
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పాం సాగుకు నోటిఫై చేసిన ఏరియాలో 1.3 లక్షల ఎకరాలు ఆయిల్ ఫెడ్‌కు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 20 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 20 వేలు, నారాయణపేట్ జిల్లాలో 10 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకుంటామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు 24,500 ఎకరాలు (2.97 శాతం) మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం విదితమే.
దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు మరికొంత కేటాయించాలని వ్యవసాయశాఖకు విన్నవించారు. ఇదిలావుంటే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన దాంట్లో కొన్ని ప్రముఖ సంస్థలే ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఆయిల్‌ఫెడ్ కోరినట్లుగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొంతమేరకు ఇచ్చారు. కొన్ని కంపెనీలు రాని ఏరియాలను ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న సంస్థలకు ఇస్తామని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment