మహబూబ్‌నగర్ : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం ఉల్లెంకొండ సమీపంలో 44వ జాతీయరహదారి పై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డోన్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని 108 సాయంతో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.