడం మొదలెట్టింది. ‘అవును... నేను స్త్రీల గురించి ఎక్కువ రాస్తాను. మాట్లాడతాను. వారి గురించి చేయాల్సింది చాలా ఉంది’ అంటుంది పూర్వ.

ఆమె ముంబైలో రెండేళ్ల పాటు నటుడు రజత్‌ కపూర్‌ నాటక బృందంలో పని చేసి ఆ తర్వాత సొంతగా 2010లో ‘ఆరంభ్‌’ అనే నాటక సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా విస్తృతంగా స్త్రీ నాటకాన్ని ప్రచారం చేస్తోంది. ‘నేను విదేశాలలో కూడా మహిళా నాటక కర్తలతో ఎక్కువ కలిసి పని చేయడానికి ఇష్టపడతాను’ అంటుంది పూర్వ. ఇటీవల ఒక ఆస్ట్రేలియన్‌ మహిళా నాటకకర్త కోరిక మేరకు ‘జతింగ’ అనే నాటకం రాసింది పూర్వ. ఇది అస్సాంలోని ఓ ప్రాంతం. ఇక్కడ పక్షులు మిస్టీరియస్‌గా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాయి. ఈ స్థలాన్ని స్త్రీల ట్రాఫికంగ్‌కు ప్రతీకగా తీసుకుని పూర్వ ఆ నాటకం రాసింది. ‘పక్షులకు ఆత్మహత్య చేసుకునే వీలుంది. కాని వ్యభిచార పంజరంలో చిక్కుకున్న స్త్రీకి ఆ స్వేచ్ఛ కూడా లేదు’ అని చర్చిస్తుందిది.


పూర్వ నరేష్‌ బాగా ప్రయాణాలు చేస్తుంది. ‘జీవితం పుస్తకాల్లో ఉండే పేజీల్లో తెలియదు. పాస్‌పోర్ట్‌లో ఉండే పేజీల వల్ల తెలుస్తుంది’ అంటుందామె. అంటే పాస్‌పోర్ట్‌ లోపల ఎన్ని స్టాంపులు పడితే అంత బాగా కొత్త వ్యక్తుల ద్వారా లోకం తెలుస్తుందని.

పూర్వ నరేష్‌ తన నాటకాలను ‘జీ’, ‘స్టార్‌’ టెలివిజన్‌ల ‘డ్రామా చానెల్స్‌’ ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. స్త్రీల చైతన్యం కోసం నాటకాన్ని సమర్థంగా ఉపయోగిస్తున్న పూర్వకు అభినందనలు తెలపడం మనం నేడు చేయగల సందర్భ శుద్ధి కలిగిన పని అని భావించవచ్చు.

– సాక్షి ఫ్యామిలీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement