
సాక్షి, మహబూబ్నగర్ : బిజినేపల్లి మండలంలోని వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా హెచ్‌సీఏ కంపెనీ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గత నెల 27న ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్ర చేపట్టడంతో తిమ్మాజిపేట సమీపంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడారు. 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని.. లేకుంటే తమతోపాటే పాదయాత్రలో పాల్గొంటానని చెప్పడంతో నిర్వాసితులు ప్రగతి భవన్ ముట్టడికి 15 రోజుల విరామం ప్రకటించారు.
20 రోజులైనా ఎమ్మెల్యే చెప్పిన హామీ నెరవేరకపోవడంతో ఐదురోజులుగా రిజర్వాయర్ పనులను అడ్డుకొని ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో గత నెల ఎక్కడైతే పాదయాత్ర విరమించారో అక్కడి నుంచే ప్రగతిభవన్ ముట్టడికి పాదయాత్రగా బయలు దేరుతామని ప్రకటించారు. సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరాల్సిన పాదయాత్రకు కొన్ని అవంతరాలు ఎదురైన ముంపు గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తిమ్మాజిపేట సమీపంలోని గుమ్మకొండ వరకు వచ్చి అక్కడి నుంచి పాదయాత్రగా మర్రికల్ గ్రామ సమీపంలోని నాగర్‌కర్నూల్ జిల్లా పరిధి దాటగానే పోలీసులు అడ్డుకున్నారు.
పలువురి సంఘీభావం..
రైతురాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ, జనసేన నాయకుడు లక్ష్మణ్‌గౌడ్ మాట్లాడుతూ స్వరాష్టంలో రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో రైతులకు ఇచ్చిన పరిహారాన్ని తమకు ఇవ్వమని కోరుతున్నామని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతుంటే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. భూ నిర్వాసితులకు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు రమేష్‌నాయక్ సంఘీభావం ప్రకటించారు.
రోడ్డుపైనే రైతుల రాస్తారోకో
రైతుల పాదయాత్ర జడ్చర్ల శివారులో పోలీసులు అడ్డుకోవడంతో యుద్ధరంగాన్ని తలపించింది. తిమ్మాజిపేట మండలం మరికల్ దాటి జడ్చర్ల మండలం బూర్గుపల్లి శివారులోకి రాగానే నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ డీఎస్పీలు లక్ష్మీనారాయణ, భాస్కర్‌తోపాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, అదనపు బలగాలు అడ్డుకోవడంతో రైతులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. పాదయాత్రలో ఉన్న రైతురాజ్యం పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, నాగర్‌కర్నూల్ జనసేన నాయకుడు లక్ష్మణ్‌గౌడ్, రైతులు ఉమేష్, ప్రవీణ్, శ్రీనునాయక్, ఘమ్లీలతోపాటు పలువురిని పోలీసులు అరెస్టుచేసి వాహనాల్లో జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మహిళలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ కడుపుల్లో మట్టికొడుతున్నారని, సీఎంతో మాట్లాడే అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. పోలీసులు వారి మాటలు పట్టించుకోకుండా అరెస్టు చేస్తుండటంతో పలువురు రైతులు పొలాల వెంట పరుగులు తీసి తప్పించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు 67 మంది నిర్వాసితులను రెండు డీసీఎంలలో బలవంతంగా ఎక్కించి జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు, మరికొందరిని మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాదయాత్రికుల వెంట ఉన్న ట్రాక్టర్లను, పాదయాత్రలో భాగంగా రైతులు వంటావార్పు చేసుకునేందుకు సామగ్రిని తీసుకువచ్చిన వాహనాలను సైతం పోలీసులు స్వాధీనపర్చుకోవడం ఆందోళనకారులకు ఆగ్రహం తెప్పించింది.
ఆందోళనలు కొనసాగిస్తాం..
పాదయాత్ర సందర్భంగా తిమ్మాజిపేటలో కొద్ది సేపు విలేకరులతో నిర్వాసితులు మాట్లాడారు. ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన పరిహారం తరహాలోనే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిహారం ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పరిహారం వచ్చే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.