Mahaboobnagar district
-
కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్‌కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నాశనం చేశారన్నారు. ఇదీ చదవండి: వివేక్‌తో రేవంత్‌రెడ్డి భేటీ -
2 రోజులు.. రూ. 21,566 కోట్ల ప్రాజెక్టులు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.21,566 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. వచ్చే నెల 1న మహబూబ్‌నగర్ జిల్లాలో, 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. ఆయా రోజుల్లో అధికారిక కార్యక్రమాల అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 9 ఏళ్లలో 9 లక్షల కోట్లకుపైగా ఇచ్చాం కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో రూ.9 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘‘మేం అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. రూ.26 వేల కోట్లతో రీజనల్ రింగు రోడ్డు నిర్మించేందుకు ముందుకొస్తే.. కేసీఆర్ సర్కారు ఇంతవరకు గజం భూమి కూడా సేకరించి ఇవ్వలేదు. ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తుంటే వాటికి హాజరుకాని కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదమని.. తొలి ఐదేళ్లు ఒక్క మహిళా మంత్రి లేకుండా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నాయని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే చర్చకు రావాలి.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎన్నడూ చెప్పలేదని కిషన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం పథకం ప్రకారం కుట్రలు పన్నుతోందని, తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఉండవని స్పష్టంగా చెప్పినా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు రావాలి. గత 9 ఏళ్లలో తెలంగాణకోసం కేంద్రం ఏం చేసిందో నేను చెబుతా.. రాష్ట్రం ఏ చేసిందో ఆయన్ను చెప్పమనండి..’’ అని కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనే కార్యక్రమాలు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.1.10 లక్షల కోట్ల ఖర్చు దేశంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధాని మోదీ ‘హీరా’ మోడల్ (హెచ్– హైవేస్, ఐ– ఇన్ఫోవేస్, ఆర్– రైల్వేస్, ఏ– ఎయిర్వేస్ అభివృద్ధి)తో ముందుకెళ్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన జాతీయ రహదారులను ఇప్పటికే కేటాయించామని చెప్పారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణం విషయంలోనూ కేంద్రం చిత్తశుద్ధితో ఉందని.. దేశవ్యాప్తంగా 2014కు ముందు వినియోగంలో ఉన్న 75 విమానాశ్రయాల సంఖ్యను ఈ తొమ్మిదేళ్లలో 150కి పెంచిందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో రాష్ట్రంలో మాత్రం ఒక్కటి నిర్మాణం కాలేదన్నారు. ఎన్నికలు వస్తుండటంతో వరంగల్ విమానాశ్రయానికి భూసేకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏదో కంటితుడుపు ప్రకటన చేసిందని విమర్శించారు. ఎంఐఎం తాటాకు చప్పుళ్లకు భయపడం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నివాసంపై మజ్లిస్ కార్యకర్తలు దాడి చేయ డం సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, దాని మిత్రులు కలసి చేస్తున్న ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ప్రధాని పర్యటనకు భారీగా భద్రత: సీఎస్ వచ్చే నెల 1న ప్రధాని మోదీ పర్యటన ముందే ఖరారుకాగా, 3న పర్యటన మాత్రం శుక్రవారమే ఖరారైంది. ప్రధాని ఆరోజున మధ్యాహ్నం 2.55 గంటలకు సైనిక హెలికాప్టర్లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు నిజామాబాద్‌లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సైనిక హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సర్వం సిద్ధం ప్రధాని మోదీ పాలమూరు జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇక్కడి భూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్‌లో సిద్ధం చేస్తున్న సభా ప్రాంగణంలోనే అధికారిక కార్యక్రమాలతోపాటు బీజేపీ సభ జరగనున్నాయి. ఇందులో రెండు స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక స్టేజీ మీద నుంచి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదిక వద్దకు రానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓపెన్ టాప్ జీపును గుజరాత్ నుంచి తెప్పిస్తున్నారు. మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వందలాది మంది మహిళలతో ప్రధానికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి రెండు లక్షల మందికిపైగా జన సమీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పాలమూరు సభ నుంచే శంఖారావం పూరించనుందని నేతలు చెప్తున్నారు. ప్రధాని హోదాలో మోదీ రెండోసారి పాలమూరుకు వస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన ఇక్కడ నిర్వహించిన సభకు హాజరయ్యారు. 3న నిజామాబాద్ జిల్లా పర్యటనలో.. ►ప్రధాని మోదీ ఈ నెల 3న మధ్యాహ్నం 2.55 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని.. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ►రామగుండంలో ఎన్టీపీసీ రూ.6వేల కోట్లతో చేపట్టిన థర్మల్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను ప్రారంభిస్తారు. ►ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం–ఏబీహెచ్ఐఎం)లో భాగంగా రాష్ట్రంలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో రూ.516.5 కోట్లతో చేపట్టే 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన చేస్తారు. ►రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన ‘ధర్మాబాద్ (మహారాష్ట్ర)–మనోహరాబాద్, మహబూబ్‌నగర్– కర్నూల్’ రైల్వే లైన్ల విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్) ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. ►రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన మనోహరాబాద్–సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభిస్తారు. పాలమూరు పర్యటన ఇలా.. ►ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌కు చేరుకుని, సుమారు రూ.13,545 కోట్ల విలువచేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ►మునీరాబాద్–మహబూబ్‌నగర్ ప్రాజెక్టులో భాగంగా రూ.505 కోట్లతో నిర్మించిన ‘జక్లేర్–కృష్ణ’ కొత్త రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. దీనిద్వారా హైదరాబాద్–గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇక కృష్ణ స్టేషన్ నుంచి ‘కాచిగూడ –రాయచూర్– కాచిగూడ’ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైల్వే సర్వీసెస్‌ను ప్రారంభిస్తారు. ► జాతీయ రహదారులకు సంబంధించి రూ.6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్‌హెచ్ 365 బీబీలో భాగంగా రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట–ఖమ్మం 4 లేన్ల రహదారిని ప్రారంభిస్తారు. ► రూ.2,661 కోట్ల విలువైన హసన్ (కర్ణాటక)– చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. రూ.1,932 కోట్లతో చేపడుతున్న కృష్ణపట్నం (ఏపీ)– హైదరాబాద్ ‘మల్టి ప్రొడక్ట్ పైప్‌లైన్ (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్)’కు శంకుస్థాపన చేస్తారు. ►హెచ్‌సీయూలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్ భవనాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ? -
మహబూబ్ నగర్ జిల్లాలో మెగా డ్రోన్ షో ప్రదర్శన
-
Drone Show: మహబూబ్‌నగర్ ట్యాంక్‌బండ్‌పై ఆకట్టుకున్న మెగా లేజర్ షో (ఫోటోలు)
-
Isha Gramotsavam: మహబూబ్‌నగర్‌లో ‘15వ ఈషా గ్రామోత్సవం’ (ఫొటోలు)
-
రైలు కిందపడి చిన్నారి మృతి
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో బంధువుల దగ్గరికి వెళ్తుండగా రైలు దిగుతున్న సమయంలో కాలు జారి చిన్నారి రైలుకింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకట్‌రెడ్డిపల్లికి చెందిన పీ చంద్రారెడ్డికి ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురు శ్రీలక్ష్మి (3) మహమ్మదాబాద్ ఎంజల్వ్యాలీ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని చంద్రారెడ్డి అన్న ఇంటికి భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బుద్వేల్‌కు రైల్లో వెళ్లారు. రైలు దిగుతున్న సమయంలో చిన్నారి శ్రీలక్ష్మి ప్రమాదవశాత్తు జారి ట్రైన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కూతురు మృతి చెందడంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
బలాన్‌పల్లిలో భాస్కర క్షేత్రం
నాగర్‌కర్నూల్: సూర్యుడి పేరిట దేవాలయాలు ఉండటం అత్యంత అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన సూర్యనారాయణుడి ఆలయం నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం బలాన్‌పల్లిలో కొలువుదీరడం విశేషంగా నిలుస్తోంది. సూర్యనారాయణుడు ఇక్కడ స్వయంభుగా కొలువుదీరడం అరుదైన విషయమని చరిత్రకారులు చెబుతున్నారు. ఏడు గుర్రాలు వాహనంగా, ఛాయాదేవీ, సంధ్యాదేవి సమేతంగా సూర్యభగవానుడు స్వయంభుగా వెలసిన విగ్రహం రాష్ట్రంలో ఎక్కడా కన్పించదని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు గ్రామస్తులు ఈ ఆలయాన్ని చెన్నకేశవ ఆలయంగా భావించి పూజలు నిర్వహిస్తుండగా, మూడేళ్ల కిందటే దీనిని సూర్యనారాయణుడి ఆలయంగా గుర్తించడం గమనార్హం. ఇలాంటి పురాతన ఆలయాన్ని సంరక్షించి ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేయాలన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ► వెలుగులోకి రాని ఆలయం.. రాష్ట్రంలోనే అరుదైన సూర్యనారాయణుని ఆలయం ఇన్నాళ్లుగా వెలుగులోకి రాకుండాపోయింది. ఏళ్ల పాటు ఈ ఆలయాన్ని చెన్నకేశవస్వామి ఆలయంగా భావించిన స్థానికులు ఆ పేరుతోనే పిలుచుకున్నారు. ఇక్కడి సమీపంలోని చెరువును సైతం చెన్నకేశవ చెరువుగా గ్రామస్తులు పిలుస్తున్నారు. అయితే నాలుగేళ్ల కిందట గ్రామానికి వచ్చిన పరిశుద్దానంద స్వామి ఈ విగ్రహాన్ని పరిశీలించి సూర్యనారాయణుడిగా తేల్చారు. అప్పటి నుంచి గ్రామస్తుల సహకారంతో శిథిలమైన ఆలయ శిఖరాన్ని మళ్లీ నిర్మించారు. తమ చేనులో సూర్యనారాయణుడు కొలువుదీరడంతో ఆ భూమి యజమాని మాదాసు యాదయ్య సైతం ఎకరం భూమిని ఆలయ అభివృద్ధి కోసం కేటాయించారు. ఏటా రథసప్తమి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆదివారాల్లో మాత్రమే ఇక్కడి సూర్యనారాయణుడు పూజలందుకుంటున్నాడు. దేశవ్యాప్తంగా ఆరుచోట్ల మాత్రమే సూర్యుడి కోసం ఆలయాలు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఒడిశాలోని ప్రసిద్ధ కోణార్క్ దేవాలయం, జమ్ముకశ్మీర్‌లో మార్తండ సూర్యదేవాలయం, గుజరాత్లో మోఢేరా దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లో అరసవల్లి సూర్యనారాయణ ఆలయాలు మాత్రమే ఉన్నట్టు ప్రాచుర్యం పొందగా, రాష్ట్రంలో బలాన్పల్లిలోని సూర్యనారాయణుని ఆలయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం తిమ్మాపురంలో సూర్యనారాయణస్వామి ఆలయాన్ని నిర్మించగా, స్వయంభుగా కొలువైన సూర్యనారాయణ ఆలయాలు అరుదుగా కన్పిస్తాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంపై మరింత పరిశోధన జరిపి, అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నిరాదరణలో కాటమయ్య విగ్రహం సూర్యనారాయణస్వామి ఆలయానికి సమీపంలోని పంటచేళ్లలో కాటమయ్య విగ్రహంగా భావిస్తున్న అపురూప విగ్రహం నిరాదరణగా పడి ఉంది. ఎడమ చేతిలో కళ్లెం, కుడి చేతిలో కొడవలి, బొడ్డు సమీపంలో మరో కత్తి, గుర్రంపై దౌడు తీస్తున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం సమీపంలో విసిరేసినట్టుగా పాదాలు సైతం ఉన్నాయి. ప్రధానంగా యాదవులు, గొర్రెల కాపరులు కాటమయ్యను ఆరాధిస్తారని చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి చెబుతున్నారు. అయితే ఈ విగ్రహం రాణి రుద్రమదేవి రూపాన్ని పోలి ఉండటంతో స్థానికులు రుద్రమదేవిగా పిలుచుకుంటున్నారు. రాష్ట్రంలో అరుదైన ఆలయం.. బలాన్పల్లిలోని సూర్యనారాయణస్వామి విగ్రహం అత్యంత అరుదైనది. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి విగ్రహం కన్పించదు. ఏడు గుర్రాలు, ఛాయాదేవి, సంధ్యాదేవి సమేతంగా సూర్యనారాయణుడు కొలువై ఉన్నాడు. ఇలాంటి అపురూప విగ్రహాలు ప్రభుత్వం సంరక్షించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం స్పందించి వెంటనే సంరక్షణ చర్యలు తీసుకోవాలి. – రెడ్డి రత్నాకర్‌రెడ్డి, చారిత్రక పరిశోధకుడు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.. మా గ్రామంలో ఏళ్ల కాలం నుంచి ఈ ఆలయం ఉంది. మొదట చెన్నకేశవ స్వామిగా భావించగా, ఇటీవల సూర్యనారాయణస్వామిగా తెలిసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆల య అభివృద్ధికి చొరవ తీసుకోవాలి. ఇక్కడి చరి త్ర, ఆలయ ప్రాముఖ్యతపై పరిశోధన జరగాలి. – వెంకటస్వామి, బలాన్‌పల్లి, తాడూరు మండలం -
Telangana: అక్కడ ముక్కోణపు పోటీ అనివార్యం
నారాయణ్‌పేట నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ అనివార్యం కానుంది. తెలంగాణ తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన రాజేందర్‌రెడ్డి తర్వాత గులాబీ దళంలో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగి విజయం సాధించారు. ఈసారి కూడా కారు గుర్తు మీద రాజేందర్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిలో తన మార్క్ చూపించారాయన. నారాయణపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయించగలిగారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడం ఆయనకు మైనస్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం డీసీసీ చీఫ్‌గా, నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న శివకుమార్‌రెడ్డి 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడారు. 2018లో కారు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి..వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నియోజకవర్గంలో తొలినుంచీ బీజేపీకి కొంత పట్టుంది. బీజేపీ నేత రతంగ్‌పాండు రెడ్డి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి 23 వేల ఓట్లు సాధించారు. 2018లో కూడా బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. సౌమ్యుడిగా పేరున్న రతంగ్పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నియోజకవర్గం ఓటర్లు ప్రతిసారీ భిన్నమైన తీర్పునిస్తున్నారు. బీజేపీ నేత డీకే అరుణ సోదరుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కారు పార్టీలో చేరారు. 2018లో కూడా కారు గుర్తు మీద నెగ్గి...మూడోసారి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషాతో పాటుగా..పారిశ్రామికవేత్త వర్కటం జగన్నాథం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ ఆసక్తి చూపిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెంకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే..తొలినుంచీ కేడర్ అండగా ఉన్నందున స్థానిక మున్సిపాలిటీని గెలుచుకోగలిగింది. అయితే తొలినుంచీ పార్టీలో ఉండి రెండుసార్లు పోటీ చేసి ఓడిన కొండయ్యకు, కొత్తగా చేరిన జలంధర్‌రెడ్డికి పొసగడంలేదు. ప్రజాసంగ్రామ యాత్రలో కూడా ఇద్దరు పోటా పోటీగా బలప్రదర్శన చేశారు. సీటు విషయంలో ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది. లేదంటే కారు పార్టీకే మేలు జరుగుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టెం టీఆర్ఎస్లో చేరడంతో ఆ పార్టీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. మాజీ జడ్పీటీసీ శ్రీహరి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ దివంగత వీరారెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ ఎన్నిక ఈసారి రసవత్తరంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన రేవంత్...కాంగ్రెస్‌లో చేరి 2018లో ఓడిపోయారు. తర్వాత మల్కాజ్గిరి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పనుల విషయంలో అధికార టీఆర్ఎస్తో కొట్లాడి చేయించారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను టార్గెట్ చేసి ఓడించారు. కొడంగల్‌లో రేవంత్ సోదరుడు పార్టీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే సీఎం అవుతారనే ప్రచారం జరుగుతున్నందున కొడంగల్‌లో రేవంత్ విజయం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. కారు గుర్తు మీద గెలిచిన పట్నం నరేందర్‌రెడ్డి...పార్టీ నేతలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. దీంతో వారంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా నియోజకవర్గానికి చేసిన పనులు కూడా లేవు. కొడంగల్‌లో ఐదుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాథరెడ్డి 2014లో కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో గులాబీ గూటికి చేరి పోటీ చేసి..రేవంత్ చేతిలో ఓడిపోయారు. గుర్నాథరెడ్డి ఇటీవల వైఎస్ విజయమ్మను కలవడంతో...వైఎస్ఆర్టీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇక కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అద్వాన్నంగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీకి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంత శక్తి లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
గాలివాన బీభత్సం.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతి
రాజాపూర్/మాగనూర్/కల్వకుర్తి రూరల్/సూర్యాపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిడుగుపాట్లకు ముగ్గురు మృతిచెందగా సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలుల తీవ్రతకు భారీ స్థాయిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం మర్రిబాయితండాకు చెందిన శత్రునాయక్ (60) ఆదివారం సాయంత్రం శివారులోని తన పొలంలో ఉండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగుపడి ఆయన మృతి చెందాడు. నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని కొత్త రైల్వేస్టేషన్ సమీపంలో కుర్వ పరమేశ్ అలియాస్ లింగప్ప (20) గొర్రెలను మేపుతుండగా పిడుగు పడటంతో మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం కురుమిద్దకు చెందిన సాంబశివ (8) తల్లిదండ్రులతో కలసి పొలం వద్దకు వెళ్లగా పిడుగు పడి అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంతోపాటు చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతనకల్, మద్దిరాల, మోతె మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వీచిన ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంటు తీగలు తెగిపోయాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. జిల్లా కేంద్రంలో హోర్డింగులు నేలకూలాయి. చివ్వెంల మండలం వట్టిఖమ్మం పహాడ్‌లో చెట్టు విరిగి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంపై పడింది. పలు గ్రామాల్లో మామిడి, నిమ్మ, సపోట తోటల్లో కాయలు నేలరాలాయి. నూతనకల్‌లో వడగండ్ల వర్షం కురిసింది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సుమారు వందవరకు విద్యుత్ స్తంభాలు కూలి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
అత్యాచార యత్నం.. ఆపై నిప్పంటించి..
మద్దూరు: ఓ దివ్యాంగురాలికి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఆ యువతి ప్రతిఘటించడంతో నిప్పంటించి పారిపోయాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన దివ్యాంగురాలైన కృష్ణవేణి(21) కొన్నాళ్లుగా తల్లిదండ్రులు, మానసిక వికలాంగుడైన తమ్ముడుతో కలసి హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లిలో ఉంటోంది. తల్లిదండ్రులు వెంకటమ్మ, గోవిందు దినసరి కూలీలు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూర్‌వాసి వెంకట్రాములు హైదరాబాద్‌లోనే కూలిపనులు చేసుకునేవాడు. భార్య వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కృష్ణవేణి తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈనెల 8న వెంకట్రాములు మాయమాటలు చెప్పి కృష్ణవేణిని తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కు రాజేంద్రనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కోస్గి పట్టణంలో గ్రామస్తులకు కనిపించడంతో హైదరాబాద్‌కు వెళ్తున్నామంటూ నమ్మించి మద్దూరుకు తీసుకొచ్చాడు. అదేరోజు సాయంత్రం గురుకుల పాఠశాల వెనకాల ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో చీరకు నిప్పంటించి పారిపోయాడు. మంటలు గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం తెల్లవారుజామున బాధితురాలు మృతి చెందింది. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ యాదవ, వికలాంగ సంఘాల ఆధ్వర్యంలో మద్దూరులో ధర్నా నిర్వహించారు. -
ఎస్ఐ అవినీతి ‘గట్టు’
గట్టు: ఓ ఎస్ఐ అవినీతి గుట్టు రట్టయింది. ఇసుక తరలించేందుకు, జాతరలో జూదానికి అనుమతిచ్చేందుకు మామూళ్లు తీసుకున్నారనే వ్యవహారం తాజాగా రచ్చకెక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సీఐ విచారణ చేపట్టారు. గత నవంబర్ 24న గట్టులో జాతర నిర్వహించారు. ఆ సమయంలో జూదానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్వాహకులు పోలీస్ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమేష్ సాయం కోరారు. దీంతో ఆయన వారి తరఫున ఎస్ఐ మంజునాథరెడ్డితో సెటిల్మెంట్ కోసం ఫోన్లో మాట్లాడారు. ఎస్ఐ రూ.50వేలు డిమాండ్ చేయగా.. రూ.40వేలు ఇస్తానని సదరు డ్రైవర్ చెప్పారు. ఈ డబ్బులు పైఅధికారులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చుకోవాలో ఎస్ఐ వివరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇసుక వ్యవహారంలో.. ఇదిలాఉండగా, మండలంలోని ఇందువాసికి చెందిన ఓ ఇసుక ట్రాక్టర్‌ను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలించడానికి ఇది వరకే ఎస్ఐకి రూ.20వేలు ఇచ్చానని గ్రామానికి చెందిన నర్సప్ప తెలిపారు. డబ్బులు తీసుకుని తిరిగి పట్టుకోవడాన్ని ఆక్షేపిస్తూ కొంతమంది ట్రాక్టర్ల యజమానులు గురువారం పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఇసుక తరలింపునకు ప్రత్యేక అనుమతుల పేరుతో ప్రతి నెలా ట్రాక్టర్ల యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో గద్వాల సీఐ బాష గట్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్ఐ మంజునాథరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. భీమేష్‌తోపాటు మరికొందరిని విచారించారు. ఇసుక అనుమతుల వ్యవహారంపైనా ట్రాక్టర్ల యజమానులతో ఆరా తీశారు. ఉన్నతాధికారులకు వసూళ్ల వ్యవహారంతో సంబంధం లేదని బాష చెప్పారు. -
ముంచుకొస్తున్న మూడో ముప్పు
-
పురిటిపాట్లు..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం గ్రామం.. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలం వస్తే మధ్యలో ఉన్న ఉడుముల (వట్టె)వాగు దాటి వెళ్లాలి. గత 4 రోజుల కింద గ్రామానికి చెందిన తోట రవీందర్ అనే యువకుడు వాగు దాటే ప్రయత్నం చేసి నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. యువకుడే వాగు దాటలేక మరణిస్తే.. ఇక మహిళలు, గర్భిణుల పరిస్థితి ఎలా ఉంటుందో..! ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతపెట్టిగూడెం గ్రామం నుంచి బయటకు రావాలంటే మధ్యలో ఉన్న పారేటి వాగు దాటాలి. ఈ వాగు కొద్దిపాటి వర్షానికే పొంగుతుంది. దీంతో ఇటీవల ఆ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఎడ్లబండిపై వాగు దాటించి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారుచెలక, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సాక్షి, మహబూబాబాద్: వానాకాలం వస్తే చాలు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గర్భిణులకు వణుకు మొదలవు తుంది. వాగులు, వంకలు దాటి ప్రసవం కోసం ఆస్పత్రుల కు వెళ్లాలంటే కత్తిమీద సాములా మారుతోంది. నిండుచూ లాలికి నొప్పులు వస్తే వారిని ఆస్పత్రికి తరలించడం ఎంత కష్టమో చెప్పలేం. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం, ఇతర అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే ముందుగా గిరిజన గ్రామాల రహదారిపై ఉన్న వాగులు దాటితేనే వైద్యం అందుతుంది. ఇక ఆ వాగు దాటాలంటే ఎడ్లబండ్లు, జోలెలే శరణ్యం. ఇలా రాష్ట్రంలోని మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని గిరిజనులు ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో నెలలు నిండిన మొత్తం గర్భిణులు దాదాపు 3,869 మంది ఉన్నట్లు అంచనా. ►మహబూబాబాద్ జిల్లా గంగారం, గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్లతో పాటు నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లోని పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు. ఉన్నా మధ్యలో వాగులు దాటాల్సి ఉంటుంది. దీంతో ఊట్ల మట్టెవాడ, మొట్ల తిమ్మాపురం, ముస్మి, దొరవారి తిమ్మాపురం గ్రామాలతో పాటు ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి. ►నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంత మండలం ముల్గర నుంచి కల్వకుర్తికి వెళ్లాలంటే దుందభివాగు దాటాలి. అమ్రాబాద్ మండలం కుమ్మరంపల్లి నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న మందవాగు దాటాలి. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మేడికుంట–మిట్టపల్లి మధ్య మస్మివాగు, రాఘబోయినగూడెం చెరువు అలుగు పడి ముల్కలపల్లి, బోటితండా మధ్య, ఇల్లెందు, తొడిదెలగూడెం మ«ధ్య చెరువు అలుగు పడటంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా యి. టేకులపల్లి మండలం రోళ్లపాడు, మురుట్ల, సాయ మ్మ, గడ్డిచెరువు ముర్రేడు వాగుల్లోకి వరద నీరు భారీగా చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముత్యాలంపాడు, తావుర్యాతండా, రాజుతండా, జండాలతండా, పెట్రాంచెలక సమీపంలోని వాగుల ఉధృతితో ఈ గ్రామాల రాకపోకలకు బ్రేక్ పడింది. సోములగూడెం, బిక్కుతండాపై లో లెవల్ బ్రిడ్జి ఉంది. బూడిదవాగు పొంగితే బ్రిడ్జిపై రాకపోకలు స్తంభిస్తాయి. గుండాల మండలంలో కిన్నెరసాని వాగుపై ఉన్న లో లెవల్ చప్టాల కారణంగా వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశ్వాపురం–గొందిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తే గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం గ్రామ పంచాయతీల్లోని 8 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, తుమ్మపహాడ్, సిరికొండ, రాజులగూడ, నారాయణపూర్ గ్రామా లు. నేరేడుగండి, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, బజార్హత్నూర్, బోథ్ మండలాల్లోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ►ములుగు జిల్లాలో వాజేడు మండలంలో కొంగలవాగుల దాటితే పెనుగోడు గ్రామానికి, చాకలివాగు దాటితే వాజేడు మండల కేంద్రానికి వెళ్తారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, వెంకటాపురం–కె మండలంలో కర్రవానిగుంపు, మల్లారం గ్రామాలకు వెళ్లాంటే మద్యంలో కంకలవాగును దాటివెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని జలగవంచతో పాటు జిల్లావ్యాప్తంగా ఇరువై గ్రామాలకు వర్షాకాలం వస్తే రోడ్డు మార్గం కూడా ఉండదు. బయ్యారం–మొట్లతిమ్మాపురం మధ్యలో ఉన్న ఉడుము వాగును దాటుతున్న మహిళలు -
Revanth Reddy: అంచెలంచెలుగా ఎదిగి.. అధ్యక్షుడిగా..
సాక్షి, కల్వకుర్తి (మహబూబ్ నగర్): వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఎనుములు రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి టీపీపీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి చురుకైన వ్యక్తిగా గుర్తింపు ఉంది. రాంచంద్రమ్మ, నర్సింహారెడ్డి దంపతులకు నాలుగో సంతానం ఆయన. 2003లో టీఆర్ఎస్లో చేరి కల్వకుర్తిలో క్రియాశీలకంగా పనిచేశారు. 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసినా.. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల పోటీ చేసే అవకాశం రాలేదు. 2006లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా బరిలోకి దిగాలని భావించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా అఖిల పక్షం ఏర్పాటు చేసి.. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి రబ్బానీపై విజయం సాధించారు. ఆ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసేతర పార్టీల జెండాలన్నింటితో ప్రచారం నిర్వహించడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. రెండేళ్ల తర్వాత జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ఆయన శాసనమండలిలోకి అడుగు పెట్టారు. కొడంగల్‌కు వెళ్లి.. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రేవంత్ 2008లో టీడీపీలో చేరారు. 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించిన ఆయన మళ్లీ ఇటువైపు దృష్టి సారించకుండా కొడంగల్ వైపు వెళ్లారు. అక్కడ టీడీపీని బలోపేతం చేస్తూ 2009 ఎన్నికల్లో గురున్నాథ్‌రెడ్డిపై 6,989 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 14,614 ఓట్లతో మెజార్టీతో కొడంగల్ నుంచి రెండోసారి విజయం సాధించారు. ఓటుకు నోటు కేసు, తెలంగాణలో టీడీపీ బలహీనపడడం, మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన 2017లో ‘హస్తం’ గూటికి చేరారు. తక్కువ సమయంలోనే టీపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి విజయం సాధించారు. ఫిబ్రవరి మొదటి వారంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేటలో ఒకరోజు దీక్షకు వచ్చిన ఆయన అక్కడ ప్రసంగించి ఆ చట్టాలు రద్దు చేయాలని హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆరోజు నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. పార్టీ శ్రేణుల్లో ఆనందం... రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి పదవి రావడంతో ఉమ్మడి జిల్లాలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్‌కు ఇవ్వడం వల్ల కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారు. -
ఉమ్మడి పాలమూరుజిల్లాలో అన్నదాతల అవస్థలు
-
అనాథ మహిళ మృతి.. రెండు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ
సాక్షి, అమరచింత(మహబూబ్‌నగర్): ఓ అనాథ మహిళ మృతి చెందగా ఇరు గ్రామాల మధ్య ‘ఖనన’ పంచాయితీ తలెత్తింది. చివరకు ఒకరిద్దరు గ్రామ పెద్దల జోక్యంతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్టంపల్లికి శ్మశాన వాటిక లేదు. దీంతో పక్క గ్రామమైన నందిమల్ల ఎక్స్‌రోడ్డు శివారులో ఇటీవల అధికారులు రెండెకరాలు కేటాయించారు. అయితే కిష్టంపల్లిలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు నందిమల్ల ఎక్స్‌రోడ్డు మధ్య నుంచే వెళ్లాలి. దీంతో ఇరు గ్రామాల మధ్య పంచాయితీ న డుస్తోంది. కాగా, కిష్టంపల్లికి చెందిన అనాథ దాసరి కొండమ్మ (80) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. సర్పంచ్ చెన్నమ్మతో పాటు గ్రామస్తులు ఆర్థికసాయం అందించి మధ్యాహ్నం అంతిమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. ఖననానికి తీసుకెళ్తుండగా తమ గ్రామం మీదుగా వద్దని నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామస్తులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ట్రాక్టర్‌పై నుంచి కిందికి దింపారు. ఇరు గ్రామస్తుల మధ్య గంటన్నర పాటు వాదోపవాదా లు నడిచాయి. కొందరు నాయకులు జోక్యం చేసుకు ని మృతదేహాలు తీసుకెళ్లడానికి వేరే మార్గం చూపి స్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. చివరకు అనాథ మహిళ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: రిమ్స్‌లో దారుణం: కాలం చెల్లిన ఇంజక్షన్లతో చికిత్స.. -
పెళ్లయింది..కానీ మరో అమ్మాయితో ప్రేమ.. చివరికి
కోస్గి: ప్రేమ వ్యవహారంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తోగాపూర్‌లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోగాపూర్కి చెందిన యువకుడు సంపంగి రమేష్(20)కి 10 నెలల క్రితం గుండుమాల్కి చెందిన యువతితో వివాహం జరిగింది. కాగా అప్పటికే రమేష్‌కు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉంది. ఈ నెల 5న తన బావ బాలకిష్టయ్యకు ఫోన్ చేసి తాను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పగా.. ఈవిషయాన్ని బాలకిష్టయ్య అతని కుటుంబసభ్యులకు తెలియజేశాడు. వారు గాలించగా తమ వ్యవసాయ పొలం సమీపంలోని గుట్టల్లో పురుగుమందు తాగి మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి దేవమ్మ ఆదివారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. తాగుడుకు బానిసై మరో యువకుడు.. తాగుడుకు బానిసైన ఓ యువకుడు మతి స్థిమితం కోల్పోయి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోస్గిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా..పట్టణంలోని వినాయక్ నగర్‌కు చెందిన హన్మంతు(28) హమాలీ పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతడు తాగుడుకు బానిస కావడంతో అతని భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లి పోయింది. హన్మంతు గతకొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య -
ఇద్దరు చిన్నారులను బలిగొన్న రాళ్లవాగు
రామకృష్ణాపూర్: సరదాగా ఆడుకునేందుకు వాగులోకి దిగిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు విడిచారు. అంతవరకు తమ కళ్లముందు ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు విగత జీవులై కనిపించటం స్థానికులను కంటతడిపెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మోతీనగర్‌కు చెందిన సింగిరి యాదగిరి, అలివేలు దంపతులు కొద్దిరోజులుగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కుర్మపల్లి బస్టాప్ వద్ద నివాసం ఉంటున్నారు. వారి కూతుళ్లు స్వాతి (9), ప్రతిష్ట (5) శుక్రవారం ఉదయం తిమ్మాపూర్ శివారు రాళ్లవాగు వైపు ఆడుకోవడానికి వెళ్లారు. అయితే ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన చిన్నారుల సోదరుడు అభి తండ్రి యాదగిరికి ఈ విషయం చెప్పాడు. దీంతో యాదగిరి బంధువులతో కలసి వాగు వద్దకు వెళ్లి వెతుకుతుండగా.. స్వాతి, ప్రతిష్ట నీటిలో విగతజీవులుగా కనిపించారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఉంగరాలు అమ్ముతూ.. దొరికిన కూలీ పని చేస్తూ యాదగిరి కుటుంబం జీవనం సాగిస్తోంది. స్థానిక ఎస్సై రవిప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను యాదగిరి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆయిల్‌ఫెడ్‌కు 1.3 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పాం సాగుకు నోటిఫై చేసిన ఏరియాలో 1.3 లక్షల ఎకరాలు ఆయిల్ ఫెడ్‌కు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 20 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 20 వేలు, నారాయణపేట్ జిల్లాలో 10 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకుంటామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు 24,500 ఎకరాలు (2.97 శాతం) మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం విదితమే. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు మరికొంత కేటాయించాలని వ్యవసాయశాఖకు విన్నవించారు. ఇదిలావుంటే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన దాంట్లో కొన్ని ప్రముఖ సంస్థలే ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఆయిల్‌ఫెడ్ కోరినట్లుగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొంతమేరకు ఇచ్చారు. కొన్ని కంపెనీలు రాని ఏరియాలను ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న సంస్థలకు ఇస్తామని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం..
సాక్షి, మహబూబ్‌నగర్: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, ఇందుకు తగ్గట్టుగా పని చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డిలు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉద్యోగుల పదోన్నతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులను ఆయా ఉద్యోగులకు అందించారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేయాలని మంత్రులు కోరారు. ఖజానా డబ్బులన్ని ఉద్యోగుల జీతాల పెంపుకే ఇచ్చారన్న భావన ప్రజల్లో కలగకుండా పీఆర్సీని పెంచుకుందమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, న్యాయ బద్దమైన పీఆర్సీ వచ్చేలా తాము కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో 2021 డైరీ, క్యాలెండర్లను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. -
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
కొడంగల్: ఓ తల్లి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చెరువులో తోసి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హృదయ విదారకంగా మారిన ఈ ఘటన కొమ్మూరు, ఏపూర్, హస్నాబాద్ గ్రామాల్లో విషాదం నింపింది. బంధువుల కథనం ప్రకారం .. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (28)ను నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన సత్యప్పతో పదేళ్ల కిందట వివాహం చేశారు. పెళ్లి నాటి నుంచి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వారు పలుమార్లు కోస్గి, హస్నాబాద్ తదితర గ్రామాలకు పని నిమిత్తం వచ్చేవారు. వారికి రజిత (8), అనిత (6), రాజు (4) ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తాయి. అత్తింట వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందింది. గురువారం రోజు కుటుంబ సభ్యులతో గొడవ జరిగింది. ఇంటి సమస్యలతో సతమతమైన ఆమెకు బతుకు భారంగా అనిపించింది. బతకడం ఇష్టం లేక కొమ్మూరు గ్రామం నుంచి కోస్గికి వచ్చి అక్కడి నుంచి హస్నాబాద్‌కు చేరుకుంది. హస్నాబాద్ గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. రజిత, రాజు చేతులను చున్నితో కట్టి చెరువులో తోసింది. (చదవండి: ఆన్లైన్ గేమ్.. అప్పులు తీర్చలేక యువకుడు బలి) ఈ విషయం గమనించిన మరో కూతురు అనిత అక్కడి నుంచి పారిపోయింది. హస్నాబాద్ గ్రామానికి చేరుకొని గ్రామస్తులకు విషయం చెప్పింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే లోపు ఎల్లమ్మ కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి రాజు మృత దేహం ఒడ్డుకు వచి్చంది. తల్లి కూతుళ్ల శవాలు కనిపించకపోవడంతో శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగి్నమాపక సిబ్బంది సహకారంతో వెతికారు. చెరువులో చెట్టుకు తగిలి ఉన్న రెండు మృతదేహలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. కొడంగల్ ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి, బొంరాస్‌పేట ఎస్ఐ శ్రీశైలం, రెవెన్యూ, అగి్నమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
చీటీలు వేసినవారి పనేనా!
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. 82 గంటలైనా కేసు కొలిక్కి రాకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేశారు. బాలుడి తల్లి పట్టణంలో చీటీలు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 250 మంది ఆమె వద్ద నెలవారీ చీటీ వేస్తున్నట్లు గుర్తించి, ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు సైతం బాలుడి తల్లికి మాత్రమే ఫోన్ చేస్తుండటంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటి వరకు ఆమె వద్ద చీటీలు కట్టిన వారు ఎవరు, చీటీ ఎత్తుకుని డబ్బు కట్టని వారెవరు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రోజంతా హైడ్రామా మంగళవారం రాత్రి కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధా్నహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూసినా ఎవరూ రాకపోవడం, ఫోన్ కూడా చేయకపోవడంతో బాలుడి కిడ్నాప్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. రంగంలోకి ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ కిడ్నాపర్లు చేస్తున్న ఫోన్ నంబర్లు, ఎక్కడి నుంచి చేస్తున్నారనే విషయాన్ని స్థానిక పోలీసులు ట్రేస్ చేయలేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి విషయాన్ని తెలిపారు. మరోపక్క బాలుడి తల్లిదండ్రులు నెల రోజులుగా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఆర్థిక కార్యకలాపాలు ఎవరితో నిర్వహించారనే వివరాలు సేకరించి వారిని విచారిస్తున్నారు. మహబూబాబాద్ పోలీసులతో పాటు, ఉమ్మడి వరంగల్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది పట్టణంలో ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్ నుంచి వచి్చన ఐటీ కోర్, సైబర్ క్రైం టీం నిపుణులు సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఇంటెలిజెన్స్ బృందాలు బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు? దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు బుధవారం రాత్రి వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, బాలుడిని కూడా సురక్షితంగా చేరదీసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్లో తెలియజేస్తామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. -
ముంచెత్తిన వాన
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వర్ష బీభత్సంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అనేక చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో అత్యధికంగా 20.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గద్వాల, ధరూరు, మల్దకల్, మానవపాడు, కేటీదొడ్డి, ఇటిక్యాల ప్రాంతాల్లో పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు రావడంతో ప్రజలు రాత్రంతా జాగరణ చేయాల్సి వచ్చింది. కేటీదొడ్డి మండలం గద్వాల–రాయిచూర్ రహదారిపై ఉన్న నందిన్నె వాగులో ఓ లారీ చిక్కుకుంది. అడ్డాకుల మండలం శాఖాపూర్ వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై భారీ గండి పడింది. కల్వర్టు కింద ఉన్న మట్టి వరదకు కొట్టుకుపోవడంతో హైదరాబాద్ వైపు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఇది గమనించిన కొందరు యువకులు వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అడ్డాకులలోని ఓ కోళ్ల ఫారంలో 9 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. జడ్చర్ల మండలం లింగంపేటకు చెందిన అఫ్రోజ్ (23) శనివారం ఈత కొట్టేందుకు దుందుబి వాగులోకి దూకాడు. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వాగులో కొట్టుకుపోయాడు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం భల్లాన్‌పల్లిలో పాతగోడ కూలి గుడిసెపై పడటంతో అందులో ఉన్న చిన్నారి పూజ (4) అక్కడికక్కడే మృతి చెందింది. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం జగ్గాయిపల్లిలో కుంట తెగి, వరద నీరు కోళ్లఫారంలోకి వెళ్లడంతో ఐదు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. కాగా, కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 08542–241165 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఇదిలాఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భూదాన్‌పోచంపల్లి –భీమనపల్లి గ్రామాల మధ్య చిన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. యాదాద్రి ఆలయానికి వెళ్లే దారి, రింగ్ రోడ్డు కోతకు గురయ్యాయి. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం భీమనపల్లి నుంచి మాధాపురం వెళ్లే అంతర్గత రోడ్డు ధ్వంసమైంది. దేవరకొండ నియోజకవర్గంలో పంటచేలన్నీ నీట మునిగాయి. వరి, టమాటా, మిరప చేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదికి వరద పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జంటుపల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో శివసాగర్ నిండుకుండలా మారింది. గోదావరికి వరద తాకిడి ఎగువన ఎస్సార్ఎస్పీ గేట్లు ఎత్తడంతో గోదావరికి వరద తాకిడి పెరుగుతోంది. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంకాళేశ్వరం ప్రాజెక్టు పరిధి అన్నారం సరస్వతీ బ్యారేజీలోని 66 గేట్లకు 30 గేట్లు ఎత్తి నీటిని కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,06,000 క్యూసెక్కులు ఉంది. అలాగే.. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీలో 88 గేట్లకు 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 3,06,470 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్‌ఫ్లో 2,76,100 క్యూసెక్కులు దిగువ గోదావరిలో కలుస్తున్నదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి 8.45 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. గద్వాలలో వరదనీటి ప్రాంతాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి -
నాగులు మృతి
ఖైరతాబాద్/అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): తెలంగాణ వచ్చాక తమకు అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బైకెలి నాగులు (55) చికిత్స పొందుతూ శని వారం మృతి చెందినట్లు సైఫాబాద్ పోలీ సులు తెలిపారు. ఈ నెల 10న రవీంద్రభారతిరోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నాగులును సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిం చారు. మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ 62 శాతం శరీరం కాలిపోవడంతో వైద్యానికి సహకరించక మృతి చెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన బైకెలి నాగులు చిన్నప్పటి నుంచి తెలంగాణ వీరాభిమాని. ఎక్కడ సభలు, సమా వేశాలు జరిగినా చురుగ్గా పాల్గొనేవా డని కుటుంబ సభ్యు లు తెలిపారు. ఆయన కు భార్య స్వరూప, కూతురు స్నేహలత, కుమారుడు రాకేష్‌కుమార్ ఉన్నారు. వీరు ఇద్దరూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. నాగులు కుటుంబం బండ్లగూడలోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటోంది. నాగులు బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని ఎంవీ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తున్నారు. నా పిల్లల్ని ఆదుకోండి: మృతుడి భార్య ఎప్పుడూ తెలంగాణ ఉద్యమం అంటూ తిరిగే నాభర్త మంటల్లో కాలుతూ కూడా జై తెలంగాణ అంటూ నినదించిండు. నా భర్త మమ్మల్ని వీడి వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన భౌతికదేహాన్ని మొదట కీసర అమరవీరులస్థూపం వద్దకు, అక్కడి నుంచి బండ్లగూడకు తరలించి ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తాం. నా భర్త కోరిక మేరకు మా పిల్లలకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి మా కుటుంబానికి అండగా నిలవాలి. -
అల్లాడుతున్నా పట్టించుకోరా?
పాలమూరు: ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి, గద్వాల, వనపర్తి జిల్లా ఆస్పత్రులను సీఎల్పీ బృందం సోమవారం పర్యటించింది. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసింది. అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రు ల్లో చాలా వరకు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మిగులు రాష్ట్రంగా అప్పగిస్తే ప్రస్తుత ప్రభుత్వం రూ.మూడు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. నీళ్ల కోసం తెచ్చిన రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్న నీరు పోయే పరిస్థితికి తెచ్చారన్నారు. కృష్ణానది నుంచి 11 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకుపోవడానికి యత్నిస్తుంటే.. ము ఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు తెలంగాణపై ప్రేమతో ప్రాజెక్టులు నిర్మించాయని, నాగార్జునసాగర్‌తో నల్లగొండ, ఖమ్మం జిల్లాలో జోన్–1, 2 కింద 6.4 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చారన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 89 లక్షల ఎకరాలకు నీటిని అందించే ప్రాజెక్టులకు నీళ్లు అందక బీడు భూములు మార్చేందుకు నాంది పలికారని ఆయన విమర్శించారు. ఆయన వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా పాల్గొన్నారు. -
కరోనా నియంత్రణ కష్టమేం కాదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘1918–21 వరకు మూడేళ్ల వ్యవధిలో స్వైన్ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల (5 కోట్ల) మంది చనిపోయారు. 2010లోనూ అదే జాతికి చెందిన (బలహీనమైన) వైరస్ మన రాష్ట్రంపై దాడి చేసింది. కానీ అప్పటికే మందు అందుబాటులో ఉండటంతో ప్రాణనష్టం అంతగా జరగలేదు. ఇప్పుడు కోవిడ్–19 ప్రపంచంలో మరణ మృదంగం మోగిస్తోంది. కానీ 1918–21 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మన వద్ద మంచి వైద్యం అందుబాటులో ఉంది. ప్రజల్లో అవగాహన, చైతన్యం ఉంది. వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదు. సరైన ఆహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం ఉంటే చాలు’అని షికాగోలోని ఇలినాయి హెల్త్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్దండి స్పష్టంచేశారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అనవసర మందులు వాడితే ప్రాణాలకు ముప్పు.. కరోనా పాజిటివ్ అని తేలగానే బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చేరితే చాలా మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై ఎలాంటి అవగాహన లేని వైద్యులు చెప్పిన మందులు వాడుతున్నారు. ఇది మంచిది కాదు. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాలు, సూచనలతోనే మందులు వాడాలి. పలు ఆస్పత్రుల్లోనయితే వైద్యులు కరోనా రోగులకు యాంటిబయోటిక్స్ ఇస్తున్నారు. ఎక్కువ మోతాదులో యాంటిబయోటిక్స్ ఇస్తే ప్రాణాలు పోతాయి. అసలు కరోనా ఉన్న వారికి ఇవి అనవసరమనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతం డెక్సామెతసోన్ మాత్రతోనే వైరస్‌ను కాస్త కట్టడి చేయగలం. అమెరికాలో ఇది నిర్ధారణ అయింది. ఈ మాత్ర మార్కెట్లో రూ.5 లోపే ఉంటుంది. ఇలాంటి నిరూపితమైన మందులు మన దగ్గర వాడటం లేదు. కానీ రూ.32 వేల ఖరీదు చేసే నిరూపితం కాని యాంటి వైరల్ డ్రగ్స్ వాడుతున్నారు. ఈ విషయంలో పలు ఆస్పత్రులు తమ తీరు మార్చుకోవాలి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమూ దృష్టి సారించాలి. వైరస్ మళ్లీ మళ్లీ రావొచ్చు.. కరోనా చికిత్స పొందిన వ్యక్తికి మళ్లీ మళ్లీ ఆ వైరస్ సోకవచ్చు. సాధారణంగా వైరస్ సోకిన ఐదారు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఆ లక్షణాలూ ఉండవు. ఒకసారి నిర్ధారణ అయి చికిత్స పొందిన తర్వాత వైరస్ వెళ్లిపోతుంది. అయితే వైరస్ మూలాలు శరీరంలో అలానే ఉంటాయి. సదరు వ్యక్తి సరైన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ మళ్లీ సోకే ప్రమాదం లేకపోలేదు. ప్రత్యేక ఆహారమనేది లేదు... కరోనా రోగులు మాంసం, చేపలు, గుడ్లు వంటి బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చాలా మంది అంటుంటే విన్నా. అయితే వైరస్‌ను తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ముందే ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర, వ్యాయామం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మృతదేహం నుంచి వైరస్ సోకదు... కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి వైరస్ సోకుతుందనే భయంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ ఇష్టపడటం లేదు. సహజంగా కరోనా వ్యక్తి ఊపిరి తీసుకున్నప్పుడు గాలి ద్వారా లేదా అతని శరీరాన్ని ముట్టుకుంటే వైరస్ ఇతరులకు సోకుతుంది. చనిపోయిన తర్వాత అతను ఊపిరి తీసుకోలేడు, అతన్ని ముట్టుకునే అవకాశం ఉండదు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయ వచ్చు. ప్రజలు తరచూ శానిటైజ్డ్ అవుతూ ఉండాలి. సబ్బు, నీళ్లను మించిన శానిటైజర్ ప్రపంచంలో ఏదీ లేదు. మాస్కులు సాధారణ బట్టతో చేసినవే మేలు. అది ఆందోళన కలిగించేదే... కరోనా బాధితుడికి ప్లాస్మా ఎక్కిస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు వైద్యులు నమ్ముతున్నారు. ఇది వాస్తవం కాదు. బాధితుడి శరీరంలోకి ప్లాస్మా ఎక్కిస్తే రియాక్షన్ అయ్యే ప్రమాదముంది. ఇక 85 శాతం మందికి వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను తట్టుకోగలిగే, వ్యాధిని నిర్మూలించగలిగే ఎలాంటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. స్వీయనియంత్రణ, రక్షణతోనే వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం -
ఒకే గొడుగు కిందకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జల వనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. గత కొన్ని నెలలుగా దీనిపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం పునర్ వ్యవస్థీకరణ ముసాయిదాపై ఇంజనీర్లతో మరోమారు చర్చించి ఫైనల్ చేశారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు చేర్చారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించే కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జల వనరుల శాఖ పునర్ వ్యవస్థీకరణపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్‌తో పాటు ఈఎన్ సీలు మురళీధర్, నాగేంద్రరావు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే హాజరయ్యారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఆయకట్టు పెరిగినందున క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల డివిజన్లను 19కి పెంచేందుకు సీఎం నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ డివిజన్లు కానున్నాయి. ఈ సీఈల పరిధిలోనే ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్ లు, కాల్వలు, సబ్స్టేషన్లు ఉండనున్నాయి. ఒక్కో సీఈ పరిధిలో 5 లక్షల ఎకరాల నుంచి 7లక్షల ఎకరాలు ఉండేలా పని విభజన చేశారు. మహబూబ్‌నగర్ సీఈగా అంజయ్య.. ఈ నెలాఖరున పదవీ విరమణ పొందనున్న పలు సీఈలు, ఈఈల స్థానంలో కొత్త వారికి బాధ్యతలు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మహబూబ్‌నగర్ సీఈగా అనంతరెడ్డి స్థానంలో ఎస్ఈ అంజయ్యకు పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టగా, మైనర్ ఇరిగేషన్ గోదావరి బేసిన్ సీఈగా ఉన్న వీరయ్య స్థానంలో సీడీఓ సీఈ శ్రీనివాస్‌కు బాధ్యతలు ఇచ్చింది. అంతర్రాష్ట్ర జల వనరుల విభాగంలో పనిచేస్తున్న ఇన్చార్జి ఈఈ కోటేశ్వర్రావు పదవీకాలాన్ని పొడిగించగా, మరో ఆరుగురు ఈఈల స్థానంలో కొత్తవారిని నియమించింది. మొత్తంగా ఆరుగురు ఈఎన్సీలు.. మైనర్ ఇరిగేషన్ కింద ఇది వరకు కృష్ణా, గోదావరి బేసిన్ లలో విడివిడిగా ఉన్న సీఈల పోస్టులను రద్దు చేశారు. ఈ సీఈలతో పాటు మొత్తంగా ఆరుగురు ఈఎన్ సీలు ఉండనున్నారు. ఇందులో ఒకరు ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ బాధ్యతలు చూడనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణను కేబినెట్ ముందు పెట్టి, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించనున్నారు. అక్కడ ఆమోదం పొందిన అనంతరం దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. ఇదే అంశమై అసెంబ్లీలోనూ ఒక ప్రకటన చేయాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు. -
పోలీసుల మందలింపుతో యువకుడి ఆత్మహత్య
కోస్గి: పోలీసులు మందలించడంతో ఆందోళనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం చంద్రవంచకు చెందిన మారుతి (19) డిగ్రీ మధ్యలోనే ఆపి వేసి హైదరాబాద్‌లో పని చేసుకుంటుండేవాడు. అయితే ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడిపి తనకు గర్భం రావడానికి కారణమయ్యాడని అదే గ్రామానికి చెందిన ఓ యువతి (22) తన తల్లితో కలసి ఈనెల 17న పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు రప్పించి ‘అమ్మాయి ని పెళ్లి చేసుకుంటావా.. కేసు పెట్టమంటావా?’అనడంతో భయపడిన మారుతి పెళ్లి చేసుకుంటాన ని అంగీకారపత్రం రాసిచ్చాడు. మరుసటి రోజే సాయిబాబ మందిరంలో పెళ్లి చేసేందుకు ఎస్ఐ నాగరాజు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మారుతి, తాను మైనర్‌నని.. ఆధార్ కార్డులో పుట్టి న తేదీ తప్పుగా నమోదైందని పోలీసులకు తెలిపా డు. దీంతో పాఠశాలలో ఇచ్చిన బోనఫైడ్ సర్టిఫికె ట్ తీసుకురావాలని ఎస్ఐ సూచించడంతో అక్కడినుంచి బయటకు వచ్చిన మారుతి తప్పించుకుని హైదరాబాద్‌కు పారిపోయాడు. ఈ నేపథ్యంలో మారుతిని పోలీసులే వదిలేశారని, ఎలాగైనా అతనితో పెళ్లి చే యాలని యువతి పట్టుబట్టడం తో అతనిపై కేసు నమోదు చేశా రు. ఇది తెలుసుకున్న మారుతి బుధవారం రాత్రి స్వగ్రామాని కి వచ్చి అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. గురువారం ఉదయం అటువైపు వెళ్లిన కొందరు కాలనీవాసులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ వేధింపుల వల్లే బలవన్మరణం ఇదిలా ఉండగా ఎస్ఐ భయపెట్టడం వల్లే మారుతి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి అంజిలయ్య, సోదరుడు రవి ఆరోపించారు.ఎస్ఐ వచ్చే దాకా తీసేదిలేందటూ మృతదేహం వద్దే బైఠాయించారు. దీంతో కోస్గి సీఐ ప్రేమ్‌కుమార్ బాధితులతో మాట్లాడి సమగ్ర విచారణ జరిగిపి బా ధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎస్ఐ నాగ రాజును వివరణ కోరగా, యువతి ఫిర్యాదు మేరకు మారుతిని పిలిపించి విచారించిన మాట వాస్తవమేనన్నారు. అతను మైనర్‌ను కాబట్టి ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోపాటు అమ్మాయి కుటుంబ సభ్యుల ఎదుటే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడన్నారు. -
పరగడుపున ప్రత్యేకమా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పదోతరగతి, ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఫలితాలు సాధించేందుకుగాను ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షలకు గడువు సమీపిస్తుండటంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వివిధ సబ్జెక్టుల బోధనపై దృష్టి సారించారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరగడుపున అలాగే వస్తున్నారు. దీంతో వారికి అర్ధాకలితో నీరసం తప్పడం లేదు. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు ఎక్కి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు హాజరవుతున్నారు. ముఖ్యంగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు కాకపోవడంతో ఉదయం వచ్చేటప్పుడు టిఫిన్ తెచ్చుకుంటే సరి లేదంటే సాయంత్రం వరకు ఇబ్బందులు తప్పడం లేదు. వీరితో పాటు గతంలో దాతలు, అధికారులు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆకలితో చదివిన చదువులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడంలేదని కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెబుతున్నారు. అల్పాహారం అందిస్తేనే ఫలితాలు గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ చొరవతో పదోతరగతి విద్యార్థులకు మల్టీగ్రెయిన్ బిస్కెట్లను ఉదయం, సాయంత్రం అందజేశారు. ఈ సంవత్సరం అలాంటి చర్యలేవీ తీసుకోలేకపోయారు. ఇక జిల్లా కేంద్రంలోని ఇంటర్మీడియెట్ బాలుర కళాశాలలో రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో అధ్యాపకులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అలాగే జడ్చర్ల, మిడ్జిల్‌లోనూ కొనసాగిస్తున్నారు. మిగతా చోట్ల విద్యార్థులకు దాతలు, నాయకులు, సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. పూర్తయిన సిలబస్ ఇప్పటికే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు సిలబస్ పూర్తి చేశారు. వీరికి వచ్చే ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం చదువులో వెనుకబడిన పిల్లలపై శ్రద్ధ చూపుతూ, స్లిప్‌టెస్టులు యూనిట్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇక పదో తరగతి విద్యార్థులకు దాదాపుగా సబ్జెక్టులన్నీ పూర్తయ్యాయి. అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేక ప్రణాళికతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లో గణితం, సైన్స్, ఇంగ్లిష్‌పై ప్రిపరేషన్ సాగడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చదువు ఒత్తిడితో పాటు దూరం నుంచి రావడం, పోవడంతో సరిగ్గా ఆహారం తీసుకోని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, దాతలు సహకరించి ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. దాతలు ఆదుకుంటేనే.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల సిలబస్ పూర్తయింది. ఈసారి వందశాతం ఫలితాల దిశగా కృషి చేస్తున్నాం. అల్పాహారం అందించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.– వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్ శాఖ అధికారి, మహబూబ్‌నగర్ -
ఆర్ఏఎస్ పద్ధతి బాగుంది
బాలానగర్ (జడ్చర్ల): రీ–సైక్లింగ్ ఆక్వా సిస్టం (ఆర్ఏఎస్) బాగుందని మేఘాలయ మత్స్యశాఖ మంత్రి కురమన్ ఉరియా అన్నారు. సోమవారం బాలానగర్ మండలం గుండేడ్ శివారులోని వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు విశ్వనాథరాజు తక్కవ నీటితో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చేపలను ఎలా పెంచాలనే దానిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాగా, ఇదే పద్ధతిని గౌహతి వద్ద అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ, మేఘాలయ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఐతిమోలాంగ్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొస్తాడని అంతమొందించారు
రాజోళి (అలంపూర్): వివాహేతర సంబంధమే ఓ అమాయకుడి హత్యకు దారితీసింది. మాటలతో కలిసిన పరిచయం, ఫోన్లో సంభాషణ, ఆపై నేరుగా కలుసుకోవడం.. అనంతరం అడ్డుగా వస్తాడనే ఉద్దేశంతో ప్రియురాలి భర్తను అంతమొందించేలా చేసింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ కథనం ప్రకారం.. మండలంలోని పెద్దతాండ్రపాడుకు చెందిన మిషేక్(28) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రోజూలాగానే ఈ నెల పదో తేదీన సొంత పనిమీద బయటకు వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో మిషేక్ అన్న అశోక్ రాజోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామంలోని ఇద్దరు యువకులు బోయ లక్ష్మన్న(22), బోయ మధు(20)లపై అనుమానాలు వ్యక్తం కాగా వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అయిజ మండలం వెంకటాపురం వద్ద వారిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాజోళి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. వివాహేతర సంబంధం.. గ్రామంలో ఆటో నడుపుతూ ఫిల్టర్ నీటిని సరఫరా చేసే బోయ లక్ష్మన్నకు మిషేక్ భార్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తనకు, తన ప్రియురాలికి మిషేక్ ఎప్పుడైనా అడ్డేనని భావించిన బోయ లక్ష్మన్న అతన్ని అడ్డు తొలగించేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న గొర్రెలకు కాపలాగా వెళ్లిన మిషేక్ తనతోపాటు ఉండే మిగతా వారికి భోజనం తీసుకువచ్చేందుకు చింతల్ క్యాంపు పరిసరాల నుంచి గ్రామంలోకి వచ్చి వెళ్తుండగా.. సీతారామయ్య తోట దగ్గర అతని కోసం ముందుగా వ్యూహం రచించుకుని సిద్ధంగా ఉన్న బోయ లక్ష్మన్న, బోయ మధు టవల్‌తో మిషేక్‌కు ఊపిరి ఆడకుండా టవల్‌తో మెడకు గట్టిగా బిగించారు. అనంతరం అతని ఛాతి, ముఖంపై బలంగా మోదడంతో ఊపిరి అందక మృతిచెందాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి తనగల శివారులో గల తుమ్మిళ్ల లిఫ్టు పైపులో పడేశారు. పైపులైన్ లోతు ఎక్కువగా ఉండటం, నాలుగు రోజులుగా మృతదేహం అందులోనే ఉండటంతో నల్లబడిపోయింది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల రైతులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు మిషేక్ మృతదేహంగా నిర్ధారించారు. ఈ విషయమై నిందితులు తెలిపిన వివరాల మేరకు మిషేక్ భార్యపై కేసు నమోదు చేశామని, పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. కేసును వేగంగా దర్యాప్తు చేసి ఛేదించిన శాంతినగర్ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, రాజోళి ఎస్ఐ శ్రీనివాస్, శిక్షణ ఎస్ఐ శ్రీహరిలను ఆయన అభినందించారు. -
‘ల్యాండ్’ కాని ఎయిర్‌పోర్టు
సాక్షి, దేవరకద్ర/ అడ్డాకుల : పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన స్థలాల అన్వేషణ ఇంకా కొలిక్కి రావడం లేదు. దేవరకద్ర నియోజకవర్గంలోనే ఎయిర్‌పోర్టు నెలకొల్పే అవకాశం ఉందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించినా ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న అంశం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. తాజాగా అడ్డాకుల మండలం గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించినా మరో రెండు, మూడు స్థలాలను ఎంపిక చేసి పరిశీలించాలని నిర్ణయించడంతో స్థల ఎంపికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గుడిబండ వద్ద స్థలాన్ని పరిశీలించిన తర్వాత దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో కొన్ని ప్రదేశాలను అధికారులు స్థల పరిశీలన నిమిత్తం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేవరకద్ర మండలంలోని చౌదర్పల్లి, మూసాపేట విభా సీడ్స్ కంపెనీ సమీపంలో, భూత్పూర్ మండలంలోని హెచ్‌బీఎల్ కంపెనీ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దేవరకద్ర, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో ఏదో ఒకచోట ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గుడిబండ ఆశలు ఆవిరేనా..? గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు కోసం అధికారులు పరిశీలించిన స్థలంలో రెండు ప్రధాన విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ స్థలాన్ని పరిశీలించిన సందర్భంలో విద్యుత్ లైన్‌పై చాలాసేపు అధికారులు చర్చ చేశారు. లైన్ మార్పు చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించిన తర్వాత ఇతర ప్రాంతాల్లో స్థలాలను చూడాలని నిర్ణయించారు. దేవరకద్ర సమీపంలో ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో గుడిబండ వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి ప్రకటన తర్వాత.. 2018 మార్చి 27న జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే మొదట అధికారులు గుడిబండ వద్ద స్థల పరిశీలన చేశారు. తర్వాత మూసాపేట మండలంలోని తుంకినిపూర్, వేముల, దాసర్పల్లి గ్రామాల వద్ద స్థలాలను చూశారు. ఆ తర్వాత భూత్పూర్ మండలంలోని రావులపల్లి వద్ద కూడా స్థలాలను పరిశీలించారు. స్థలాలకు సంబంధించిన మ్యాపులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఎయిర్‌పోర్టు అధికారులు అప్పట్లో స్థల పరిశీలనకు రాకపోవడంతో ఎయిర్‌పోర్టు అంశం మూలకు పడింది. తాజాగా మళ్లీ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై అధికారులు స్థలాలను పరిశీలిస్తుండటంతో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. జాతీయ రహదారికి సమీపంలో.. విమానాశ్రయం ఏర్పాటుకు స్థల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రోడ్డు మార్గం కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎయిర్ పోర్టుకు జాతీయ రహదారి దగ్గరగా ఉండాలని ఏవియేషన్ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలు మాత్రమే హైవేకు దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ మూడు మండలాలనే పరిగణలోకి తీసుకుంటే గుడిబండనే అన్నింటికీ అనుకూలంగా ఉండనుంది. ఒకవేళ రవాణా మార్గాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుంటే దేవరకద్ర మండలం వైపు అధికారులు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్అండ్బీ అధికారులు ఇటీవల పరిశీలించిన స్థలాల వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. -
వేలం వేయరు.. దుకాణాలు తెరవరు
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ దుకాణాలకు అధికారులు, పాలకులు వేలం వేయడంలేదు.. దుకాణాలను తెరవడంలేదు. ఫలితంగా సర్కారు ఖజానాకు చిల్లు పడుతోంది. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో రూ.1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన 28 దుకాణాలను, అలాగే కూరగాయల మార్కెట్లో రూ.38 లక్షల వ్యయంతో 16 దుకాణాలను నిర్మించారు. వాటిని గతేడాది ఫిబ్రవరి 17న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆ దుకాణాలకు వేలం వేయకుండా తెరవకుండా ఉండటంతో మార్కెట్ యార్డుకు దాదాపు ఇప్పటివరకు రూ.30 లక్షల మేర ఆదాయం రాకుండా పోయింది. గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడో? మార్కెట్‌యార్డు పాలకవర్గాన్ని పొడగించేందుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఏడాది కాలంలో పాలకవర్గం షాపింగ్కాంప్లెక్స్లోని దుకాణాలను వేలం వేయడంలో విఫలమైంది. ఈ అంశం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. వారంరోజుల్లో టెండర్లకు ఆహ్వానిస్తామని అధికారులు అంటున్నారు. వ్యాపారులు ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జోరందుకున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలు తొలగించారు. వ్యాపారస్తులకు సిద్ధంగా ఉన్న దుకాణాలు కావాలంటే నూతనంగా నిర్మించిన ఈ దుకణాలే దిక్కు. వాటిని ఎప్పుడు వేలం వేస్తారోనని ఏడాదిన్నరగా వేచి ఉన్నారు. రూ.30 లక్షల ఆదాయం పోయినట్టే.. మార్కెట్ విలువను బట్టి రైతుబజార్‌లోని 16 దుకాణాల సముదాయంలో ఒక్కొక్కదానికి రూ.2,200, వాణిజ్య సముదాయ దుకాణాలకు ఒక్కొక్క దానికి రూ.5,200 సర్కార్పాటను వేలానికి సిద్ధం చేశారు. కానీ రూ.5,200 అద్దె ఎక్కువ అవుతుందని వాటిని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించాలని ఇంతవరకు దుకాణాలకు వేలం నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం వేలం వేసిన తర్వాత ఆ దుకణాలకు టెండర్లు ఎవరూ వేయకపోతే మళ్లీ రెండోసారి పిలవడం అప్పుడు రానట్లయితే మూడోసారి టెండర్లను రీకాల్చేస్తూ అద్దెలో మార్పులు చేర్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దుకాణాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో టెండర్లను ఇదివరకే పిలిచి ఉంటే ఇప్పటివరకు మార్కెట్‌కు రూ.30 లక్షల ఆదాయం వచ్చేది. ఇకనైనా పాలకులు, అధికారులు పట్టించుకుని వేలం వేసి దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
మాకోద్దు బాబోయ్
బాలానగర్ (మమబూబ్‌నగర్) : ప్రస్తుతం ఉన్న పరిశ్రమతోనే ఎంతో కాలుష్యం వెలువడుతుందని, చెట్లు సైతం నల్లగా దుమ్ముతో కమ్ముకుంటున్నాయని, ఇక కొత్త పరిశ్రమ మాకు వద్దే వద్దంటూ గ్రామస్తులు వెల్లడించారు. మండలంలోని గుండేడ్‌లో ప్రస్తుతం ఉన్న దిలీప్ రోలింగ్ మిల్ పరిశ్రమను విస్తరించేందుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ క్రాంతి, పొల్యూషన్ బోర్డు ఈఈ దయానంద్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిశ్రమ సైతం నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని, మొదట ఆ పరిశ్రమను తొలగించాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్కరికో ప్రయోజనం ఉందని వేల సంఖ్యలోని ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సైతం పరిశ్రమ యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలో అనుమతి కంటే 5 రెట్లు ఎక్కువ ఉత్పత్తిని చేస్తున్నా రికార్డులలో చూపడం లేదని, వెలువడుతున్న కాలుష్యంతో అటు గాలి, ఇటు నీరు కలుషితమవుతుందని దీంతో ప్రజలు, జీవాలు మృత్యువాత పడుతున్నాయని అన్నారు. పరిశ్రమతో అంతర్గతనీరు కలుషితమై పంటలు పండించడానికి ఉపయోగం లేకుండా పోయాయన్నారు. నిబంధనలకు తూట్లు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, జడ్చర్ల ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశ్రమ యాజమాన్యంతో కుమ్మకై నియమ, నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. పరిశ్రమ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వరకు సర్వే నిర్వహించాల్సిన అధికారులు, గ్రామంలో పరిశ్రమ ప్రతులను ఎజెండాను తెలుగులో, ఇంగ్లిష్‌లో ప్రచురించి గ్రామంలో పంచాలని, అలాంటిది ఏమీ లేకుండా ప్రజలను మోసం చేశారన్నారు. పరిశ్రమలో సుమారు 30 శాతం పచ్చదనం ఉండాలని కేవలం 5, 6 చెట్లు మాత్రమే పరిశ్రమలో ఉన్నాయని అన్నారు. పరిశ్రమ వారు అధికారికంగా 90శాతం పొల్యూషన్ ఉన్నా రెడ్ క్యాటగిరిలో ఉండాల్సిన పరిశ్రమను ఆరెంజ్ పరిశ్రమగా తప్పుడు లెక్కలు చూ పారని అన్నారు. పరిశ్రమకు ప్రతి నిత్యం పదుల సంఖ్యలో వ్యవసాయ బోర్ల నుండి నీటిని తరలిస్తున్నా ఎలాంటి చర్యలు ఎం దుకు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యం 2శాతం ఆదాయాన్ని ప్రజాసేవకు ఎక్కడ ఖర్చుచేశారో రికార్డులు సమర్పించాలని అన్నారు. 360 మంది కార్మికులు ఉన్నా ఈఎస్ఐ, పీఎఫ్‌లు ఎంతమందికి ఉన్నా యో తెలపాలన్నారు. రికార్డులను తక్కువ చెబుతూ అటు ప్రభుత్వానికి టాక్స్ రూపంలో దోపిడీ చేస్తున్నారని అన్నారు. పరిశ్రమకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న టీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్స్ మాట్లాడుతూ.. పరి శ్రమ వారు వదిలే కాలుష్యంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం భారిన పడుతున్నారని అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లుతోపాటు ఇతర అధికారులు, వందల సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
పాదయాత్రతో.. ప్రగతి భవన్ ముట్టడికి
సాక్షి, మహబూబ్‌నగర్ : బిజినేపల్లి మండలంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా హెచ్‌సీఏ కంపెనీ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత నెల 27న ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్ర చేపట్టడంతో తిమ్మాజిపేట సమీపంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని.. లేకుంటే తమతోపాటే పాదయాత్రలో పాల్గొంటానని చెప్పడంతో నిర్వాసితులు ప్రగతి భవన్ ముట్టడికి 15 రోజుల విరామం ప్రకటించారు. 20 రోజులైనా ఎమ్మెల్యే చెప్పిన హామీ నెరవేరకపోవడంతో ఐదురోజులుగా రిజర్వాయర్ పనులను అడ్డుకొని ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో గత నెల ఎక్కడైతే పాదయాత్ర విరమించారో అక్కడి నుంచే ప్రగతిభవన్ ముట్టడికి పాదయాత్రగా బయలు దేరుతామని ప్రకటించారు. సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన పాదయాత్రకు కొన్ని అవంతరాలు ఎదురైన ముంపు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తిమ్మాజిపేట సమీపంలోని గుమ్మకొండ వరకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా మర్రికల్ గ్రామ సమీపంలోని నాగర్‌కర్నూల్ జిల్లా పరిధి దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. పలువురి సంఘీభావం.. రైతురాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ, జనసేన నాయకుడు లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ స్వరాష్టంలో రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో రైతులకు ఇచ్చిన పరిహారాన్ని తమకు ఇవ్వమని కోరుతున్నామని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతుంటే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు రమేష్‌నాయక్ సంఘీభావం ప్రకటించారు. రోడ్డుపైనే రైతుల రాస్తారోకో రైతుల పాదయాత్ర జడ్చర్ల శివారులో పోలీసులు అడ్డుకోవడంతో యుద్ధరంగాన్ని తలపించింది. తిమ్మాజిపేట మండలం మరికల్ దాటి జడ్చర్ల మండలం బూర్గుపల్లి శివారులోకి రాగానే నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ డీఎస్పీలు లక్ష్మీనారాయణ, భాస్కర్‌తోపాటు పలువురు సీఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు అడ్డుకోవడంతో రైతులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. పాదయాత్రలో ఉన్న రైతురాజ్యం పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, నాగర్‌కర్నూల్ జనసేన నాయకుడు లక్ష్మణ్‌గౌడ్, రైతులు ఉమేష్, ప్రవీణ్, శ్రీనునాయక్, ఘమ్లీలతోపాటు పలువురిని పోలీసులు అరెస్టుచేసి వాహనాల్లో జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ కడుపుల్లో మట్టికొడుతున్నారని, సీఎంతో మాట్లాడే అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. పోలీసులు వారి మాటలు పట్టించుకోకుండా అరెస్టు చేస్తుండటంతో పలువురు రైతులు పొలాల వెంట పరుగులు తీసి తప్పించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు 67 మంది నిర్వాసితులను రెండు డీసీఎంలలో బలవంతంగా ఎక్కించి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు, మరికొందరిని మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాదయాత్రికుల వెంట ఉన్న ట్రాక్టర్లను, పాదయాత్రలో భాగంగా రైతులు వంటావార్పు చేసుకునేందుకు సామగ్రిని తీసుకువచ్చిన వాహనాలను సైతం పోలీసులు స్వాధీనపర్చుకోవడం ఆందోళనకారులకు ఆగ్రహం తెప్పించింది. ఆందోళనలు కొనసాగిస్తాం.. పాదయాత్ర సందర్భంగా తిమ్మాజిపేటలో కొద్ది సేపు విలేకరులతో నిర్వాసితులు మాట్లాడారు. ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన పరిహారం తరహాలోనే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిహారం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పరిహారం వచ్చే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. -
పంచాయతీలకు పగ్గాలు
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పూర్తిస్థాయిలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా పనుల పర్యవేక్షణ, గుర్తింపు బాధ్యతలను గ్రామ పాలక వర్గాలకు ఇవ్వనుంది. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుంచే ఈ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని నిర్ణయించినా వరుస ఎన్నికల నేపథ్యంలో వీలుకాలేదు. ప్రస్తుతం అవి పూర్తి కావడంతో త్వరలోనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త విధానంలో ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ కీలకం కానున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా గ్రామాలకు ఏయే పనులు కావాలో, ఎంతమంది కూలీలు అవసరమో, ఏ పనులు చేపడితే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందో పాలక వర్గాలు సమగ్రంగా చర్చించిన తర్వాతే పనులను కేటాయిస్తారు. ఇంతవరకు ఈ పనుల్లో కీలకంగా వ్యవహరించిన మండల పరిషత్‌లు ఇక కేవలం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం వరకే పరిమితం కానున్నాయి. పనుల గుర్తింపు, చేపట్టిన వాటిని పూర్తి చేయడంలో పంచాయతీలు కీలకపాత్ర పోషిస్తాయి. మరోవైపు ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకు ప్రభుత్వం ఫిర్యాదల పెట్టె ఏర్పాటు చేస్తారు. ప్రజలు, కూలీలు, రైతులు ఎవరైనా పనుల్లో చోటు చేసుకునే లోపాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. దీనిపై ఇప్పటికే డీఆర్డీఓలకు పంచాయతీరాజ్ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇది క్షేత్రస్థాయిలో అమలైతే మరింత ప్రయోజనం చేకూరనుంది. ఉపాధి హామీలో పారదర్శకత 2005 నుంచి ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూనే ఉంది. మండల పరిషత్తు అధికారుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నా.. గ్రామీణ స్థాయిలో మాత్రం పారదర్శకత లోపించింది. పలుచోట్ల అవతవకలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పనులు చేపట్టకున్నా జరిగినట్లు రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని భావిస్తోంది. గతంలో మట్టిపనులకే పరిమితమైన ఈ పథకంలో వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉండే పనులను సైతం చేపడుతుంది. పూడికతీత, సేద్యపు కుంటలు, కాల్వలు, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడుగుంతలు, వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు చెక్‌డ్యాంల నిర్మాణం, హరితహారం వంటి 74 రకాల పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ పనులను ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేసి.. వాటి నిర్వహణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. 6.85లక్షల జాబ్‌కార్డులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,698 గ్రామ పంచాయతీల్లో 6,85,377 లక్షల జాబ్‌కార్డులు, 14,73,999లక్షల మంది కూలీలు ఉన్నారు. కొత్త విధానం ప్రకారం పనులన్నీ గ్రామ పంచాయతీల వారీగా జరుగుతాయి. పాత గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. కొత్త పంచాయతీల్లో కార్యదర్శే ఉపాధిహామీని పర్యవేక్షించనున్నారు. అలాగే కూలీలకు వేతన స్లిప్‌లను వారు అందజేస్తారు. పనులు లేనప్పుడు గ్రామ పంచాయతీకి వెళ్లి అడిగితేవెంటనే ‘ఉపాధి’కి చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చేపట్టాల్సిన పనులను గుర్తించి నామమాత్రంగా గ్రామ సభ నిర్వహించి వాటికి ఆమోదం పొందినట్లు రికార్డులు నమోదు చేసేవారు. ఇకపై అలాంటి వాటికి చెక్ పడనుంది. పంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను గుర్తిస్తారు. ఆ తర్వాతా గ్రామసభ నిర్వహించి అవసరమైన వాటికే ఆమోదం తెలుపుతారు. ఇలా చేయడం వల్ల సకాలంలో పూర్తి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పనులను పంచాయతీలకు అప్పగిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ పంచాయతీల వద్దే ఉంటారు. ఉదయం ఏడు గంటలకే కూలీలకు అందుబాటులోకి రావాలి. ఇందుకోసం అతనికి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేస్తారు. అందులో పనికి సంబంధించిన రికార్డులు, కూలీల హాజరు రిజిస్టర్లు, ఇతర ఫైళ్లు ఉంటాయి. వాటిని సర్పంచి, పంచాయతీ కార్యదర్శి తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె గ్రామీణ నిరుపేదలకు కనీస పనిదినాలు కల్పించే ఈ ఉపాధిహామీ పథకంలో ఇక నుంచి మండల పరిషత్ ఆజమాయిషీ తగ్గి పంచాయతీ పాలక వర్గాలకే పూర్తి పర్యవేక్షణ ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఏయే పనులు చేపడితే కూలీలకు ఉపాధి దొరుకుతుందో వాటిని మాత్రమే చేసేలా చర్చించాలి. గతంలో కొన్ని చోట్ల అవసరం లేని పనులు సైతం చేపట్టడంతో ప్రజాధనం వృథా అయింది. కోట్లాది రూపాయలు వెచ్చిం చినా గ్రామీణులు సంపూర్ణమైన ఫలితాలు పొందలేక పోయారనే ఫిర్యాదులు వచ్చాయి. ఉపాధిహామీ పనుల్లో అవినీతి, అక్రమాలను నివారించేందుకుగాను గ్రామ పంచాయతీల్లో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయనున్నారు. -
యువకుడి ప్రాణం తీసిన పరిషత్ ఎన్నికలు
-
నాకు భయపడే కేసీఆర్ ముందస్తుకెళ్లారు: మోదీ
సాక్షి, భూత్పూర్ (మహబూబ్‌నగర్) : తనకు భయపడే తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంటు ఎన్నికలతో కలుపుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతారని జ్యోతిష్యుడు చెప్పడంతోనే కేసీఆర్ ముందుస్తుకు అడుగేసారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘మీ ఆశీర్వాదం పొందడానికి మళ్లీ వచ్చాను. ఐదేళ్లు రేయింబవళ్లు కష్టపడ్డాను. చౌకీదారుగా 60 నెలలు నా పనితీరును చూశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. గతంలో దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవి. గత ఐదేళ్లలో పేలుళ్లు జరగకుండా చూశాం. ఉగ్రవాదన్ని కశ్మీర్‌కే పరిమితం చేశాం. దేశ భద్రత, అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తోంది. తెలంగాణలో ముందుస్తు ఎన్నికలు ఎందుకు జరిపారో అర్థం కావడం లేదు. జ్యోతిష్యులు చెప్పినట్టు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాధనం వృథా అయ్యేది కాదు. తెలంగాణ ప్రజల భవితను నిర్ణయించుకోవాల్సింది వాళ్లా ..? లేక ఓ జ్యోతిష్యుడా? దేశ అభివృద్ధితో పాటు తెలంగాణ భవిత కోసం బీజేపీతో కలిసి రండి. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకే గూటి పక్షులే. సర్జికల్ దాడులపై ఆధారాలు అడిగి కాంగ్రెస్ తన నీచ రాజకీయాలను రుజువుచేసుకుంది. నీతి మాలిన రాజకీయాలు నడిపిన కాంగ్రెస్‌ను జనం సాగనంపుతున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. కేసీఆర్‌ను గెలిపించిన పాలమూరు ప్రజలను మర్చిపోయారు. తమ స్వప్రయోజనాల కోసమే టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయి. నేడు పాలమూరును నిర్లక్ష్యం చేసిన వాళ్లు ఒకవైపు ఉంటే.. పాలమూరు ప్రజల పక్షాన నిలిచిన మేం మరోకవైపు ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం జాతీయ రహదారులు, కొత్త రైల్వే లైన్లు, నిధులు కేటాయించాం. మునిరాబాద్ టూ సికింద్రాబాద్ రైల్వే లైన్.. సికింద్రాబాద్ టూ పాలమూరు డబుల్ లైన్ ఏర్పాటు చేశాం.. మా పథకాలన్ని కేసీఆర్ తానే చేశాని చెప్పుకుంటున్నారు. దేశంలో కోటిన్నర మందికి ఇళ్లు కట్టించాం’ అని మోదీ తెలిపారు. -
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేడెక్కిన రాజకీయం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గెలుపే లక్ష్యంగా వ్యూహరచనలో నిమగ్నం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం కాంగ్రెస్ నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎంపికపై ఢిల్లీకి చేరిన ‘స్థానిక’ లొల్లి ఇంతవరకు కానరాని బీజేపీ జోష్ టికెట్ల కోసంఆశావహుల ప్రయత్నాలు... ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల్లో మరింత చలనం వచ్చింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. త్వరలోనే అభ్యర్థుల ప్రకటన ఉండడంతో టికెట్టు కోసం యత్నాలు ముమ్మరం చేశారు. అనంతరం వ్యవహరించాల్సిన వ్యూహంపై ఇప్పట్నుంచే ఆయా పార్టీల్లో చర్చలు ఊపందుకున్నాయి. రాజధానిలో సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున జిల్లాలోని మహబూబ్‌నగర్ ఎంపీ స్థానానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ స్థానానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడమేగాక లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఎమ్మెల్యేలూ పనిచేయాలని ఆదేశించారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరలేపిన గులాబీ పార్టీ ఈనెల 9న నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వనపర్తిలో తొలి సన్నాహకసదస్సును నిర్వహించింది. దీనికి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలాఉండగా ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలపై దృష్టి సారించిన పార్టీ అధినేత అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను ఆరా తీస్తున్నారు. మహబూబ్‌నగర్ నుంచి ప్రస్తుత ఎంపీ జితేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి సీనియర్ నాయకుడు పోతుగంటి రాములు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన మరుసటిరోజు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి రచ్చకెక్కింది. నాగర్‌కర్నూల్ ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య స్థానికేతరుడనీ ఆయనకు టికెట్ వద్దని స్థానికులకే అవకాశం ఇవ్వాలంటూ ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీభవన్ ఎదుట ఆందోళనకు దిగిన ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు తాజాగా సోమవారం ఢిల్లీకి చేరుకుని అక్కడి ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇటీవల అసెంబ్లీ ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతిని లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరి స్తున్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సవాలుగా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు జా ప్యం చేసిన ఆ పార్టీ ఈసారి పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌కు, అధికార టీఆర్ఎస్ పార్టీ కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించినా.. ఇంతవరకు ప్రకటించలేకపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాగర్‌కర్నూల్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే చర్చ పార్టీ శ్రేణుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికే దాదాపు టికెట్టు ఖరారవుతుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాగర్‌కర్నూల్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ నంది ఎల్లయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో పాటు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సతీష్ మాదిగ పేర్లు సైతం ఏఐసీసీ పరిశీలనలో ఉన్నాయి. కమలంలో కానరాని జోష్! లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్, టీఆర్ఎస్ సమాయత్తమవుతుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో మాత్రం జోష్ కానరావడం లేదు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఎవరిని ప్రకటిస్తుందో అనే చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా వ్యవహరిస్తున్న మహబూబ్‌నగర్ వాసి శాంతికుమార్ రేసులో ఉన్నారు. అధిష్టానం సైతం ఆయనకు టికెట్టు ఖాయం చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ కూతురు, ఎస్సీమోర్చా జాతీయ కార్యదర్శి శృతి నాగర్‌కర్నూల్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్-టీఆర్ఎస్లది డమ్మీ పోరాటం: మోదీ
సాక్షి, మహబూబ్ నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్లది డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లాంటి డమ్మీ పోరాటమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాలమూరు ప్రజలకు నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టిన మోదీ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘పాలమూరు అంటే పాలు, పెరుగుల సంగమస్థలని అర్థం. అలాంటి ప్రాంతం ఇప్పుడు కరువుతో అల్లాడుతోంది. పాలమూరులో వలసలెందుకు పెరిగాయని గత పాలకులను ప్రశ్నించాలి. కృష్ణా, తుంగభద్ర ప్రవహించినా.. ఈ నేల ఎందుకు ఎండిపోతుంది? ఒకే కుంటుంబంతో తెలంగాణ వచ్చిందా? ఒక కుటుంబం కోసమే తెలంగాణ యువత బలిదానం చేసిందా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ స్వభావం ఒకటే. కాంగ్రెస్, టీఆర్ఎస్లు రెండు కుటుంబ పాలన పార్టీలే. గత నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో మీకిచ్చిన హామీలు నెరవేరాయా? కాంగ్రెస్, టీఆర్ఎస్లు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. మరోసారి ఆ పార్టీలకు అధికారమిస్తే.. తెలంగాణ కోసం ఉద్యమించి బలిదానాలు చేసిన వారి శ్రమ వృథా. తెలంగాణ అంధకారంలోనెట్టబడుతుంది. చంద్రబాబు, సోనియాగాంధీ సర్కార్లలో పనిచేసిన కేసీఆర్ వల్ల ఇలాంటి అభివృద్ధే జరుగుతుంది. తెలంగాణ మెట్రో.. కేంద్రం సాయం ద్వారానే పూర్తైంది. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కు పట్టం కడితే మన బతుకులు చీకటి మయమే. బీజేపీ హయాంలో ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తెలంగాణ-ఆంధ్ర రాష్ట్రాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.’ అని మోదీ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు వదల బొమ్మాళి అంటుండు: కేసీఆర్
సాక్షి, జడ్చర్ల : రాష్ట్ర విభజన జరిగినా చంద్రబాబు నాయుడు వదల బొమ్మాళి అంటున్నాడని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలమూరు జిల్లాను వలస జిల్లాగా మార్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు మరోసారి మహాకూటమి పేరుతో తెలంగాణలో చొరబడాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. ‘మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. కానీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు పదే పదే అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాశారు. అలాంటి చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. డిపాజిట్ రాకుండా ఓడగొట్టి చంద్రబాబుకు బుద్ది చెప్పాలి. ఇక్కడి కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రాజెక్ట్‌పై 35 కేసులు వేసారు. భూసేకరణ విషయంలో ప్రజలకు అపోహలు సృష్టించి ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగడుగున అడ్డుపడ్డారు. పాత పాలమూరు జిల్లాను పాలన సౌలభ్యం కోసం నాలుగు జిల్లాలు చేసుకున్నాం. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ను గెలిపించాలి. అప్పుడు 20 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి చూపిస్తా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చే రూ. 200 పింఛన్‌కు రూ.1000 ఇస్తానంటే.. అందరూ ఎలా ఇస్తావని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే అన్న మాట ప్రకారం ఇచ్చాం. మళ్లీ ఫించన్లు పెంచుతాం. ప్రపంచంలోనే ఎక్కడ లేని గొప్ప స్కీం రైతు బంధు.. వచ్చే ఏడాది నుంచి ఈ స్కీం కింద ఎకరానికి 10వేలు ఇస్తాం. రైతుల గిట్టుబాటు కోసం అద్భుత కార్యాచరణ చేశాం. కంటి వెలుగు, కేసీఆర్ కిట్‌తో ప్రజలకు అండగా నిలిచాం. మీ జిల్లా మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలోనే అద్భుతంగా ఈ పథకాలు కొనసాగుతున్నాయి. ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ పిల్లాడికి రూ.12 వేలిస్తూ.. అమ్మ ఒడి వాహనాల్లో ఇంటికి చేర్చుతున్నాం’ అని కేసీఆర్ తమ ప్రభుత్వ పథకాలను వివరించారు. -
జోరుగా ఇంటింటి ప్రచారం
చిన్నచింతకుంట: మండలంలోని అల్లీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లి ప్రతిఒక్కరికి తెలియపర్చి టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యమన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయకపోగ ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేశామని ప్రగల్భాలు పలకడం పరిపాటిగా మారిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేణుగోపాల్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ధనంజయ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకటేష్, రాష్ట్ర ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి అక్బర్, నాయకులు రహ్మత్, సురేష్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శులు మహిపాల్‌రెడ్డి, సురేష్, ఖాజామైనొద్దీన్, గ్రామ అధ్యక్షుడు కృష్ణయ్య, మహేందర్‌రెడ్డి, నర్సింహ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి. భూత్పూర్: కాంగ్రె‹స్ పార్టీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని హస్నాపూర్‌లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరిగి మేనిఫెస్టోపై వివరించారు. చేయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏకకాలంలో రైతులకు రుణమాఫీ, పేదదలకు ఉచిత కరెంట్, ఏడు కిలోల సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవరకద్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫసియొద్దీన్, çహర్యానాయక్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్ర్రీకాంత్రెడ్డి, దేవరకద్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాధిక్, నాయకులు సంజీవ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. అడ్డాకుల: మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఓటర్లకు వివరించి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్లను రూ.2 వేలకు, వికలాంగుల పింఛన్లను రూ.3 వేలకు పెంచనున్నట్లు ఓటర్లకు వివరించి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, మండల కోఆప్షన్ సయ్యద్‌షఫి, రిటైర్డ్ ఏఈ లక్ష్మీనారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు, నాయకులు దశరత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, సాయిరెడ్డి, వెంకట్‌రెడ్డి, బుచ్చన్న, రవిసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
బిల్లులు అందేనా!
సాక్షి, మల్దకల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలందరికీ సకాలంలో కూలి డబ్బులు అందక, కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. పనులు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో కూలీలు డబ్బులు రాక, పనులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో మండలంలోని ఉలిగేపల్లిలో దాదాపు 200 మంది కూలీలు కూలి పనులు, వ్యవసాయ పొలాలను చదును చేయడం, ముళ్లచెట్లను తొలగించడంతో పాటు వివిధ ఉపాధి హామీ పనులు చేయగా.. రూ.3 లక్షల 90 వేలకు పైగా బిల్లులు అందాల్సి ఉంది. పనులు చేసిన కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఖాతాలో డబ్బులను జమ చేయకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు కూలీలు గతంలో ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో విచారణ జరిపించి కూలీలకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు కూలీలు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంకుడు గుంతల పరిస్థితి... అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఉలిగేపల్లిలో 125 మరుగుదొడ్లు, అమరవాయిలో 40 మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోగా.. లబ్ధిదారులకు నేటికీ బిల్లులు అందలేదు. వారితో పాటు నిర్మించుకున్న కొంత మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగా.. మిగిలిన వారికి నేటివరకు అందలేదు. దాదాపు రూ.2 లక్షలకు పైగా మరుగుదొడ్ల బిల్లులు, లక్షకు పైగా ఇంకుడు గుంతల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం లబ్ధిదారులు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. మంజూరైన వెంటనే జమచేస్తాం.. ఉలిగేపల్లిలో ఉపాధి కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. మంజూరైన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. అదే విధంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు బిల్లులు విషయమై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. – రాజారమేష్, ఎంపీడీఓ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది.. గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు బిల్లులు చెల్లించలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. ఇక వస్తాయన్న ఆశ సన్నగిల్లింది. అధికారులు స్పందించి కూలీలు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. – రాముడు, ఉలిగేపల్లి మరుగుదొడ్లు బిల్లు ఇస్తాలేరు.. ఉలిగేపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.12 వేలు అందజేస్తామని చెప్పారు. దీంతో అప్పులు చేసి మరీ నిర్మించుకున్నాం. ఇప్పటి వరకు బిల్లులు అందించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మరుగుదొడ్ల బిల్లులు అందిస్తే బాగుంటుంది. – నర్సింహులు, ఉలిగేపల్లి -
ఓటు యంత్రం.. అవగాహన మంత్రం
సాక్షి, కల్వకుర్తి టౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న ప్రాధాన్యం ప్రతీ ఒక్కరికి తెలిసేలా అధికార యంత్రాం గం ఊరురా విసృత్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒకవైపు రాజకీయ నాయకులు తమకే ఓటు వేయాలని ప్రచారం చేస్తుండగా, మరోవైపు అధికారులు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈవీఎం ద్వారా ఓటు వేసిన తర్వాత ఎవరికీ ఓటు పడిందో తెలుసుకునేలా కొత్తగా ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్ యంత్రాలను ఎన్నికల కమిషన్ వినియోగిస్తోంది. రెవెన్యూ అధికారులు, బీఎల్ఓలు గ్రామగ్రామాన ఈవీఎం, వీవీప్యాట్లపై ప్రచారం చేస్తున్నారు. కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని అన్ని బూత్‌ల పరిధిలో ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రదేశాల వద్ద అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీఓలు, బూత్ స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఏకేపీ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రయోగాత్మకంగా ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్నారు. ఎలా ఓటు వేయాలి.. ఎవరికి ఓటు వేశామన్నది వీవీ ప్యాట్ల ద్వారా ఎలా తెలుస్తుందో ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఓటు ఎవరికి వేశాం?! ఈసారి ఎన్నికల సంఘం కొత్తగా వీవీ ప్యాట్ యంత్రాలను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ప్రక్కనే ఉన్న వీవీ ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు వేసిన గుర్తు అందులో కనిపిస్తుంది. దీంతో ఓటరు సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు వీవీ ప్యాట్లు ఉపయోగపడుతాయని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అవగాహన కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో అన్నిల పోలింగ్‌బూత్ వద్ద ఈవీఎం, వీవీ ప్యాట్ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే, వారి నుండి స్పందన కూడా బాగుంది. ప్రతీ బూత్ వద్ద బీఎల్ఓలు, ఆయా బూత్‌ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కార్యక్రమంపై ప్రజల నుండి వస్తున్న స్పందనతో ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. – రాఘవేందర్, కల్వకుర్తి ఎన్నికల డీటీ ప్రతిఎన్నికల్లో ఓటు వేస్తున్నా.. నేను గత ఎన్నికలతో పాటుగా అంతకుముందు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నా. పాత రోజుల్లో ఓటుకు చాలా విలువ ఉండేది. ప్రస్తుతం చాలా మంది ఓటుకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మొన్నటి వరకు ఈవీఎం యంత్రంలో ఓటు వేశా, ఇప్పుడు కొత్తగా వీవీ ప్యాట్‌లో ఓటు వేసిన గుర్తు ఏడు సెకన్ల పాటు చూసుకునే అవకాశం బాగుంది. – రాజేష్‌కుమార్, కల్వకుర్తి వీవీ ప్యాట్ యంత్రంతో పారదర్శకత ఈసారి ఎన్నికల్లో ఈవీఎంతో పాటుగా మనం ఎవరికి ఓటు వేశామో తెలుసుకునే విధంగా వీవీప్యాట్ యంత్రాలను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టడం శుభపరిణామం. దీనితో గతంలో ఓటరు ఎవరికి ఓటు వేశాడో తెలియకపోయేది. ఈసారి వీవీ ప్యాట్ యంత్రం ద్వారా ఓటరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు. దీంతో ఎన్నికల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుంది. – భీమయ్య, కల్వకుర్తి -
‘తన నీడను చూసి టీఆర్ఎస్ భయపడుతోంది’
సాక్షి, హబూబ్ నగర్ : టీఆర్ఎస్ తన నీడను తానే చూసి భయపడుతోందని, నాయకులకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల, పాలమూరు యూనివర్సిటీని మంగళవారం కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2019లో టీఆర్ఎస్కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఏ వర్గాన్ని తీసుకున్నా తీవ్ర నిరాశతో ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి ఎజెండా ప్రక్కన బెట్టి.. కులాల వారీగా తాత్కాలిక ప్రయోజనాల కోసం పనులు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలలో పార్టీ క్యాడర్ విస్తృతంగా పర్యటించి సమస్యలను గుర్తిస్తున్నదని చెప్పారు. అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శిస్తానని వెల్లడించారు. నాలుగేళ్లుగా ఒక్క టీచర్‌ను కూడా విశ్వవిద్యాలయాలలో నియమించలేదని తెలిపారు. అన్నింట్లోనూ నిధుల కొరత ఉందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
బతకాలని ఉంది
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకుంటున్న ఆ బాలుడిపై విధి కన్నెర్రజేసింది. కన్నవారి కలలు నిజం చేయాలన్న తన ఆశ నిరాశవుతుందేమోనని ఆ విద్యార్థి మనోవేదన చెందుతున్నారు. కళ్లముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకును కాపాడుకేందుకు ఆ పేద తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. చికిత్సకు రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో కొడుకు దీనస్థితిని చూడ లేక. వైద్యం చేయించే స్తోమతలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అకస్మాత్తుగా స్పృహతప్పడంతో మహబూబ్‌నగర్‌జిల్లా మద్దెలబండకు చెందిన నరసింహులు, పద్మల కుమారుడు సోమేష్(17) కొడం గల్లోని ఎంజేపీటీబీజీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు. టెన్‌్త(2016బ్యాచ్) పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. జనవరి 23న స్కూల్లో అకస్మాత్తుగా సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. మెరుగైన వద్య సేవల కోసం నిమ్స్‌కు తీసుకెచ్చారు. నాలుగు మాసాల పాటు ఇక్కడే ఉంచి చికిత్సలు అందించారు. కొడుకును బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని కూడా అమ్మేశారు. శక్తికి మించి అప్పులు కూడా చేశారు. అయినా వ్యాధి నయం కాలేదు. చికిత్సకు రూ.35 లక్షలకుపైగా ఖర్చు.. ఎలాగైనా కుమారుడిని కాపాడుకోవాలని నిర్ణయించిన తల్లిదండ్రుల ఇటీవల సీఎంసీ వెల్లూర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సోమేష్‌కు పలు పరీక్షలు చేయగా అప్లాస్టిక్ ఎనిమియా (ఫెయిల్యూర్ ఆఫ్ ఏటీజీ థెరపీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్సకు రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులన్నీ అమ్మిన వారికి వైద్య ఖర్చులు శక్తికి మించిన భారంగా మారాయి. కళ్లముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు దుస్థితిని చూడలేక.. ఖరీదైన ఈ వైద్యాన్ని చేయించే స్థోమతలేకఏం చేయాలో తెలియ ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటే తమ కొడుకుని కాపాడుకుంటామని వేడుకుంటున్నారు. సహాయం చేయదలిచిన దాతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎకౌంట్ నెంబర్ 62416044184లో జమ చేయవచ్చు. వివరాల కోసం 9600893382, 9441720449 నెం బరుకు ఫోన్ చేయవచ్చు. -
ప్రకృతి అందాల సోమశిల
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చూడచక్కని చోటు.. ఘాట్లలో ఒకటిగా మాత్రమే కాకుండా ప్రకృతి అందాలతో అలరించే చక్కటి వీకెండ్ స్పాట్ సోమశిల. ఏడో శతాబ్దానికి చెందిన ఆలయాలు, రెండు నదుల సంగమం.. ఇలా అనేక ఆకర్షణలు ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. – ఓ మధు సోమశిల.. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ స్థలం. ఇక్కడి నుంచే ఈ రెండు నదులు నల్లమల అడవుల్లోకి ప్రవేశిస్తాయి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలకు ప్రతీకగా ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి అనేక ప్రత్యేకతలు, అంతకు మించి ప్రశాంతత లభించే చోటు కావడంతో ఏడాది పొడువునా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకర్షించే ప్రదేశంగా మారింది సోమశిల. ఆధ్యాత్మికత.. ప్రకృతి రమణీయత ఏడో శతాబ్దానికి చెందిన లలితా సోమేశ్వర్ స్వామి ఆలయానికి సోమ, శుక్రవారాల్లో జనం అధికంగా వస్తుంటారు. శివరాత్రి, దసరా, దీపావళి, సంక్రాంతి, కార్తిక మాసం, తొలి ఏకాదశి... ఇలా పండుగ, సెలవుల దినాల్లో సందర్శకులు పోటెత్తుతారు. ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణ జోడించే క్రమంలో సోమశిల రిజర్వాయర్‌లో బోటింగ్ సదుపాయం కూడా కల్పించారు. అమరగిరి, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం దుర్గం గుహలు.. తదితర చుట్టు పక్కల ఉన్న సందర్శనీయ ప్రదేశాలను బోట్లో వెళ్లి చూడడం చక్కని అనుభూతిని అందిస్తుంది. రిజర్వాయర్ మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని నీటి నిలువ తగ్గినప్పుడు మాత్రమే చూడొచ్చు. అదే విధంగా కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. శిల్పాలు, దైవ ప్రతిమలతో ఉన్న మ్యూజియం కూడా ఉంది. వెళ్లడం ఇలా... నగరం నుంచి 180 కి.మీ దూరంలో, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి 99 కి.మీ దూరంలో ఉందీ టూరిస్ట్ స్పాట్. -
లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురికి గాయాలు
-
లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురికి గాయాలు
మహబూబ్‌నగర్ : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ఉల్లెంకొండ సమీపంలో 44వ జాతీయరహదారి పై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డోన్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని 108 సాయంతో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మా గ్రామాలను మహబూబ్‌నగర్‌లో కలపండి
మరికల్, మల్కాపూర్, కల్మన్‌కల్వ, చాకల్‌పల్లి, కొత్తపల్లి ప్రజల ఆందోళన కుల్కచర్ల: తమ గ్రామాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలని మండల పరిధిలోని మరికల్, మల్కాపూర్, చాకల్‌పల్లి, కల్మన్‌కల్వ, కొత్తపల్లి గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు గురువారం కుల్కచర్ల-నవాబ్‌పేట్ రోడ్డుపై గురువారం బైఠాయించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై టైర్లు వేసి కాల్చివేశారు. అనంతరం మరికల్లో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. తమ గ్రామాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కలిపే వరకూ ఆందోళన విరమించేది లేదని తీర్మానించారు. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో విలీన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక దగ్గర ఆందోళన చేయాలని తీర్మానించారు. విలీన కమిటీ.. విలీన కమిటీ చైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి (కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్) వైస్ చెర్మన్‌గా పాండురంగయ్య (వైస్ ఎంపీపీ) కన్వీనర్‌గా పాండురంగాచారి, సభ్యులుగా రాజు నాయక్ (మరికల్ సర్పంచ్), మెగ్యానాయక్ (మల్కాపూర్), చెన్నయ్య (కొత్తపల్లి), చిన్నరామయ్య(చాకల్‌పల్లి), కృష్ణాజీ, రామ్మోహన్‌శర్మ, నరేందర్‌ప్రసాద్, నర్సింలు, నిరంజన్, కృష్ణాచారి, ఉదయ్‌శంకర్, సత్తయ్య, వెంకటేష్, శ్రీనివాస్, నరేందర్‌లను ఎన్నుకున్నారు. -
మరికల్‌ను మహబుబ్‌నగర్‌లో కలపాలి
కుల్కచర్ల: మండలంలోని మరికల్ గ్రామాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలంటూ ఆదివారం ఆ గ్రామస్తులు పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కుల్కచర్ల- నవాబుపేట రోడ్డు పై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మండలంలో మరికల్ పెద్ద పంచాయతీ అన్నారు. నాలుగు అనుబంధ గ్రామాలు, గిరిజన తండాలు ఉన్నాయన్నారు. 10 వేల వరకు జనాభా ఉంటుందన్నారు. మరికల్ గ్రామానికి కుల్కచర్ల 24 కిలో మీటర్ల దూరంలో ఉంటుందన్నారు. అదే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం కేవలం 18కిలో మీటర్ల దూరం మాత్రమే ఉంటుందన్నారు.మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లాలంటే ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బస్సు సౌకర్యం ఉందని, కుల్కచర్ల మండలానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పాండురంగయ్య, యువజన సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. -
ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం
అలంపూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అలంపూర్‌కు చెందిన బీషమ్మ(29) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారు ఆభరణాల చోరీ
మహబూబ్‌నగర్: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల బస్టాండ్‌కు చేరుకున్న సమయంలో బస్సు ప్రయాణికుడు ఒకరు తన బ్యాగ్‌లోని 11 కిలోల బంగారు ఆభరణాలు కనిపించటం లేదని గుర్తించారు. దాంతో ఆ విషయాన్ని డ్రైవర్ చెప్పి... బస్టాండ్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోయింబత్తూరు నుంచి మొత్తం 15 కేజీల బంగారాన్ని తీసుకు వస్తున్నానని.... కానీ తన బ్యాగ్‌లో నాలుగు కేజీల బంగారం మాత్రమే ఉందని ఆ ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సదరు బంగారం మొత్తం హైదరాబాద్‌లోని జ్యూయలరీ షాపుకు తీసుకు వెళ్తున్నట్లు పోలీసులకు చెప్పారు. -
రూ.50 లక్షల ఎర్రచందనం పట్టివేత
జడ్చర్ల: అరటిగెలల మాటున ఎవరికీ అనుమానం రాకుండా రాష్ట్రాలు దాటిపోతున్న ఎర్రచందనాన్ని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. జడ్చర్ల సీఐ జంగయ్య కథనం ప్రకారం.. జడ్చర్ల మీదుగా లారీలో ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున జాతీయరహదారిపై తనిఖీలు నిర్వహించారు. వారు వెతుకుతున్న యూపీ 78ఏఎన్ 8185 నెంబర్‌గల డీసీఎం జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద శ్రీలక్ష్మీ నరసింహ దాబా వద్ద ఆగి ఉండడం గమనించారు. అనుమానంతో అక్కడికి వెళ్లి విచారణ చేస్తుండగా డ్రైవర్‌తోపాటు వెంట వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. చాలాసేపటి వరకు ఎవరూ రాకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని అటవీశాఖ సీసీఎఫ్ రమణారెడ్డి, డీఎఫ్ఓ నరేందర్, రేంజర్ మహేందర్లకు సమాచారం అందించారు. వారొచ్చి దుంగలను పరిశీలించి విలువను అంచనా వేశారు. డీసీఎం ఉత్తరప్రదేశ్ సీరియల్ నంబర్‌గా ఉన్నా కర్ణాటక రాష్ట్రం బళ్లారీలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా విచారణలో తేలిందని తెలిపారు. -
అంబరాన్నంటిన పూల సంబురం
బతుకమ్మ పండుగను మహిళలు రెండోరోజూ ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బతుకమ్మ ఆటల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు. ఒక్కేసి పువ్వేసి.. చందమామ.. రాశి పడబోసి చందమామ రాశి కలుపుదాం రావె చందమామ రత్నాలగౌరు చందమామ నీరాశి కలుపుల్లు మేం కొలువమమ్మ తీగతీగెల బిందె రాగితీగెల బిందె నీనోము నీకిత్తునే గౌరమ్మ నానోమునాకీయవే గౌరమ్మ అదిచూసిమాయన్న గౌరమ్మ ఏడుమేడలెక్కిరి గౌరమ్మ ఏడు మేడలమీద పల్లెకోటల మీద పల్లెకోటల మీద పత్రీలు కోయంగ దొంగలెవరో దోచిరీ గౌరమ్మ బంగారు గుండ్లపేరు గౌరమ్మ దొంగతో దొరలందరూ గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ రెండేసి పూలేసి రాశి పడబోసి గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ మూడేసిపూలేసి రాశిపడబోసి గౌరమ్మ బండ్లతో బయలెల్దురూ గౌరమ్మ బతుకమ్మ ఆటపాటలతో పాలమూరు జిల్లా హోరెత్తుతోంది. వేడుకలను అంబరాన్ని అంటేలా నిర్వహిస్తున్నారు. గురువారం రెండోరోజు అటుకుల బతుకమ్మను చేసి సంబురాలు జరిపారు. మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నూ ఉద్యోగినులు బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. పూలు సుఖ సంతోషాలకు ప్రతీకలు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పూలు సుఖ సంతోషాలకు ప్రతీకల, రకరకాల పూలతో నిర్వహించే బతుకమ్మ పండుగ ఎంతో శక్తితో కూడుకున్నదని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలోని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం తీసుకొచ్చిన నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథి గా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. జేసీ శర్మన్ మా ట్లాడుతూ పెద్దలు అందించిన పూర్వ పండుగలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళలను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఏజేసీ రాజారాం పున్న, డీఈఓ చంద్రమోహ న్, ఆర్వీఎం పీఓ కుసుమకుమారి, ఏఎంఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ట్యాంకర్,ఇద్దరు మృతి
-
మహబూబ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
మహబూబ్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
మహబూబ్‌నగర్: మహబూగ్నగర్ జిల్లాలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూరాల 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మంటలు అంతకంతకూ వ్యాపిస్తూ భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యల్లో పాల్గొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా భారీ నష్టం వాటిల్లింది. కోట్ల రూపాయిల్లో ఉంటుందని భావిస్తున్నారు.