సాక్షి ప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు కొత్త మలుపు తిరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనకు కేటాయించిన నర్సంపేట టికెట్‌ను తెలంగాణ అధ్యాపకుల జేఏసీ నాయకుడు కత్తి వెంకటస్వామికి ఇస్తూ... మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన జారీ చేసింది. చేతికి వచ్చిన టికెట్ ఒక్క రోజులోనే చేజారిపోవడం దొంతి మాధవరెడ్డిని విస్మయూనికి గురిచేసింది.
టికెట్ విషయంలో పూర్తి ధీమాతో ఉన్న మాధవరెడ్డికి ఇలా జరగడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్షుడిని అవమానానికి గురిచేయడం కాంగ్రెస్ శ్రేణులకు సైతం అంతుచిక్కడంలేదు. కాంగ్రెస్ బలమైన నియోజకవర్గంగా ఉన్న స్థానంలో అభ్యర్థిని ప్రకటించి... ఆ తర్వాత మార్చడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పొన్నాలపై అనుమానాలు
తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నా... ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇచ్చిన టికెట్‌ను వేరేవారికి కేటారుుంచడంపై దొంతి మాధవరెడ్డి తీవ్ర ఆవేదనతో ఉన్నారు. భవిష్యత్ నిర్ణయం ఏమిటనేది తేల్చలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమ నేతలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటే... దశాబ్దాలుగా నియోజకవర్గంతో సంబంధం లేని వారికి ఎలా ఇస్తారని ఆయన వర్గీయులు నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికే ఇలా అన్యాయం చేస్తే ఎలా అని వాపోతున్నారు. టికెట్ ఖరారు చేసి వెనక్కి తీసుకోవడం ఎక్కడా జరగలేదని, సీనియర్ నేత అయిన దొంతికి ఇలా జరగడం దారుణమని అంటున్నారు. దొంతి మాధవరెడ్డికి భంగపాటు ఎదురుకావడం వెనుక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాత్ర ఉందనే అనుమానాన్ని ఆయన వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ నేతలకు ముందుగా కేటారుుంచిన స్థానాలను మార్చి... నర్సంపేట ఇవ్వడానికి ఆయన ప్రతిపాదనలే కారణమని భావిస్తున్నారు.
రగులుతున్న టికెట్ల చిచ్చు
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు చిచ్చు రగులుతోంది. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరగడంపై కాంగ్రెస్ కార్యాలయం ఎదుటే పొన్నాల దిష్టిబొమ్మను దహనం చేశారు. టికెట్లను ఆశించి భంగపడిన వారు నిరసన స్వరాలను పెంచుతున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజారపు ప్రతాప్ పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌లోకి వచ్చిన జి.విజయరామారావుకు టికెట్ ఎలా ఇస్తారని ప్రతాప్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్ మంగళవారం తన అనుచరులతో కాజీపేటలో సమావేశం నిర్వహించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అక్కడికి చేరుకున్నారు. ప్రతాప్‌ను బుజ్జగించేందుకు రాజయ్య చేసిన ప్రయత్నాలు ఆయనకే రివర్స్ అయ్యాయి. రాజయ్య గోబ్యాక్.. గోబ్యాక్ అని ప్రతాప్ వర్గీయులు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ జెండాలను, బ్యానర్లు, ఫ్లెక్సీలను దహనం చేశారు. దీంతో ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సీటును బీసీ వర్గాలకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బండా ప్రకాష్ బీసీ నేతలతో సమావేశమయ్యారు. తీవ్ర నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇదే స్థానాన్ని ఆశించిన జంగా రాఘవరెడ్డి, నాయిని నర్సింహారెడ్డిని. అభ్యర్థిత్వం దక్కిన ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం వేర్వేరుగా కలిశారు. తనకు సహకరించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది తెలియరాలేదు. జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
దొంతికి షాక్
Published Wed, Apr 9 2014 3:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement