Revanth Reddy: అంచెలంచెలుగా ఎదిగి.. అధ్యక్షుడిగా.. | Reventh Reddy Appointed As TGPCC President | Sakshi
Sakshi News home page

Revanth Reddy: అంచెలంచెలుగా ఎదిగి..

Published Sun, Jun 27 2021 10:10 AM | Last Updated on Mon, Jun 28 2021 2:41 PM

Reventh Reddy Appointed As TGPCC President - Sakshi

సాక్షి, కల్వకుర్తి (మహబూబ్‌ నగర్‌): వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఎనుములు రేవంత్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి టీపీపీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి చురుకైన వ్యక్తిగా గుర్తింపు ఉంది. రాంచంద్రమ్మ, నర్సింహారెడ్డి దంపతులకు నాలుగో సంతానం ఆయన. 2003లో టీఆర్‌ఎస్‌లో చేరి కల్వకుర్తిలో క్రియాశీలకంగా పనిచేశారు. 2004 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్‌ కోసం విశ్వప్రయత్నం చేసినా.. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల పోటీ చేసే అవకాశం రాలేదు.

2006లో మిడ్జిల్‌ నుంచి జెడ్పీటీసీగా బరిలోకి దిగాలని భావించారు. కాంగ్రెస్‌ వ్యతిరేకంగా అఖిల పక్షం ఏర్పాటు చేసి.. టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి రబ్బానీపై విజయం సాధించారు. ఆ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసేతర పార్టీల జెండాలన్నింటితో ప్రచారం నిర్వహించడం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం. రెండేళ్ల తర్వాత జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి ఆయన శాసనమండలిలోకి అడుగు పెట్టారు.  

కొడంగల్‌కు వెళ్లి.. 
ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రేవంత్‌ 2008లో టీడీపీలో చేరారు. 2004లో కల్వకుర్తి టికెట్‌ ఆశించిన ఆయన మళ్లీ ఇటువైపు దృష్టి సారించకుండా కొడంగల్‌ వైపు వెళ్లారు. అక్కడ టీడీపీని బలోపేతం చేస్తూ 2009 ఎన్నికల్లో గురున్నాథ్‌రెడ్డిపై 6,989 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 14,614 ఓట్లతో మెజార్టీతో కొడంగల్‌ నుంచి రెండోసారి విజయం సాధించారు. ఓటుకు నోటు కేసు, తెలంగాణలో టీడీపీ బలహీనపడడం, మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన 2017లో ‘హస్తం’ గూటికి చేరారు. తక్కువ సమయంలోనే టీపీపీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2018 ఎన్నికల్లో కొడంగల్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి విజయం సాధించారు.  

ఫిబ్రవరి మొదటి వారంలో మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేటలో ఒకరోజు దీక్షకు వచ్చిన ఆయన అక్కడ ప్రసంగించి ఆ చట్టాలు రద్దు చేయాలని హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆరోజు నుంచి అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.  

పార్టీ శ్రేణుల్లో ఆనందం... 
రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి పదవి రావడంతో ఉమ్మడి జిల్లాలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్వీట్లు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు రేవంత్‌కు ఇవ్వడం వల్ల కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement