ఉపాధిపై వేటు వేస్తారా?: టీపీసీసీ చీఫ్ పొన్నాల
ఉపాధిపై వేటు వేస్తారా?: టీపీసీసీ చీఫ్ పొన్నాల
Published Sat, Nov 8 2014 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించక పోగా, ఉన్న ఉపాధి అవకాశాలను కూడా దెబ్బతీస్తోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తమ ఉపాధిపై ప్రభుత్వం వేటు వేసిందని తెలంగాణ ప్రాంత మీసేవ నిర్వాహకులు కొందరు శుక్రవారం పొన్నాల లక్ష్మయ్యను గాంధీభవన్‌లో కలిశారు. వీరికి అండగా ఉండడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పొన్నాల హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫాస్ట్’ పథకానికి అవసరమైన కుల, జనన, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇప్పటి దాకా ‘మీసేవ’ కేంద్రాల ద్వారా ఇచ్చారని, ఇపుడవి చెల్లవని, రెవిన్యూ అధికారులు స్వయంగా జారీ చేస్తుండడంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు.
‘కమలాపూర్’ రేయాన్స్ ఫ్యాక్టరీకి అండగా నిలవాలి: 2 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న వరంగల్ జిల్లా కమలాపూర్‌లోని రేయాన్స్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం అండగా నిలవాలని పొన్నాల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రేయాన్స్ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు, కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫ్యాక్టరీకి చెందిన వివిధ కార్మిక సంఘాల నేతలు శుక్రవారం గాంధీభవన్‌లో పొన్నాలను కలిసి తమ సమస్యలను వివరించారు.
Advertisement
Advertisement