కరోనా నియంత్రణ కష్టమేం కాదు | Doctor Vijay Says Some Guidelines To Recover From Covid 19 | Sakshi
Sakshi News home page

కరోనా నియంత్రణ కష్టమేం కాదు

Published Sat, Aug 29 2020 3:53 AM | Last Updated on Sat, Aug 29 2020 10:41 AM

Doctor Vijay Says Some Guidelines To Recover From Covid 19 - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘1918–21 వరకు మూడేళ్ల వ్యవధిలో స్వైన్‌ ఫ్లూతో ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల (5 కోట్ల) మంది చనిపోయారు. 2010లోనూ అదే జాతికి చెందిన (బలహీనమైన) వైరస్‌ మన రాష్ట్రంపై దాడి చేసింది. కానీ అప్పటికే మందు అందుబాటులో ఉండటంతో ప్రాణనష్టం అంతగా జరగలేదు. ఇప్పుడు కోవిడ్‌–19 ప్రపంచంలో మరణ మృదంగం మోగిస్తోంది. కానీ 1918–21 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మన వద్ద మంచి వైద్యం అందుబాటులో ఉంది.

ప్రజల్లో అవగాహన, చైతన్యం ఉంది. వైద్యులు సూచించిన మేరకు సలహాలు, సూచనలు పాటిస్తే కరోనాను నియంత్రించడం కష్టమేమీ కాదు. సరైన ఆహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం ఉంటే చాలు’అని షికాగోలోని ఇలినాయి హెల్త్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి స్పష్టంచేశారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని సందర్శించిన ఆయన అందులో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

అనవసర మందులు వాడితే ప్రాణాలకు ముప్పు.. 
కరోనా పాజిటివ్‌ అని తేలగానే బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు ఆస్పత్రుల్లో చేరితే చాలా మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో కరోనాపై ఎలాంటి అవగాహన లేని వైద్యులు చెప్పిన మందులు వాడుతున్నారు. ఇది మంచిది కాదు. అనుభవజ్ఞులైన వైద్యుల సలహాలు, సూచనలతోనే మందులు వాడాలి. పలు ఆస్పత్రుల్లోనయితే వైద్యులు కరోనా రోగులకు యాంటిబయోటిక్స్‌ ఇస్తున్నారు. ఎక్కువ మోతాదులో యాంటిబయోటిక్స్‌ ఇస్తే ప్రాణాలు పోతాయి.

అసలు కరోనా ఉన్న వారికి ఇవి అనవసరమనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతం డెక్సామెతసోన్‌ మాత్రతోనే వైరస్‌ను కాస్త కట్టడి చేయగలం. అమెరికాలో ఇది నిర్ధారణ అయింది. ఈ మాత్ర మార్కెట్లో రూ.5 లోపే ఉంటుంది. ఇలాంటి నిరూపితమైన మందులు మన దగ్గర వాడటం లేదు. కానీ రూ.32 వేల ఖరీదు చేసే నిరూపితం కాని యాంటి వైరల్‌ డ్రగ్స్‌ వాడుతున్నారు. ఈ విషయంలో పలు ఆస్పత్రులు తమ తీరు మార్చుకోవాలి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమూ దృష్టి సారించాలి. 

వైరస్‌ మళ్లీ మళ్లీ రావొచ్చు.. 
కరోనా చికిత్స పొందిన వ్యక్తికి మళ్లీ మళ్లీ ఆ వైరస్‌ సోకవచ్చు. సాధారణంగా వైరస్‌ సోకిన ఐదారు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. కొందరికి ఆ లక్షణాలూ ఉండవు. ఒకసారి నిర్ధారణ అయి చికిత్స పొందిన తర్వాత వైరస్‌ వెళ్లిపోతుంది. అయితే వైరస్‌ మూలాలు శరీరంలో అలానే ఉంటాయి. సదరు వ్యక్తి సరైన జాగ్రత్తలు పాటించకపోతే వైరస్‌ మళ్లీ సోకే ప్రమాదం లేకపోలేదు. 

ప్రత్యేక ఆహారమనేది లేదు... 
కరోనా రోగులు మాంసం, చేపలు, గుడ్లు వంటి బలమైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చాలా మంది అంటుంటే విన్నా. అయితే వైరస్‌ను తట్టుకోగలిగే వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ముందే ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర, వ్యాయామం చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.  

మృతదేహం నుంచి వైరస్‌ సోకదు... 
కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి వైరస్‌ సోకుతుందనే భయంతో మృతుడి కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ ఇష్టపడటం లేదు. సహజంగా కరోనా వ్యక్తి ఊపిరి తీసుకున్నప్పుడు గాలి ద్వారా లేదా అతని శరీరాన్ని ముట్టుకుంటే వైరస్‌ ఇతరులకు సోకుతుంది. చనిపోయిన తర్వాత అతను ఊపిరి తీసుకోలేడు, అతన్ని ముట్టుకునే అవకాశం ఉండదు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయ వచ్చు. ప్రజలు తరచూ శానిటైజ్డ్‌ అవుతూ ఉండాలి. సబ్బు, నీళ్లను మించిన శానిటైజర్‌ ప్రపంచంలో ఏదీ లేదు. మాస్కులు సాధారణ బట్టతో చేసినవే మేలు. 

అది ఆందోళన కలిగించేదే...
కరోనా బాధితుడికి ప్లాస్మా ఎక్కిస్తే ప్రయోజనం ఉంటుందని కొందరు వైద్యులు నమ్ముతున్నారు. ఇది వాస్తవం కాదు. బాధితుడి శరీరంలోకి ప్లాస్మా ఎక్కిస్తే రియాక్షన్‌ అయ్యే ప్రమాదముంది. ఇక 85 శాతం మందికి వైరస్‌ సోకినా లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను తట్టుకోగలిగే, వ్యాధిని నిర్మూలించగలిగే ఎలాంటి వ్యాక్సిన్‌ ప్రపంచంలో ఎక్కడా లేదు. స్వీయనియంత్రణ, రక్షణతోనే వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోగలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement