
పల్టీ కొట్టిన ఇన్నోవా, పక్కన స్కూటీ
జనగామ: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం.. ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా, మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలో మాధవరెడ్డితోపాటు ఆయన పీఏ, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యుడు మాధవరెడ్డి తన ఇన్నోవా వాహనం లో హైదరాబాద్ బయలుదేరారు.
జనగామ జిల్లా కేంద్రం బైపాస్ లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ముందు వెళుతున్న స్కూటీని ఆయన వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళుతున్న మామిడాల రాకేశ్ ఎగిరి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇన్నోవా సైతం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ముందు సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్యేతోపాటు డ్రైవర్ రంజిత్‌కుమార్, వెనక సీట్లో ఉన్న పీఏ శ్రీపతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి మరో వాహనంలో మాధవరెడ్డి, డ్రైవర్, పీఏను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీసీపీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి సీఐ మల్లేశ్, ఎస్సై రాజేశ్ నాయక్ సంఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. రాకేశ్ సోద రుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment