దీక్షిత్‌రెడ్డి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం కిడ్నాప్‌నకు గురైన తొమ్మిదేళ్ల బాలుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి ఇంకా కిడ్నాపర్ల చెర వీడలేదు. 82 గంటలైనా కేసు కొలిక్కి రాకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేశారు. బాలుడి తల్లి పట్టణంలో చీటీలు నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 250 మంది ఆమె వద్ద నెలవారీ చీటీ వేస్తున్నట్లు గుర్తించి, ఆ కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. కిడ్నాపర్లు సైతం బాలుడి తల్లికి మాత్రమే ఫోన్ చేస్తుండటంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటి వరకు ఆమె వద్ద చీటీలు కట్టిన వారు ఎవరు, చీటీ ఎత్తుకుని డబ్బు కట్టని వారెవరు అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
రోజంతా హైడ్రామా
మంగళవారం రాత్రి కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధా్నహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూసినా ఎవరూ రాకపోవడం, ఫోన్ కూడా చేయకపోవడంతో బాలుడి కిడ్నాప్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.
రంగంలోకి ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ కిడ్నాపర్లు చేస్తున్న ఫోన్ నంబర్లు, ఎక్కడి నుంచి చేస్తున్నారనే విషయాన్ని స్థానిక పోలీసులు ట్రేస్ చేయలేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి విషయాన్ని తెలిపారు. మరోపక్క బాలుడి తల్లిదండ్రులు నెల రోజులుగా ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఆర్థిక కార్యకలాపాలు ఎవరితో నిర్వహించారనే వివరాలు సేకరించి వారిని విచారిస్తున్నారు. మహబూబాబాద్ పోలీసులతో పాటు, ఉమ్మడి వరంగల్ టాస్‌్కఫోర్స్ సిబ్బంది పట్టణంలో ఇంటింటి తనిఖీలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్ నుంచి వచి్చన ఐటీ కోర్, సైబర్ క్రైం టీం నిపుణులు సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఇంటెలిజెన్స్ బృందాలు బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నాయి.
పోలీసుల అదుపులో కిడ్నాపర్లు?
దీక్షిత్‌రెడ్డిని కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు బుధవారం రాత్రి వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే, బాలుడిని కూడా సురక్షితంగా చేరదీసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్‌లో తెలియజేస్తామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment