జనగామలో భిక్షాటన చేస్తున్న డీలర్లు
జనగామ: ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రేషన్ డీలర్లు జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం భిక్షాటన చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు మురళీధర్‌రావు ఆధ్వర్యంలో ప్రిస్టన్ కళాశాల మైదానం నుంచి భిక్షాటన చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్కు, రైల్వే స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైగా రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులు పడుతూ ప్రజలకు రేషన్ సరుకులు అందజేస్తున్నారని తెలిపారు. తక్కువ కమీషన్ ఇచ్చినా సేవే పరమావధిగా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా పనిచేస్తున్న తమను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూడడం బాధగా ఉందన్నారు.
ఈ పాస్ విధానాన్ని సక్సెస్ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని, జూలై 1 వరకు ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక బంద్ పాటిస్తామని హెచ్చరించారు. డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతోపాటు రూ.30 వేల వేతనం అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు అబ్బాస్, సింగపురం మోహన్, పుణ్యవతి, వెంకటేశ్వర్లు, అంజయ్య, శ్రీధర్, కిరణ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment