నాటక యవనికపై యువ సంతకం
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది....
తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్‌ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్‌షాప్‌లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది.
‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో నిరీక్షణ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్‌లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్.
బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్‌లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది.
పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ.
కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్‌ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్‌లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ.
మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది.
తమాషాగా సంతోషంగా...
ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్‌లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు.
తోడా ధ్యాన్ సే...
సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది.
రంగస్థలమే పాఠశాల
మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్‌ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్‌పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే.
Comments
Please login to add a commentAdd a comment