వేలం రాబోతోంది..! | Liquor Stores Auction Soon In Mahabubnagar | Sakshi
Sakshi News home page

వేలం రాబోతోంది..!

Published Fri, Aug 23 2019 10:20 AM | Last Updated on Fri, Aug 23 2019 10:23 AM

Liquor Stores Auction Soon In Mahabubnagar - Sakshi

మద్యం దుకాణాలకు టెండర్లు వేస్తున్న వ్యాపారులు (ఫైల్‌)

సాక్షి, మహబూబ్‌నగర్‌ : మద్యం దుకాణాల వేలానికి గడువు సమీపిస్తుండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సందడి నెలకొంది. నూతన మద్యం పాలసీలో భారీ మార్పులు జరగబోతున్నాయని ప్రచారం సాగినా శాఖాపరంగా ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు లేవు. ఈ విధానంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న అనుమతి గదులను తొలగించే అంశాన్ని ఉన్నత స్థాయి పరిశీలనలో ఉన్నప్పటికీ ఆ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదు. 2017కు ముందు లైసెన్స్‌ ఫీజుకు అదనంగా అనుమతి గదికి రూ.లక్ష తీసుకునే విధానం ఉండగా ఇప్పుడు లైసెన్స్‌ ఫీజులోనే కలిపారు. కొత్త విధానంలో అనుమతి గది లేకుండా చేయాలని, అవసరమైన వారు అదనంగా చెల్లించే పద్ధతిని అమలు చేసే అవకాశం ఉంది. దరఖాస్తు రుసుం, లైసెన్స్‌ ఫీజులు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

సరిహద్దు జిల్లాలపై ప్రత్యేక దృష్టి 
ఉమ్మడి పాలమూరు సరిహద్దు జిల్లాలో మద్యం లైసెన్స్‌లు చేజిక్కించుకునేందుకు ఈసారి కర్నూలు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వ్యాపారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఆ రాష్ట్రంలో మద్యం దుకాణాల కుదింపు, వేలం కాకుండా ప్రభుత్వమే సిబ్బందిని నియమించి ప్రభుత్వ కనుసన్నల్లో మద్యం విక్రయాలు జరుపనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని సరిహద్దు జిల్లాలపై పక్క రాష్ట్ర వ్యాపారులు దృష్టిపెట్టారు.

రెండేళ్లలో రూ.2645.02 కోట్ల అమ్మకాలు 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 164 మద్యం దుకాణాల నుంచి రెండేళ్లలో రూ.2645.2 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మహబూబ్‌నగర్‌ చరిత్రలో ఎప్పుడూ ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగిన దాఖలాలు లేవు. ఈ సీజన్‌లో ఎన్నికలు కలిసి రావడం కూడా విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముందుగా అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పంచాయతీ, పార్లమెంట్, చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో మద్యం వ్యాపారులతోపాటు ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. 

గతంలో దరఖాస్తు విధానం
రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో 164 లైసెన్స్‌లను దక్కించుకునేందుకు 3,740 మంది పోటీ పడ్డారు. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష ఫీజు చెల్లించారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ అని తెలిసినప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. 2017– 18 నూతన మద్యం పాలసీలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 164 మద్యం దుకాణాలకు 3,740 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌లో 66 దుకాణాలకు 1,579 దరఖాస్తులు, నాగర్‌కర్నూల్‌లో 45 దుకాణాలకు వెయ్యి, వనపర్తిలో 29 దుకాణాలకు 709, గద్వాల జిల్లాలో 24 దుకాణాలకు 452 టెండర్లు పడ్డాయి. ఈ దరఖాస్తులను దుకాణాల వారీగా విభజించి లాటరీ పద్ధతిలో నూతన దుకాణాలను ఎంపిక చేశారు.

అయితే మేజర్‌ గ్రామ పంచాయతీ, మండల కేంద్రానికి సంబంధించి గతంలో రూ.39.50 లక్షలు ఉంటే దానిని రూ.40.80 లక్షలుగా ఉన్న రెండు స్లాబులను కలిపేసి రూ.45 లక్షలతో ఒక స్లాబు చేశారు. గతంలో 2 లక్షల నుంచి 3 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు రూ.50 లక్షలు, రూ.60 లక్షల స్లాబులు ఉండగా.. ఆ రెండింటిని కలిపి రూ.55 లక్షలతో ఒకే స్లాబ్‌ చేశారు. 3 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు గతంలో రూ.81.6 లక్షలు ఉండగా.. తాజా విధానంలో పర్మిట్‌ రూంతో కలిపి రూ.85 లక్షలకు పెంచారు. అయితే ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ విధానంలో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న 164 దుకాణాలను కొనసాగిస్తారా..? మరేమైనా మార్పులు చేస్తారా.. అనేది చూడాల్సి ఉంది.

ఆదేశాలు రావాలి 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 164 మద్యం దుకాణాలకు సెప్టెంబర్‌ 30తో గడువు ముగుస్తోంది. నూతన మద్యం పాలసీ విధానంపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉంది. దీనిపై ఉన్నత స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. త్వరలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న దుకాణాల కంటే అదనంగా దుకాణాల సంఖ్య పెంచడానికి పాలసీ విధానం అమల్లోకి రావాలి. 
– జయసేనారెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement