2 రోజులు.. రూ. 21,566 కోట్ల ప్రాజెక్టులు | Narendra Modi Will Visit In Telangana | Sakshi
Sakshi News home page

2 రోజులు.. రూ. 21,566 కోట్ల ప్రాజెక్టులు.. ప్రధాని మోదీ పర్యటన ఇలా..

Published Sat, Sep 30 2023 3:49 AM | Last Updated on Sat, Sep 30 2023 5:26 AM

Narendra Modi Will Visit In Telangana  - Sakshi

న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్న ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ రూ.21,566 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయను­న్నారు. రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం, సహజ వాయువు, ఉన్నత విద్య తదితర రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. వచ్చే నెల 1న మహబూబ్‌నగర్‌ జిల్లాలో, 3న నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తారు.

ఆయా రోజుల్లో అధికారిక కార్య­క్రమాల అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ వివరాలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

9 ఏళ్లలో 9 లక్షల కోట్లకుపైగా ఇచ్చాం 
కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం వివిధ రూపాల్లో రూ.9 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ‘‘మేం అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. రూ.26 వేల కోట్లతో రీజనల్‌ రింగు రోడ్డు నిర్మించేందుకు ముందుకొస్తే.. కేసీఆర్‌ సర్కారు ఇంతవరకు గజం భూ­మి కూడా సేకరించి ఇవ్వలేదు. ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తుంటే వాటికి హాజ­రు­కాని కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా ఉండే నైతిక  హక్కు లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదమని.. తొలి ఐదేళ్లు ఒక్క మహిళా మంత్రి లేకుండా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు మహిళలపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నాయని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎందరు మహిళలున్నారో చెప్పాలని నిలదీశారు.

దమ్ముంటే చర్చకు రావాలి.. 
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎన్నడూ చెప్పలేదని కిషన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ కుటుంబం పథకం ప్రకారం కుట్రలు పన్నుతోందని, తెలంగాణ ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతోందని ఆరోపించారు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఉండవని స్పష్టంగా చెప్పినా మళ్లీ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు రావాలి. గత 9 ఏళ్లలో తెలంగాణకోసం కేంద్రం ఏం చేసిందో నేను చెబుతా.. రాష్ట్రం ఏ చేసిందో ఆయన్ను చెప్పమనండి..’’ అని కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనే కార్యక్రమాలు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 

రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.1.10 లక్షల కోట్ల ఖర్చు 
దేశంలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రధాని మోదీ ‘హీరా’ మోడల్‌ (హెచ్‌– హైవేస్, ఐ– ఇన్ఫోవేస్, ఆర్‌– రైల్వేస్, ఏ– ఎయిర్‌వేస్‌ అభివృద్ధి)తో ముందుకెళ్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.లక్షా పదివేల కోట్ల విలువైన జాతీయ రహదారులను ఇప్పటికే కేటాయించామని చెప్పారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణం విషయంలోనూ కేంద్రం చిత్తశుద్ధితో ఉందని.. దేశవ్యాప్తంగా 2014కు ముందు వినియోగంలో ఉన్న 75 విమానాశ్రయాల సంఖ్యను ఈ తొమ్మిదేళ్లలో 150కి పెంచిందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో రాష్ట్రంలో మాత్రం ఒక్కటి నిర్మాణం కాలేదన్నారు. ఎన్నికలు వస్తుండటంతో వరంగల్‌ విమానాశ్రయానికి భూసేకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏదో కంటితుడుపు ప్రకటన చేసిందని విమర్శించారు. 

ఎంఐఎం తాటాకు చప్పుళ్లకు భయపడం.. 
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ నివాసంపై మజ్లిస్‌ కార్యకర్తలు దాడి చేయ డం సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, దాని మిత్రులు కలసి చేస్తున్న ఈ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. 

ప్రధాని పర్యటనకు భారీగా భద్రత: సీఎస్‌ 
వచ్చే నెల 1న ప్రధాని మోదీ పర్యటన ముందే ఖరారుకాగా, 3న పర్యటన మాత్రం శుక్రవారమే ఖరారైంది. ప్రధాని ఆరోజున మధ్యాహ్నం 2.55 గంటలకు సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు సైనిక హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం అవుతారు. దీనికి సంబంధించి సీఎస్‌ శాంతి కుమారి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటన కోసం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  

సర్వం సిద్ధం
ప్రధాని మోదీ పాలమూరు జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇక్కడి భూత్పూర్‌ మండల పరిధిలోని అమిస్తాపూర్‌లో సిద్ధం చేస్తున్న సభా ప్రాంగణంలోనే అధికారిక కార్యక్రమాలతోపాటు బీజేపీ సభ జరగనున్నాయి. ఇందులో రెండు స్టేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక స్టేజీ మీద నుంచి ప్రధాని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదిక వద్దకు రానున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓపెన్‌ టాప్‌ జీపును గుజరాత్‌ నుంచి తెప్పిస్తున్నారు. మహిళా బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వందలాది మంది మహిళలతో ప్రధానికి ప్రత్యేకంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి రెండు లక్షల మందికిపైగా జన సమీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ పాలమూరు సభ నుంచే శంఖారావం పూరించనుందని నేతలు చెప్తున్నారు. ప్రధాని హోదాలో మోదీ రెండోసారి పాలమూరుకు వస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన ఇక్కడ నిర్వహించిన సభకు హాజరయ్యారు.   

3న నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో.. 
►ప్రధాని మోదీ ఈ నెల 3న మధ్యాహ్నం 2.55 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని.. రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. 
►రామగుండంలో ఎన్టీపీసీ రూ.6వేల కోట్లతో చేపట్టిన థర్మల్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను ప్రారంభిస్తారు. 
►ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ (పీఎం–ఏబీహెచ్‌ఐఎం)లో భాగంగా రాష్ట్రంలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో రూ.516.5 కోట్లతో చేపట్టే 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లకు శంకుస్థాపన చేస్తారు. 
►రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన ‘ధర్మాబాద్‌ (మహారాష్ట్ర)–మనోహరాబాద్, మహబూబ్‌నగర్‌– కర్నూల్‌’ రైల్వే లైన్ల విద్యుదీకరణ (ఎలక్ట్రిఫికేషన్‌) ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. 
►రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన మనోహరాబాద్‌–సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభిస్తారు.  

పాలమూరు పర్యటన ఇలా.. 
►ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌కు చేరుకుని, సుమారు రూ.13,545 కోట్ల విలువచేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 
►మునీరాబాద్‌–మహబూబ్‌నగర్‌ ప్రాజెక్టులో భాగంగా రూ.505 కోట్లతో నిర్మించిన ‘జక్లేర్‌–కృష్ణ’ కొత్త రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. దీనిద్వారా హైదరాబాద్‌–గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇక కృష్ణ స్టేషన్‌ నుంచి ‘కాచిగూడ –రాయచూర్‌– కాచి­గూడ’ డీజిల్, ఎలక్ట్రికల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ (డెమూ) రైల్వే సర్వీసెస్ను ప్రారంభిస్తారు. 
► జాతీయ రహదారులకు సంబంధించి రూ.6,404 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్‌హెచ్‌ 365 బీబీలో భాగంగా రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యా­పేట­–ఖమ్మం 4 లేన్ల రహదారిని ప్రారంభిస్తారు. 
► రూ.2,661 కోట్ల విలువైన హసన్‌ (కర్ణాటక)– చర్లపల్లి హెచ్‌పీసీఎల్‌ ఎల్పీజీ పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేస్తారు. రూ.1,932 కోట్లతో చేపడుతున్న కృష్ణపట్నం (ఏపీ)– హైదరా­బాద్‌ ‘మల్టి ప్రొడక్ట్‌ పైప్‌లైన్‌ (డీజిల్, పెట్రోల్, కిరోసిన్, జెట్‌ ఫ్యూయల్‌)’కు శంకుస్థాపన చేస్తారు. 
►హెచ్‌సీయూలో రూ.81.27 కోట్లతో నిర్మించిన స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్, స్కూల్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ భవనాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.  

ఇదీ చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్‌’.. మరో కొత్త ఎత్తుగడ?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement