అవయవ దానంపై పెరుగుతున్న ఆసక్తి
పేర్ల నమోదులో దక్షిణాదిలోనే కర్ణాటక ముందంజ
యువతలో స్ఫూర్తి నింపుతున్న హరీష్ చివరి కోరిక
సగటున రోజూ 20 మంది జెడ్‌సీసీకే వద్ద పేర్ల నమోదు
బెంగళూరు: అవయవ దానంపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. తాము చనిపోయిన తర్వాత తమతో పాటు విలువ కట్టలేని అవయవాలు మట్టిలో కలిసిపోకూడదని రాష్ట్ర యువత భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో అవయవ దానం చేయడానికి యువత ముందుకు వస్తున్నారు. 2015లో 60 మంది అవయవ దానం చేయగా వారి ద్వారా సేకరించిన 158 అవయవాలు ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇతరులకు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అవయవదానం విషయమై దాతలకు, గ్రహీతలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్న జోనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ట్రాన్స్‌ప్లాన్టేషన్ (జెడ్‌సీసీకే) సంస్థ వద్ద 10 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో అవయవదానం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడం కర్ణాటకలోనే ఎక్కువ ని జెడ్‌సీసీకే సంస్థ చెబుతోంది. అంతేకాకండా అవయవదానం కోసం ముందుకు వచ్చేవారిలో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు కావడమే గమనార్హం. ఇదిలా ఉండగా నెలమంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు ముక్కలు అయినా తన కళ్లను దానం చేయాలని హరీష్ చెప్పిన సంగతి తెలిసిందే. అ ఘటన జరిగినప్పటి నుంచి అవయవదానం కోసం ముందుకు వ చ్చేవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ప్రతి రోజు సగటున 20 మంది జెడ్‌సీసీకే వద్ద తమ పేర్లను అవయవదానం కోసం నమోదు చేయించుకుంటున్నారు.
అవయవదానం అంటే...
ఏదేని వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు బ్రెయిడ్‌డెడ్ స్థితికి చేరుకుంటే సదరు వ్యక్త్తి నుంచి (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా బంధువులు అనుమతితో) కళ్లు, మూత్రపిండాలు, లివర్ తదితర అవయవాలను సేకరిస్తారు. అటుపై వాటిని అవసరమైన వారికి శ స్త్ర చికిత్స ద్వారా అమరుస్తారు. దీనినే వైద్య పరిభాషలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అంటారు. దీని వల్ల అత్యంత విలువైన మానవ అవ యవాలు మరోకరికి జీవం పోస్తాయి.
జెడ్‌సీసీకే పాత్ర ఏంటంటే...
ప్రతి రాష్ట్రంలో అవయవదానంపై జాగృతి కోసం ఒక సంస్థ పనిచేస్తుంటుంది. అంతేకాకుండా ఈ సంస్థ అటు వ్యాధిగ్రస్తులకు, ప్రభుత్వంతో పాటు అవయవదానం కోసం ముందుకు వచ్చే వారి మధ్య సంధానకర్తగా పనిచేస్తుంటుంది. కర్ణాటకలో జెడ్‌సీసీకే సంస్థ ఈ విధులను నిర్వర్తిస్తోంది. ఇదిలా ఉండగా ఆయా అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు మొదట రూ.2వేలు చెల్లించి జెడ్‌సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జెడ్‌సీసీకే సంస్థ సదరు వ్యక్తి బ్లడ్‌గ్రూప్, వ యస్సు తదితర విషయాలన్నీ (హెల్త్ హిస్టరీ) నమోదు చేస్తారు. ప్రమాద సమయంలో బ్రెయిడ్‌డెడ్ అయిన వ్యక్తులు ఎవరైనా వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తే వారి వయస్సు, బ్లడ్‌గ్రూప్ తదితర విషయాలను అప్పటికే సదరు అవయవాల కోసం తమ వద్ద పేర్లు నమోదు చేసుకొన్న వ్యక్తుల వివరాలతో జెడ్‌సీసీకే సిబ్బంది పోల్చి చూస్తారు. అన్నిరకాలుగా ఇరువురి హెల్త్‌హిస్టరీ సరిపోతే సదరు అవయవాలను పేషెంట్‌కు ఉచితంగా అందజేస్తారు. ఇక శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును (ప్రైవేటు ఆస్పత్రుల్లో) వ్యాధిగస్తుడే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిడ్నీ సంబంధ ఆర్గాన్‌ట్రాన్స్‌ప్లాంట్ విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్నారు.
ఎంత మంది ఎదురు చూస్తున్నారంటే...
ప్రస్తుతం కిడ్నీ, లివర్ తదితర అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 2,502 మంది... జెడ్‌సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో కిడ్నీ కోసం 1,834 మంది, లివర్ కోసం 600, హృదయం కోసం 40, ఊపిరితిత్తుల కోసం 6 మంది, కిడ్నీ, లివర్ రెండింటీ కోసం 11 మంది, హృదయం, ఊపిరితిత్తుల కోసం 8 మంది, ప్యాంక్రియాస్ కోసం ముగ్గురు ఎదురు చేస్తున్నారు.
పేర్ల నమోదు ఇలా...
అవయవదానంతో పాటు కిడ్నీ, లివర్ తదితర అవయవసంబంధ వ్యాధులతో బాధవపడుతూ సదరు అవయవాల కోసం ఎదురు చూస్తున్నవారు 9845006768, zcckbangalore@gmail.com, www.zcck.in లో సంప్రదించవచ్చు.
స్పందిస్తున్న హృదయాలు
Published Mon, Mar 14 2016 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM
Advertisement