మేం చెప్పినట్లే ఫలితాలు: పొన్నాల
మేం చెప్పినట్లే ఫలితాలు: పొన్నాల
Published Tue, May 13 2014 1:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, హైదరాబాద్: ఎవరెన్ని మాటలు చెప్పినా.. ఎన్ని రకాలుగా విశ్లేషణలు చేసినా తాము చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని, కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం పొన్నాల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పునాదులు గట్టిగా ఉన్నాయని, ప్రజల ఆదరాభిమానాలు తమవైపే ఉన్నాయనడానికి మున్సిపల్ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతోపాటు పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు.
ఎవరూ జారిపోకుండా చూడండి: పొన్నాల సోమవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని సమీక్షించారు. మాజీ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు టీపీసీసీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన స్థానాల తోపాటు పెద్ద పార్టీగా అవతరించిన మున్సిపాలిటీల్లోనూ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మిత్రపక్షాలైన మజ్లిస్, సీపీఐ సహకారంతోపాటు స్వతంత్ర అభ్యర్థులను పార్టీవైపు తిప్పుకునేందుకు చర్యలు తీసుకోవాలని పొన్నాల సూచించారు. కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులెవరూ పార్టీ నుంచి జారిపోకుండా చూడాలని జిల్లా నేతలను ఆదేశించారు. ఈ విషయంలో ప్రధాన బాధ్యతను మాజీ మంత్రులతోపాటు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులు, మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న నేతలకు అప్పగించినట్టు సమాచారం.
Advertisement