
చికిత్స పొందుతున్న సోమేష్
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబంలో పుట్టి బాగా చదువుకుంటున్న ఆ బాలుడిపై విధి కన్నెర్రజేసింది. కన్నవారి కలలు నిజం చేయాలన్న తన ఆశ నిరాశవుతుందేమోనని ఆ విద్యార్థి మనోవేదన చెందుతున్నారు. కళ్లముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకును కాపాడుకేందుకు ఆ పేద తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. చికిత్సకు రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేయడంతో కొడుకు దీనస్థితిని చూడ లేక. వైద్యం చేయించే స్తోమతలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
అకస్మాత్తుగా స్పృహతప్పడంతో
మహబూబ్‌నగర్‌జిల్లా మద్దెలబండకు చెందిన నరసింహులు, పద్మల కుమారుడు సోమేష్(17) కొడం గల్‌లోని ఎంజేపీటీబీజీడబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాడు. టెన్‌్త(2016బ్యాచ్) పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాడు. జనవరి 23న స్కూల్లో అకస్మాత్తుగా సొమ్మసిల్లిపడిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. మెరుగైన వద్య సేవల కోసం నిమ్స్‌కు తీసుకెచ్చారు. నాలుగు మాసాల పాటు ఇక్కడే ఉంచి చికిత్సలు అందించారు. కొడుకును బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని కూడా అమ్మేశారు. శక్తికి మించి అప్పులు కూడా చేశారు. అయినా వ్యాధి నయం కాలేదు.
చికిత్సకు రూ.35 లక్షలకుపైగా ఖర్చు..
ఎలాగైనా కుమారుడిని కాపాడుకోవాలని నిర్ణయించిన తల్లిదండ్రుల ఇటీవల సీఎంసీ వెల్లూర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సోమేష్‌కు పలు పరీక్షలు చేయగా అప్లాస్టిక్ ఎనిమియా (ఫెయిల్యూర్ ఆఫ్ ఏటీజీ థెరపీ)తో బాధపడుతున్నట్లు గుర్తించారు. చికిత్సకు రూ.35 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ఆస్తులన్నీ అమ్మిన వారికి వైద్య ఖర్చులు శక్తికి మించిన భారంగా మారాయి.
కళ్లముందు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు దుస్థితిని చూడలేక.. ఖరీదైన ఈ వైద్యాన్ని చేయించే స్థోమతలేకఏం చేయాలో తెలియ ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆదుకుంటే తమ కొడుకుని కాపాడుకుంటామని వేడుకుంటున్నారు. సహాయం చేయదలిచిన దాతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎకౌంట్ నెంబర్ 62416044184లో జమ చేయవచ్చు. వివరాల కోసం 9600893382, 9441720449 నెం బరుకు ఫోన్ చేయవచ్చు.