మద్యం టెండర్ల కోసం బంగారం తాకట్టు | Hostage Of Gold Ornaments For Wine Shop Tenders In Jangoan | Sakshi
Sakshi News home page

మద్యం టెండర్ల కోసం బంగారం తాకట్టు

Published Tue, Oct 15 2019 11:10 AM | Last Updated on Tue, Oct 15 2019 11:10 AM

Hostage Of Gold Ornaments For Wine Shop Tenders In Jangoan  - Sakshi

సాక్షి, జనగామ : మద్యం టెండర్ల దరఖాస్తుకు గడువు రేపటితో ముగుస్తుండడంతో దరఖాస్తులు డబ్బులు కోసం బంగారం తాకట్టు పెడుతున్నారు. క్యాష్‌ కోసం పరేషాన్‌ అవుతున్నారు. ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.  మద్యం షాపుల టెండర్ల అప్లికేషన్లకు ఈనెల 16వ తేదీతో గడువు ముగిసిపోనుంది. దీంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డీడీలు, చలాన్‌ ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 42 మద్యం షాపులకు ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన అప్లికేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా 18వ తేదీన డ్రా తీయడానికి ఎక్సైజ్‌ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. 

డబ్బు కోసం ముమ్మర ప్రయత్నాలు..
ప్రభుత్వం ఈ ఏడాది నూతన మద్యం పాలసీని ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి ఉన్న షాపుల కేటాయింపు కోసం టెండర్‌ ప్రక్రియను నిర్వహిస్తోంది. టెండర్‌లో పాల్గొనడం కోసం అప్లికేషన్‌ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెంచింది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.రెండు లక్షలు చెల్లించి టెండర్‌లో పాల్గొనడం కోసం అప్లికేషన్‌ సమర్పించాల్సి ఉంది. అప్లికేషన్‌ ఫీజు రూ.రెండు లక్షలు పెంచడంతో దరఖాస్తుదారులు 
డబ్బులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో గోల్డ్‌ లోన్, ఇతర ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బుల కోసం చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం పంటలు చేతికి రాకపోవడంతో రైతుల వద్ద సైతం డబ్బులు లేవు. దీంతో చివరి ప్రయత్నంగా ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు, బంధువుల వద్ద సంప్రదింపులు చేస్తున్నారు. రూ.లక్షకు రూ.రెండు నుంచి నాలుగు రూపాయల వడ్డీతో తీసుకుంటున్నారు. 

గ్రూపులు గ్రూపులుగా..
మద్యం టెండర్ల అప్లికేషన్ల కోసం దరఖాస్తు చేయడానికి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా జత కడుతున్నారు. ఐదు నుంచి పది మంది సభ్యులు కలిసి సమష్టిగా డబ్బులను సమకూర్చుకొని దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన పెద్ద వ్యాపారులు అయితే కుటుంబ సభ్యుల పేర్లతోనే కాకుండా బినామీ పేర్లతో దరఖాస్తులు సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

పెరుగుతున్న టెండర్‌ ఫీజుతో పరేషాన్‌..
మద్యం లైసెన్స్‌ కోసం టెండర్ల ఫీజు పెరుగుతుండడంతో వ్యాపారులు డబ్బుల కోసం పరేషాన్‌ అవుతున్నారు. 2012కు ముందు సీక్రెట్‌ పద్ధతిలో టెండర్లు నిర్వహించే వారు. ఎవరు ఎక్కువ టెండర్‌ వేస్తే వారికే ఆ షాపు దక్కేది. 2012 నుంచి డ్రా పద్ధతితో మద్యం షాపులను అప్పగిçస్తున్నారు. 2012–14 రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ల కోసం కేవలం రూ.25వేలు మాత్రమే ఫీజుగా ఉండేది. ఆ తరువాత 2014–15లో టెండర్‌ అప్లికేషన్‌ ఫీజు రూ.50 వేలుగా ఉండేది.  2015–17, 2017–19లో టెండర్‌ అప్లికేషన్‌ ఫీజు రూ. లక్షగా నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్‌ అప్లికేషన్‌ ఫీజు మాత్రం అమాంతం రూ.రెండు లక్షలకు పెంచడంతో డబ్బులు కోసం నానా పాట్లు పడుతున్నారు. 2017–19 సంవత్సరంలో 41 షాపులకు 1280 దరఖాస్తులు వచ్చాయి. కానీ పెంచిన ఫీజు కారణంగా గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. చివరి రోజు బుధవారం మంచి ముహుర్తం ఉండడంతో అధికంగా దరఖాస్తులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement