wine shop tenders
-
Telangana: ఈనెల 4న మద్యం లాటరీలకు నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023–25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై మంగళవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! -
మద్యం టెండర్ల కోసం బంగారం తాకట్టు
సాక్షి, జనగామ : మద్యం టెండర్ల దరఖాస్తుకు గడువు రేపటితో ముగుస్తుండడంతో దరఖాస్తులు డబ్బులు కోసం బంగారం తాకట్టు పెడుతున్నారు. క్యాష్ కోసం పరేషాన్ అవుతున్నారు. ప్రైవేట్ చిట్ఫండ్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మద్యం షాపుల టెండర్ల అప్లికేషన్లకు ఈనెల 16వ తేదీతో గడువు ముగిసిపోనుంది. దీంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి డీడీలు, చలాన్ ఇచ్చే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లావ్యాప్తంగా 42 మద్యం షాపులకు ఈ నెల తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన అప్లికేషన్ల దాఖలుకు చివరి గడువు కాగా 18వ తేదీన డ్రా తీయడానికి ఎక్సైజ్ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. డబ్బు కోసం ముమ్మర ప్రయత్నాలు.. ప్రభుత్వం ఈ ఏడాది నూతన మద్యం పాలసీని ప్రకటించింది. రెండేళ్ల కాలపరిమితి ఉన్న షాపుల కేటాయింపు కోసం టెండర్ ప్రక్రియను నిర్వహిస్తోంది. టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ దరఖాస్తు ఫీజును రూ.రెండు లక్షలకు పెంచింది. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.రెండు లక్షలు చెల్లించి టెండర్లో పాల్గొనడం కోసం అప్లికేషన్ సమర్పించాల్సి ఉంది. అప్లికేషన్ ఫీజు రూ.రెండు లక్షలు పెంచడంతో దరఖాస్తుదారులు డబ్బులు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో గోల్డ్ లోన్, ఇతర ప్రైవేట్ చిట్‌ఫండ్ కంపెనీలు, వడ్డీ వ్యాపారులు నుంచి డబ్బుల కోసం చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం పంటలు చేతికి రాకపోవడంతో రైతుల వద్ద సైతం డబ్బులు లేవు. దీంతో చివరి ప్రయత్నంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బంధువుల వద్ద సంప్రదింపులు చేస్తున్నారు. రూ.లక్షకు రూ.రెండు నుంచి నాలుగు రూపాయల వడ్డీతో తీసుకుంటున్నారు. గ్రూపులు గ్రూపులుగా.. మద్యం టెండర్ల అప్లికేషన్ల కోసం దరఖాస్తు చేయడానికి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా జత కడుతున్నారు. ఐదు నుంచి పది మంది సభ్యులు కలిసి సమష్టిగా డబ్బులను సమకూర్చుకొని దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. మద్యం వ్యాపారంలో ఆరితేరిన పెద్ద వ్యాపారులు అయితే కుటుంబ సభ్యుల పేర్లతోనే కాకుండా బినామీ పేర్లతో దరఖాస్తులు సమర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పెరుగుతున్న టెండర్ ఫీజుతో పరేషాన్.. మద్యం లైసెన్స్ కోసం టెండర్ల ఫీజు పెరుగుతుండడంతో వ్యాపారులు డబ్బుల కోసం పరేషాన్ అవుతున్నారు. 2012కు ముందు సీక్రెట్ పద్ధతిలో టెండర్లు నిర్వహించే వారు. ఎవరు ఎక్కువ టెండర్ వేస్తే వారికే ఆ షాపు దక్కేది. 2012 నుంచి డ్రా పద్ధతితో మద్యం షాపులను అప్పగిçస్తున్నారు. 2012–14 రెండేళ్ల కోసం నిర్వహించిన టెండర్ల కోసం కేవలం రూ.25వేలు మాత్రమే ఫీజుగా ఉండేది. ఆ తరువాత 2014–15లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ.50 వేలుగా ఉండేది. 2015–17, 2017–19లో టెండర్ అప్లికేషన్ ఫీజు రూ. లక్షగా నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ అప్లికేషన్ ఫీజు మాత్రం అమాంతం రూ.రెండు లక్షలకు పెంచడంతో డబ్బులు కోసం నానా పాట్లు పడుతున్నారు. 2017–19 సంవత్సరంలో 41 షాపులకు 1280 దరఖాస్తులు వచ్చాయి. కానీ పెంచిన ఫీజు కారణంగా గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. చివరి రోజు బుధవారం మంచి ముహుర్తం ఉండడంతో అధికంగా దరఖాస్తులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. -
మాకో వైన్స్ కావాలి..!
సిరిసిల్ల: మరో పన్నెండు రోజుల్లో మద్యం లైసెన్స్‌ల గడువు ముగియనుంది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీ ఏవిధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు వ్యాపారులు, యువకులు సైతం ఈసారి మద్యం లైసెన్స్‌లు పొందేందుకు జతకడుతున్నారు. జిల్లాలో 42 మద్యం దుకాణాలు ఉండగా.. వీటికి 2017 సెప్టెంబరులో లైసెన్స్ జారీచేశారు. అదే ఏడాది అక్టోబరు ఒకటే తేదీన వైన్స్‌లు తెరిచారు. కలిసొచ్చిన ఎన్నికలు.. మద్యం వ్యాపారులకు గతరెండేళ్లు కలిసి వచ్చింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్ల మెంట్ ఎన్నికలు వరుసగా రావడంతో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. జిల్లాలో 42 దుకాణాలు ఉండగా.. రెండేళ్లలో రూ.560. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 8,29,882 ఐఎంఎల్ బాక్స్‌లు, 17,27,113 బీర్ బ్యాక్స్‌లు అమ్ముడుపోయాయి. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఊరూరా కిక్కు.. జిల్లాలోని 42 మద్యం దుకాణాలకు అనుబంధంగా అనేక గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచారు. సుమారు వెయ్యికిపైగా బెల్ట్‌షాపులు ఉన్నాయని తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేటలోని ఓ వైన్స్‌లో రెండేళ్లలో రూ.23.05 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 25.1 శాతం అమ్మకాలతో టాప్‌లో నిలిచింది. ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి వైన్స్ షాపుల్లోనూ వరుసగా రూ.18.80కోట్లు, రూ.18.77 కోట్లతో రెండు, మూడు స్థానంలో నిలిచాయి. ఇల్లంతకుంటలోని ఓ వైన్స్ షాప్‌లో రూ.17.54కోట్ల మద్యం విక్రయించి నాలుగో స్థానం దక్కించుకుంది. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట వైన్స్ షాపులు వరుసగా పదో స్థానం వరకు ఉన్నాయి. వేములవాడలో ఓ వైన్స్ షాపు రూ.14.50 కోట్ల మద్యం విక్రయించి 11వ స్థానంలో ఉండగా రెండేళ్లలో రూ.10 కోట్లలోపు మద్యం విక్రయించి వేములవాడలోని ఓ మూడు వైన్స్ షాపులు చివరిస్థానంలో నిలిచాయి. కొత్త పాలసీపై కోటి ఆశలు వచ్చే అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. దరఖాస్తు ఫీజు, ఈఎండీలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే ఉత్కంఠ లిక్కర్ వ్యాపారుల్లో నెలకొంది. ఇప్పటికే మద్యం వ్యాపారులు సన్నిహితులతో జతకడుతూ సిండికేట్‌గా మారుతున్నారు. 10 మంది జతగా ఉండి దరఖాస్తు చేసుకుని ఏ ఒక్కరికి లక్కీ డ్రాలో మద్యం షాపు వచ్చినా అందరూ పంచుకునేలా ఒప్పందాలు చేసు కుంటున్నారు. రెండేళ్ల క్రితం ఆబ్కారీ పాలసీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష ఉండగా, ఈఎండీ లైసె న్స్ ఫీజులో 10 శాతం ఉంది. అంటే మండల కేంద్రాల్లో రూ.4.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.50లక్షలు నిర్దేశించారు. జనాభా ప్రాతిపదికన ఆబ్కారీ విధానం రూపొందించారు. గతంలో జిల్లాలోని 42 వైన్స్ షాపులకు 672 దర ఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.6.72 కోట్ల ఆదాయం సమకూరింది. లిక్కర్‌కు ‘రియల్’ ఎఫెక్ట్... జిల్లాలో మద్యం వ్యాపారంపై రియల్ ఎస్టేట్ భూం ప్రభావం ప్రధానంగా ఉంటుంది. సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందా ఎక్కువగా ఉంది. భూముల ధరలు పదింతలు అవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం గా ఉన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రాగానే రూ. కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు, మూడు రోజుల్లో కొత్త ఆబ్కారీ విధానానికి నోటిఫికేషన్ వెలువడుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈసారి అన్ని వైన్స్ లకు భారీగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. -
మద్యంలోకి రియల్
సాక్షి, యాదాద్రి : ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించనున్న తరుణంలో ఈ వ్యాపార రంగంలోకి కొత్త రక్తం దూసుకురావడానికి సిద్ధమవుతోంది. గడచిన రెండేళ్లలో మద్యం అమ్మకాలు పెరగడం, లాభాలుకూడా భారీగా రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వ్యాపారంలో ఉన్నవారితో పాటు కొత్తవారు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో చాలా మంది రియల్టర్లు మద్యం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. నూతన మద్యం పాలసీ ప్రకారం ముందుగా దరఖాస్తు ఫారానికి డబ్బులు జమచేసి పోటీలో దిగితే చాలనుకుంటున్నారు. అదృష్టం వరించి లాటరీలో దుకాణం వస్తే ఆ తర్వాత సిండికేట్ కావచ్చన్న ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సారి మద్యం దుకాణాల కోసం పెద్ద ఎత్తున పోటీ పడే అవకాశం ఉంది. పెరగనున్న దరఖాస్తు ఫీజు..! ప్రభుత్వం ఈసారి మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఆసక్తిగా ఉన్నారు. లాటరీలో దుకాణం వచ్చిన తర్వాతే ఈఎండీ చెల్లించాలన్న నిబంధన సడలింపుతో పోటీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 67 వైన్స్‌లు, 4 బార్లు ఉండగా 2017లో 1130మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష రుసుం తిరిగి చెల్లించని మొత్తాన్ని నిర్ణయించారు. దీంతో ప్రభుత్వానికి రూ.11.30 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రధానంగా భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ సర్కిళ్లలో అడ్డగూడూరు మండలం మినహా మిగతా 15 మండలాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. తాజాగా అడ్డగూడూరు మండలంతోపాటు, నూతన మన్సిపాలిటీల్లో బార్లు రాబోతున్నాయి. 2015లో మద్యం దుకాణం దరఖాస్తు రుసుం రూ.50వేలు ఉండగా ఆ మొత్తాన్ని 2107లో రూ.లక్షకు పెంచినప్పటికీ దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈసారి బార్లు, వైన్స్‌ల సంఖ్యతోపాటు మద్యం రెంటల్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్లలో రూ.991.40 కోట్ల మద్యం అమ్మకాలు గడిచిన రెండేళ్లలో జిల్లాలో మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 2017 నుంచి సెప్టెంబర్ 2018 వరకు రూ.468.62 కోట్ల విలువ చేసే మద్యం, బీర్లు సేవించారు. 7,35,309 మద్యం సీసాలు, 14,06,130 బీరు బాక్సులు ఖాళీ చేశారు. అయితే రెండో సంవత్సరంలో అమ్మకాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 2018 నుంచి ఆగస్టు 2019 వరకు రూ.522.83 కోట్ల విలువైన మద్యాన్ని, బీర్లను సేవించారు. ఇందులో 7,60,337 మద్యం సీసాలు, 15,01,709 బీరు బాక్సుల అమ్మకం జరిగింది. దీంతో ప్రభుత్వానికి, వ్యాపారులకు ఆదాయం భారీగానే సమకూరింది. ఈసారి మరింత ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం నూతన పాలసీని తీసుకురాబోతుంది. -
వేలం రాబోతోంది..!
సాక్షి, మహబూబ్‌నగర్ : మద్యం దుకాణాల వేలానికి గడువు సమీపిస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సందడి నెలకొంది. నూతన మద్యం పాలసీలో భారీ మార్పులు జరగబోతున్నాయని ప్రచారం సాగినా శాఖాపరంగా ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు లేవు. ఈ విధానంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న అనుమతి గదులను తొలగించే అంశాన్ని ఉన్నత స్థాయి పరిశీలనలో ఉన్నప్పటికీ ఆ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదు. 2017కు ముందు లైసెన్స్ ఫీజుకు అదనంగా అనుమతి గదికి రూ.లక్ష తీసుకునే విధానం ఉండగా ఇప్పుడు లైసెన్స్ ఫీజులోనే కలిపారు. కొత్త విధానంలో అనుమతి గది లేకుండా చేయాలని, అవసరమైన వారు అదనంగా చెల్లించే పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంది. దరఖాస్తు రుసుం, లైసెన్స్ ఫీజులు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సరిహద్దు జిల్లాలపై ప్రత్యేక దృష్టి ఉమ్మడి పాలమూరు సరిహద్దు జిల్లాలో మద్యం లైసెన్స్‌లు చేజిక్కించుకునేందుకు ఈసారి కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వ్యాపారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఆ రాష్ట్రంలో మద్యం దుకాణాల కుదింపు, వేలం కాకుండా ప్రభుత్వమే సిబ్బందిని నియమించి ప్రభుత్వ కనుసన్నల్లో మద్యం విక్రయాలు జరుపనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు జిల్లాలపై పక్క రాష్ట్ర వ్యాపారులు దృష్టిపెట్టారు. రెండేళ్లలో రూ.2645.02 కోట్ల అమ్మకాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 164 మద్యం దుకాణాల నుంచి రెండేళ్లలో రూ.2645.2 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మహబూబ్‌నగర్ చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగిన దాఖలాలు లేవు. ఈ సీజన్లో ఎన్నికలు కలిసి రావడం కూడా విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ, పార్లమెంట్, చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో మద్యం వ్యాపారులతోపాటు ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. గతంలో దరఖాస్తు విధానం రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో 164 లైసెన్స్‌లను దక్కించుకునేందుకు 3,740 మంది పోటీ పడ్డారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు చెల్లించారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ అని తెలిసినప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. 2017– 18 నూతన మద్యం పాలసీలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 164 మద్యం దుకాణాలకు 3,740 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌లో 66 దుకాణాలకు 1,579 దరఖాస్తులు, నాగర్‌కర్నూల్‌లో 45 దుకాణాలకు వెయ్యి, వనపర్తిలో 29 దుకాణాలకు 709, గద్వాల జిల్లాలో 24 దుకాణాలకు 452 టెండర్లు పడ్డాయి. ఈ దరఖాస్తులను దుకాణాల వారీగా విభజించి లాటరీ పద్ధతిలో నూతన దుకాణాలను ఎంపిక చేశారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీ, మండల కేంద్రానికి సంబంధించి గతంలో రూ.39.50 లక్షలు ఉంటే దానిని రూ.40.80 లక్షలుగా ఉన్న రెండు స్లాబులను కలిపేసి రూ.45 లక్షలతో ఒక స్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు రూ.50 లక్షలు, రూ.60 లక్షల స్లాబులు ఉండగా.. ఆ రెండింటిని కలిపి రూ.55 లక్షలతో ఒకే స్లాబ్ చేశారు. 3 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో రూ.81.6 లక్షలు ఉండగా.. తాజా విధానంలో పర్మిట్ రూంతో కలిపి రూ.85 లక్షలకు పెంచారు. అయితే ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ విధానంలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న 164 దుకాణాలను కొనసాగిస్తారా..? మరేమైనా మార్పులు చేస్తారా.. అనేది చూడాల్సి ఉంది. ఆదేశాలు రావాలి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 164 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 30తో గడువు ముగుస్తోంది. నూతన మద్యం పాలసీ విధానంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. త్వరలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న దుకాణాల కంటే అదనంగా దుకాణాల సంఖ్య పెంచడానికి పాలసీ విధానం అమల్లోకి రావాలి. – జయసేనారెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీ -
‘కిక్కి’రిసింది
అనంతపురం సెంట్రల్ : మద్యం టెండర్లకు ఔత్సాహికులు పోటెత్తారు. మహిళలు సైతం భారీసంఖ్యలో తరలివచ్చారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి శుక్రవారం వేలాది మంది రావడంతో అనంతపురం గుత్తిరోడ్డులోని విద్యుత్ కళాభారతి ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. జిల్లాలో 246 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. 6,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామోహిద్దీన్ సమక్షంలో లాటరీల ద్వారా దుకాణాలను కేటాయించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. అనంతపురం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని షాపులకు వేర్వేరుగా ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వందలాది మంది మహిళలు కూడా మద్యం దుకాణాల కోసం పోటీపడడం గమనార్హం. కొందరు చంటి బిడ్డలతో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి టెండర్లలో పాల్గొన్నారు. టెండర్ల సందర్భంగా ఎలాంటి గొడవలూ జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనుసూయదేవి, సూపరింటెండెంట్లు అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రణవి తదితరులు పాల్గొన్నారు. -
టెండర్ల కిక్కు
– కిక్కిరిసిన సూపరింటెండెంట్ కార్యాలయం – నేడు విద్యుత్ కళాభారతిలో లాటరీ ద్వారా టెండర్ల ఖరారు – అమల్లో 144 సెక్షన్ అనంతపురం సెంట్రల్ : మద్యం షాపుల కోసం టెండర్‌దారులు ఎగబడ్డారు. దరఖాస్తు చేసుకోవడానికి గురువారం చివరిరోజు కావడంతో విద్యుత్‌నగర్ సర్కిల్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం కిటకిటలాడింది. వేలాది మంది టెండర్‌దారులు వచ్చి దరఖాస్తులను సరిచూసుకున్నారు. జిల్లాలో 246 మద్యం దుకాణాలకు రెండేళ్లకు సంబంధించి టెండర్ ఆహ్వానించిన విషయం విదితమే. గురువారం రాత్రి‡ 8 గంటల వరకూ ఆన్లైన్ ద్వారా టెండర్లు స్వీకరణ, వెరిఫికేషన్‌కు గడువు విధించారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టభద్రత కల్పించారు. గురు, శుక్రవారాల్లో 144 సెక్షన్లో అమల్లో ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 246 షాపులకు 6,962 మంది దరఖాస్తు తొలి రెండు రోజులు పెద్దగా ఆసక్తి చూపని టెండర్‌దారులు చివరి రెండు రోజులు అనూహ్యరీతిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు రుసుం కింద గురువారం నాటికి రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 246 షాపులకు ఆన్లైన్ ద్వారా టెండర్ దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికోసం 6,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ప్రతి మద్యం షాపునకు దరఖాస్తులు వచ్చాయి. గురువారం రాత్రి 9 గంటల వరకూ 5,650 మంది వెరిఫికేషన్ కూడా చేయించుకున్నారు. మిగిలిన వారికి రాత్రి 12 గంటల వరకూ గడువు విధించారు. ఆలోగా వెరిఫికేషన్ చేయించుకోని వారి దరఖాస్తులను రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. నేడు లాటరీ మద్యం దుకాణాలకు వచ్చిన టెండర్లను శుక్రవారం ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. . గుత్తిరోడ్డులోని విద్యుత్ కళాభారతి ఫంక్షన్ హాల్లో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి లాటరీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తదితర ఉన్నతాధికారుల సమక్షంలో టెండర్ ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.