donthi madhava reddy
-
స్కూటీని ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే వాహనం
జనగామ: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న వాహనం.. ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు కాగా, మాజీ ఎమ్మెల్యేకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలో మాధవరెడ్డితోపాటు ఆయన పీఏ, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యుడు మాధవరెడ్డి తన ఇన్నోవా వాహనం లో హైదరాబాద్ బయలుదేరారు. జనగామ జిల్లా కేంద్రం బైపాస్ లోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ముందు వెళుతున్న స్కూటీని ఆయన వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళుతున్న మామిడాల రాకేశ్ ఎగిరి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇన్నోవా సైతం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో ముందు సీట్లో కూర్చున్న మాజీ ఎమ్మెల్యేతోపాటు డ్రైవర్ రంజిత్‌కుమార్, వెనక సీట్లో ఉన్న పీఏ శ్రీపతి స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి మరో వాహనంలో మాధవరెడ్డి, డ్రైవర్, పీఏను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీసీపీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి సీఐ మల్లేశ్, ఎస్సై రాజేశ్ నాయక్ సంఘటన స్థలం చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షించారు. రాకేశ్ సోద రుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాంగ్రెస్ కార్యాలయంలో తనిఖీలు : మండిపడ్డ ఎమ్మెల్యే
సాక్షి, వరంగల్ రూరల్ : ఎటువంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో తనిఖీలు చేయడం పట్ల కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం లేకుండా మా పార్టీ కార్యలయంలో తనిఖీలు జరిపే అధికారం అధికారులకు ఉంది. కానీ తనిఖీలు చేసే సందర్భంలో తహశీల్దార్, కమిషనర్, ఇంటి యాజిమాని లేదా పార్టీ కార్యాలయ బాధ్యునికైనా సమాచారం ఇవ్వడం కనీస ధర్మమన్నారు. నిబంధనలు పాటించకుండా మా పార్టీ కార్యాలయం తాళం పగలగొట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయించిన దుర్మార్గపు చర్యగా ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి సంఘటనలు తన రాజకీయ జీవితంలో ఎన్నడు చూడలేదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇకముందు కూడా అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎలక్షన్ కమిషన్ అధికారులకు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చూడాలంటూ అధికారులను కోరారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు.. చీరలు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ సంస్కృతి టీఆర్ఎస్ పార్టీదంటూ ఆయన ధ్వజమేత్తారు. -
కాంగ్రెస్‌లో చేరిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి
-
కాంగ్రెస్‌లో చేరిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి
న్యూఢిల్లీ : వరంగల్ జిల్లా నర్సంపేట స్వతంత్ర ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన మంగళవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా దొంతి మాధవరెడ్డి కలవనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. అయితే మాధవ రెడ్డి రాకను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే చక్రం తిప్పిన జానారెడ్డి దొంతి మాధవరెడ్డిని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావటంలో కీలక పాత్ర వహించారు. -
దొంతీ .. కరుణచూపు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన దొంతి మాధవరెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించుకునేందుకు సోమవారం ముఖ్య నేతలు చర్చలు జరిపారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే దొంతి సహకారం అవసరం కావడంతో జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఇనుగాల వెంకటరాంరెడ్డి, పొదెం వీరయ్య కలిసి దొంతితో సమావేశమై హరిత హోటల్లో చర్చలు జరిపారు. 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 24, టీఆర్ఎస్కు 18, టీడీపీకి 6, బీజేపీకి 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ అవకాశం ఉన్న ఏ ఒక్క జెడ్పీ పీఠాన్ని కూడా వదలకూడదనే పట్టుదలతో ఉండడంతో జిల్లాలో దొంతి కరుణ తప్పనిసరి అయింది. మాధవరెడ్డి ఇంటికి గండ్ర తప్ప ముఖ్య నాయకులందరూ వెళ్లి మొదట చర్చలు జరిపిన తర్వాత హరిత హోటల్‌కు వేదిక మార్చారు. చర్చల్లో వచ్చిన అంశాలను కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి నుంచి ప్లాన్ ప్రకారం గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులను మాధవరెడ్డి 10మందిని తన వద్ద ఉంచుకున్నారు. జెడ్పీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసం మాధవరెడ్డి సహకారం అవసరమైంది. దీనికి ప్రతిఫలంగా మాధవరెడ్డిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దొంతి జెడ్పీ పీఠం తన నియోజకవర్గానికే కావాలని, జిల్లా అధ్యక్ష పదవి కూడా తనకే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ ప్రతిపాదనను దుగ్యాల శ్రీనివాసరావు వ్యతిరేకించారు. మొదట తన నియోజకవర్గానికి జెడ్పీ పీఠం కావాలని డిమాండ్ చేయడంతో పాటు దొంతికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. అయితే మాధవరెడ్డి మెట్టుదిగకపోవడంతో చివరకు జెడ్పీ పీఠం ఆయన నియోజకవర్గానికే కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చారు. కానీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు మాత్రం ప్రస్తుత ఇన్చార్జి నాయిని, దుగ్యాల, గండ్ర అంగీకరించకపోవడంతో దొంతి కొంత సానుకూలత చూపారు. టీఆర్ఎస్ పార్టీకి జెడ్పీ పీఠం దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు దొంతిని పార్టీలోకి తీసుకుని జెడ్పీ చైర్మన్ పదవి అప్పగించేందుకు సానుకూలత చూపారు. అయితే మంగళవారం మరో దఫా జరిగే చర్చల్లో స్పష్టత రానుంది. నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న దొంతి తనపట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన దొంతికి మళ్లీ అదే పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. -
సొంతంగా దిగి...సత్తా చాటారు!
గణనీయంగా ప్రభావం చూపిన స్వతంత్రులు సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో స్వతంత్రులు గణనీయ ప్రభావాన్ని చూపారు. ఒక స్థానంలో గెలవడంతో పాటు పలు స్థానాల్లో రెండవస్థానంలో నిలిచారు. అనేక చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమికి కారకుల య్యారు. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ స్థానంలో స్వంత్రుడిగా పోటీచేసిన కాంగ్రెస్ రెబల్ దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిపైనే గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంత్రులుగా రంగంలోకి దిగి రెండవ స్థానాన్ని దక్కించుకున్న వారిలో జువ్వాడి నర్సింగరావు (కోరుట్ల), చందర్ (రామగుండం), సంకినేని వెంకటేశ్వరరావు (సూర్యాపేట), భూపాల్‌రెడ్డి (నల్లగొండ), స్రవంతి (మునుగోడు), జిట్టా బాలకృష్ణారెడ్డి (భువనగిరి) ఉన్నారు. కాంగ్రెస్ టికెట్లు దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలో నిలిచి నిర్మల్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ - కాగజ్‌నగర్ నుంచి కోణప్ప గెలిచి ప్రధానపార్టీలకు షాక్ ఇచ్చారు. -
కాంగ్రెస్‌ను వీడినా బహిష్కరణ వేటు!
వనమా, దొంతి, మరో 10 మందిపై ఆరేళ్ల వేటు సాక్షి, హైదరాబాద్: పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసినా కూడా.. వారిని బహిష్కరిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చిత్రమైన నిర్ణయం తీసుకుంది. పార్టీకి రాజీనామా చేసిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డిలను ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటు మరో 10 మందిపైనా బహిష్కరణ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. వాస్తవానికి వనమా, మాధవరెడ్డి 10 రోజుల కిందే కాంగ్రెస్ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు.ప్రస్తుతం వనమా వైఎస్సార్సీపీ కొత్తగూడెం అభ్యర్థిగా, మాధవరెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. అయినప్పటికీ ఇరువురు నేతలను బహిష్కరించడం పట్ల టీ పీసీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వద్ద శనివారం విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావించగా... ‘‘వాళ్లు పార్టీకి రాజీనామా చేసినట్లు మాకు తెలియదు. పత్రికల్లో మాత్రమే చూశాను. ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై చర్యలు తీసుకున్నాం’’అని చెప్పడం గమనార్హం. వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా.. ఇంకా బహిష్కరించడం దేనికని ప్రశ్నించగా... ‘అదంతా మాకు తెలియదు’అని పొన్నాల పేర్కొన్నారు. కాగా, బహిష్కరణకు గురైన మిగతా నేతలు.. వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్ (ఖమ్మం), రామ సహాయం నరేష్‌రెడ్డి, భూక్యా ప్రసాద్ (వరంగల్), వై.బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఎం.కృష్ణ, ఎం.వెంకటరెడ్డి, కె.గురునాథ్‌రెడ్డి (రంగారెడ్డి), ఎం.సోమేశ్వరరెడ్డి, ఎం.గాలిరెడ్డి(మెదక్) ఈ జాబితాలో ఉన్నారు. -
కత్తి వెంకటస్వామి బీఫారంపై ఫిర్యాదు
వరంగల్:జిల్లాలోని నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ అంశం పార్టీలో అగ్గి రాజేస్తోంది. గురువారం జేఏసీ నేత కత్తి వెంకటస్వామి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పై టికెట్ ఆశించి భంగపడ్డ డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి ఫిర్యాదు చేశారు. కత్తి దాఖలు చేసిన నామినేషన్ లో కొట్టి వేతలున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన టి.కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకున్న పలు మార్పులు తలనొప్పిగా మారాయి. కొంతమంది సిట్టింగ్ లను దూరంగా పెట్టి, పార్టీలో అప్పుడే చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వాదులు నిరసన గళం వినిపిస్తున్నారు. మాల్కాజిగిరి లోక్ సభ పరిధిలోని మల్కాజిగిరి, కంటోన్మెంట్ స్థానాల్లో తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్.. వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ పై కూడా వెనక్కి తగ్గింది. ముందుగా మాధవరెడ్డిని పేరును జాబితాలో చేర్చిన కాంగ్రెస్ పెద్దలు అనంతరం కత్తి వెంకటస్వామికి కేటాయించారు. దీంతో ఆ జిల్లా కాంగ్రెస్ లో నిరసన గళం వినిపిస్తోంది. ఒక్కసారి ఇచ్చిన టికెట్ ను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ కేంద్రమంత్రి బలరాం నాయక్ సైతం ఖండించిన విషయం తెలిసిందే. ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి టికెట్ నిరాకరించి..పార్టీతో సంబంధం లేని జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి ఇవ్వడం ఎంతమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీ విధానాన్ని తప్పుబడుతున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం అయ్యే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్ కు తెలిపిన ఏమాత్రం ప్రయోజనం కనబడలేదు. -
దొంతికి షాక్
సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు కొత్త మలుపు తిరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనకు కేటాయించిన నర్సంపేట టికెట్‌ను తెలంగాణ అధ్యాపకుల జేఏసీ నాయకుడు కత్తి వెంకటస్వామికి ఇస్తూ... మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన జారీ చేసింది. చేతికి వచ్చిన టికెట్ ఒక్క రోజులోనే చేజారిపోవడం దొంతి మాధవరెడ్డిని విస్మయూనికి గురిచేసింది. టికెట్ విషయంలో పూర్తి ధీమాతో ఉన్న మాధవరెడ్డికి ఇలా జరగడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్షుడిని అవమానానికి గురిచేయడం కాంగ్రెస్ శ్రేణులకు సైతం అంతుచిక్కడంలేదు. కాంగ్రెస్ బలమైన నియోజకవర్గంగా ఉన్న స్థానంలో అభ్యర్థిని ప్రకటించి... ఆ తర్వాత మార్చడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పొన్నాలపై అనుమానాలు తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నా... ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇచ్చిన టికెట్‌ను వేరేవారికి కేటారుుంచడంపై దొంతి మాధవరెడ్డి తీవ్ర ఆవేదనతో ఉన్నారు. భవిష్యత్ నిర్ణయం ఏమిటనేది తేల్చలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమ నేతలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటే... దశాబ్దాలుగా నియోజకవర్గంతో సంబంధం లేని వారికి ఎలా ఇస్తారని ఆయన వర్గీయులు నిలదీస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికే ఇలా అన్యాయం చేస్తే ఎలా అని వాపోతున్నారు. టికెట్ ఖరారు చేసి వెనక్కి తీసుకోవడం ఎక్కడా జరగలేదని, సీనియర్ నేత అయిన దొంతికి ఇలా జరగడం దారుణమని అంటున్నారు. దొంతి మాధవరెడ్డికి భంగపాటు ఎదురుకావడం వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాత్ర ఉందనే అనుమానాన్ని ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ నేతలకు ముందుగా కేటారుుంచిన స్థానాలను మార్చి... నర్సంపేట ఇవ్వడానికి ఆయన ప్రతిపాదనలే కారణమని భావిస్తున్నారు. రగులుతున్న టికెట్ల చిచ్చు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు చిచ్చు రగులుతోంది. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరగడంపై కాంగ్రెస్ కార్యాలయం ఎదుటే పొన్నాల దిష్టిబొమ్మను దహనం చేశారు. టికెట్లను ఆశించి భంగపడిన వారు నిరసన స్వరాలను పెంచుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజారపు ప్రతాప్ పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌లోకి వచ్చిన జి.విజయరామారావుకు టికెట్ ఎలా ఇస్తారని ప్రతాప్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ మంగళవారం తన అనుచరులతో కాజీపేటలో సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అక్కడికి చేరుకున్నారు. ప్రతాప్‌ను బుజ్జగించేందుకు రాజయ్య చేసిన ప్రయత్నాలు ఆయనకే రివర్స్ అయ్యాయి. రాజయ్య గోబ్యాక్.. గోబ్యాక్ అని ప్రతాప్ వర్గీయులు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ జెండాలను, బ్యానర్లు, ఫ్లెక్సీలను దహనం చేశారు. దీంతో ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సీటును బీసీ వర్గాలకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బండా ప్రకాష్ బీసీ నేతలతో సమావేశమయ్యారు. తీవ్ర నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇదే స్థానాన్ని ఆశించిన జంగా రాఘవరెడ్డి, నాయిని నర్సింహారెడ్డిని. అభ్యర్థిత్వం దక్కిన ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం వేర్వేరుగా కలిశారు. తనకు సహకరించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది తెలియరాలేదు. జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఆగదు
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం, ప్రజల ఆకాంక్షను గుర్తించి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలే రని ఆయన స్పష్టం చేశారు. డీసీసీ భవన్లో ఆది వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలని సోనియాగాంధీ ఎప్పుడు ఆలోచించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రకు ఎలాంటి నష్టం వాటిల్లదని వివరించారు. పీసీసీ కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కానుగంటి శేఖర్, శ్రీనివాసచారి, సమ్మిరెడ్డి, తుల రమేష్, కామిడి సతీష్, సీత శ్యాం, జాఫర్ పాల్గొన్నారు.