
జనగామలోని కృష్ణ కళామందిర్
జనగామ అర్బన్ : సినిమా..చూసొద్దామా మామ.. సినిమా చూసొద్దామా.. మామ అనే పాటను మధ్య తరగతి ప్రజలు ఇక ఎంచాక్కా పాడుకోవచ్చు. పండుగపూటో, సెలవుదినాల్లో కుటుంబంతో సరాదగా సినిమాకెళ్తే టికెట్ల ధరల కన్నా తినుబండారాల బిల్లు తడిసిమోపెడవుతోంది. దీంతో కుటుంబ సభ్యులతో సహా సినిమాకు వెళ్లాలంటేను జంకుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సగటు ప్రేక్షకుడు హాయిగా సినిమా చూడటంతో పాటు జేబుకు చిల్లుపడే కార్యక్రమానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేస్తోంది.
థియేటర్లలో విక్రయించే తినుబండారాలు, శీతల పానీయాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలోని 20, మహబూబాబాద్ జిల్లాలోని 08, జనగామ 03, భూపాలపల్లి జిల్లాలో 04 సినిమా థియేటర్ల యాజమాన్యాలకు తూనికలు, కొలతల అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు ఇటీవల వరంగల్ జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు.
కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.అంతేకాకుండా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించడానికి అవసరమైన చర్యలను కూడా చేపట్టనున్నారు. కాగా సినిమా థియేటర్లలో ప్రేక్షకులు, వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18004250033, వాటప్స్ నబంర్ 7330774444 కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సినిమా హాళ్లలో ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చట్టబద్ధంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టనుంది.
వీటిపై ఫిర్యాదు చేయవచ్చు..విడిగా విక్రయించే తినుబండారాల్లో నాణ్యత లోపించినా.. ఉత్పత్తుల బరువు, పరిమాణం, గడువు దాటినా, ఎమ్మార్పీ లేకపోయినా, ప్యాకేజీ రూపంలో ఉన్న వస్తువులపై పేరు, కస్టమర్ కేర్ వివరాలు లేకపోయినా ప్రేక్షకులు టోల్‌ఫ్రీ లేదా వాటప్స్ నంబర్‌కు వెంటనే సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదు చేయవచ్చు. ప్రేక్షకుల ఫిర్యాదును బట్టి జరిమానాతో పాటు జైలు శిక్షలు విధించే విధంగా అధికారులు విధి విధానాలను రూపొందించడం గమనార్హం. ఇక నుంచి సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కష్టాలు తప్పనున్నాయి. అధికారులు తీసుకుంటున్న చర్యలపై సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం..
సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. దీంతో నాణ్యమైన ఉత్పత్తులు సరైన ధరలకు లభించడంతో పాటు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మధ్య తరగతి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. – పాము శ్రీనివాస్, జనగామ
నిబంధనలను పాటించాల్సిందే..
ప్రభుత్వం తూనికలు, కొలతల శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు, రూపొందించిన విధివిధానాలను అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు పాటించాల్సిందే. ఇప్పటికే ఈ విషయంలో నోటీసులు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం.
– ఎస్. విజయ్‌కుమార్, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి, జనగామ
Comments
Please login to add a commentAdd a comment