వంకర పోతున్న చేతి వేళ్లు
జనగామ : యాంత్రిక జీవనంలో ప్రజలు అనేక వ్యాధులబారిన పడుతున్నారు. వైద్యులకు కూడా అంతుపట్టని రోగాలు వస్తున్నాయి. కొంతమంది ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ నిత్యం నరకం చూస్తున్నారు. ఇందులో ప్రధానమైన (రుమటాయిడ్ ఆర్థరైటిస్) వ్యాధి కీళ్ల నొప్పులు. రాత్రుళ్లు నిద్రపట్టక పోవడం, ఉదయం లేవగానే కీళ్లు పట్టేసినట్లుగా ఉండ డం, కనీసం కదల్లేక పోవడం, ఎక్కువ దూరం నడిస్తే మోకాళ్ల నొప్పి.. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నాయా.. అయితే రుమటాయిడ్ ఆర్థరైటీస్‌తో బాధపడుతున్నట్లే.
ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని వైద్యులు చెబు తుండడం గమనార్హం. జనగామ జిల్లాలో సుమారు 2,500 మందికి పైగా ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడుతున్నారు. బాధితుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. 18 సంవత్సరాల లోపు వారిలోనూ వ్యాధిని గుర్తిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రాథమిక దశలో అప్రమత్తమైతే పెద్దగా ప్రమాదం లేదని.. నిర్లక్ష్యం చేస్తే పెనుముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జాప్యం వద్దు..
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు చికిత్సలో జాప్యం చేస్తే కళ్లు తడారిపోవడం, కంటి చూపు తగ్గిపోవడం, దుద్దర్లు రావడం, దగ్గు, ఆయాసంతో పాటు గుండె చుట్టూ నీరు చేరుతుందని వైద్యులు చెబుతున్నారు. నరాల పటుత్వం తగ్గిపోవడం, చేతి వేళ్లు, కాలి వేళ్లు నల్లగా మారుతాయి. మధుమేహం, రక్తపోటులాగే ఈ వ్యాధి ఉన్న వారికి గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిర్ధారణ..చికిత్స
కీళ్ల నొప్పులు వచ్చిన తొలి దశలో వైద్యులను సంప్రదిస్తే రుమటాయిడ్ ప్రాక్చర్, యాంటీ సీసీపీ అనే యాంటీ బాడీస్ రక్త పరీక్షలు చేసి, వ్యాధిని నిర్ధారిస్తారు. ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిలో ఏర్పడిన లోపాన్ని సరిదిద్దేందుకు మందులు ఇస్తారు. '
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు కారణాలు
జన్యుపరమైన లోపాలు, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, వైరల్ ఇన్‌ఫెక్షన్, పొగతాగం వంటి కారణలతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి వస్తుంది.
వ్యాధి లక్షణాలు..
- కీళ్ల వద్ద నొప్పి, వాపు రావడం
- ఉదయం నిద్ర లేవగానే 15 నిమిషాల వరకు కీళ్లు పట్టేయడం
- రాత్రిపూట కీళ్ల నొప్పులతో నిద్రపట్టక పోవడం
- కీళ్లలో గుజ్జు తగ్గిపోయి వంకర పోవడం
- ఎముకలు పటుత్వం తగ్గి చిన్నపాటి దెబ్బలకే ఫ్యాక్చర్ కావడం
Comments
Please login to add a commentAdd a comment